కార్యశూరుడూ – కామమ్మ మొగుడు

Vardhelli Murali Article On AP Politics TDP Chandrababu Naidu - Sakshi

జనతంత్రం

ఎదిగే పిల్లల మధ్య పోలికలు తేవద్దంటారు మానసిక నిపుణులు. ఇది పెంపకానికి సంబంధించిన సూత్రం. ఎంపిక చేసుకోవడానికి సంబంధించిన సూత్రం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. అది కూరగాయల ఎంపికైనా సరే... ఇంకే కొనుగోలు వ్యవహారమైనా సరే! ఎందుకంటే ‘డబ్బులు ఊరికే రావు కదా’! నిగనిగలాడే బోడిగుండుతో ఒకాయన ప్రతిరోజూ టీవీల్లో కనపడి ఈ విషయంపై హెచ్చరిస్తూనే ఉంటాడు. ఈ ఒక్క క్యాంపెయిన్‌తో ఆయన యాంకర్‌ సుమతో సమానమైన పాపులారిటీ తెచ్చుకోగలిగారు. తన వ్యాపారాన్ని పెంచుకో గలిగారు. అట్లుంటది మరి పబ్లిసిటీతోటి!

బ్రాండింగ్, పబ్లిసిటీ, మార్కెటింగ్‌ల సహకారంతో పుచ్చు కూరలూ, పచ్చళ్లు కూడా అమ్ముకోవచ్చు. అలాగే సొంత మీడియా చేతిలో ఉంటే నాయకుల్ని తయారుచేయవచ్చు, వీలైతే గద్దెపై కూడా కూర్చోబెట్టొచ్చునన్న ఆలోచన నేటి యెల్లో మీడియా ఆద్యులకు ఆనాడే వచ్చింది. ‘ఓన్లీ విమల్‌’ అనే ఒకే ఒక్క యాడ్‌ క్యాంపెయిన్‌ టెక్స్‌టయిల్‌ సింహాసనంపై నుంచి ‘రేమండ్స్‌’ను దించేసి, ‘రిలయన్స్‌’ను కూర్చోబెట్టింది. ఈ దృష్టాంతం వారికి స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు. ‘ఓన్లీ ఎన్టీఆర్‌’ తరహా ప్రచారంతో కాంగ్రెస్‌ కోటను కూల్చగలిగారు. తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తేగలిగారు. ఆయన నిజంగానే ‘ఓన్లీ ఎన్టీఆర్‌’. ఒన్‌ అండ్‌ ఓన్లీ పీస్‌! పబ్లిసిటీ తోడవగానే కార్యసాధకుడు కాగలిగాడు.

ఎన్టీఆర్‌తో తమ సొంత ప్రయోజనాలకు పెద్దగా ఉపయోగం లేదనుకున్న యెల్లో ముఠా ఆయన్ను వదిలించుకొని బాబును గద్దెపై కూర్చోబెట్టడం మనకు తెలిసిన గతం. ప్రత్యామ్నాయ మీడియా లేకపోవడం వల్ల ఏకపక్ష రాతలతో ఈ పరిణామం సాధ్యమైంది. ఈ బాబు స్వతహాగా ఓన్లీ బాబు కాదు, శతకోటి బాబుల్లో చంద్రబాబొకరు! జస్ట్‌ యావరేజ్‌. కాకపోతే పాలిటిక్స్‌లో ఇతనిది మాకివెలియన్‌ స్కూల్‌. అడ్డదారిలోనైనా లక్ష్యాన్ని చేరాలనే తత్వం. చేతికందిన అధికారాన్ని సొంత ప్రయోజనాల కోసం, ముఠా ప్రయోజనాల కోసం యథేచ్ఛగా వాడుకోగల దూకుడు స్వభావం. ఈ స్వభావం ఫలితంగా బాబుకూ, యెల్లో మీడియా పెద్దలకూ మధ్య ఒక రసాయనిక బంధం ఏర్పడింది. యెల్లో ముఠా పోస్టర్‌ బాయ్‌గా బాబు అవతరించాడు.

చంద్రబాబును ఓన్లీ బాబుగా, ఒన్‌ అండ్‌ ఓన్లీ పీస్‌గా భ్రమింపచేయడానికి యెల్లో ముఠా చేయని ప్రయత్నం లేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో కూడా లాబీయింగ్‌ చేసి మీడియా మేనేజ్‌మెంట్‌కు కూడా దిగజారారు. ఆయన్నొక విజనరీగా చిత్రించడానికి ఆపసోపాలు పడ్డారు. ఈ విజనరీ హయాంలో వ్యవసాయ భూములు బీళ్లుగా మారాయి. పంట పొలాల్లో రైతుల చితిమంటలు వెలిగాయి. లక్షలాదిమంది పేదబిడ్డలు చదువుకొనలేక డ్రాపవుట్లుగా మిగిలిపోయారు. పంతుళ్లకూ, పాఠాలకూ దూరమైన ప్రభుత్వ స్కూళ్లు పాడుబడి పోయాయి. ఆరోగ్యం అంగడి సరుకైంది. రోగం రాకడ... ప్రాణం పోకడగా పేదల పరిస్థితి దిగజారింది. ఇటువంటి వల్లకాటి అధ్వాన్న శకాన్ని బాబు బ్రాండ్‌ వైభవోజ్జ్వల మహా యుగంగా యెల్లో మీడియా చిత్రించింది.

ఈ తరహా చిత్రీకరణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నిజం చెప్పాలంటే ఆయనొక విఫల ప్రయోగం. ఆ విఫల ప్రయోగాన్ని విజయగాథగా చరిత్రలోకి జొప్పించే కుట్రలు జరుగుతున్నాయి. విధ్వంసకర విధానాల కృతికర్తకు అభివృద్ధి భుజకీర్తులు తగి లించి, ఇంకా స్తోత్రాలు పఠిస్తూనే ఉన్నారు. పళ్లూడి దవడలు జారిన వృద్ధ రంగస్థల నటికి ఊర్వశి వేషం కట్టి లొట్టలేసుకుంటూ చూడాలని ఇంకా ఆర్డర్లు వేస్తూనే ఉన్నారు. నిలువెత్తు స్వార్థ ప్రతిమపై జలతారు మేలిముసుగులు కప్పుతున్నారు. వికృత అవినీతి రూపానికి కాస్మెటిక్‌ సర్జరీ చేసి సింబల్‌ ఆఫ్‌ ఇంటిగ్రిటీగా నమ్మాలని ఆదేశిస్తున్నారు.

‘కామమ్మ మొగుడంటే కామోసు అనుకున్నా’డనే సామెతొ కటి ఉన్నది. పూర్వం ఒక దొంగసాధువు ఒక ఊరి కొచ్చాడట. ఓ గ్రామస్థుడతనికి ఎదురయ్యాడు. చాలాకాలం క్రితం పారి పోయిన కామమ్మ మొగుడి పోలికలు ఆ సాధువులో గ్రామ స్థుడికి కనిపించాయి. ఇంకేముంది ఇదిగో పులి అదిగో తోక! ఆనోటా ఈనోటా అదే మాట. తాను నిజంగానే కామమ్మ మొగుడినని దొంగస్వామి డిసైడై కాపురం చేద్దామని బయల్దే రాడట. సదరు కామమ్మ గట్టిగా నిలదీసేసరికి ‘నాకేం తెలుసు, అందరూ కామమ్మ మొగుడంటుంటే కామోసు అనుకున్నాన’ని వాపోయాడట!

చంద్రబాబును ఒక సూపర్‌ బ్రాండ్‌గా నిలబెట్టడం కోసం గత పాతికేళ్లుగా యెల్లో మీడియా రాసిన కవిత్వమంతా ఆయన మెదళ్లోకి బాగా ఎక్కిపోయింది. అదంతా నిజమేనని నమ్మడం మొదలుపెట్టారు. ఆ భ్రమలోంచే ఆయన అనేక ఆణిముత్యా లను నోటి వెంట తుపుక్కు తుపుక్కుమని పలుమార్లు వెదజల్లారు. ఈ దేశానికి సెల్‌ఫోన్‌ను పరిచయం చేసింది తానేనని చెప్పారు. సత్యా నాదెళ్లను ఐటీలో ప్రోత్సహించింది తానేనని చెప్పారు. పీవీ సింధుకు మోటివేషన్‌ గురువు తానేనని చెప్పారు. అబ్దుల్‌ కలామ్‌ను రాష్ట్రపతిని చేసింది తానేనని అనేకసార్లు అన్నారు. బస్సులో కూర్చొని తాను తుపాన్లను కంట్రోల్‌ చేశానన్నారు. ‘నేను ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లూ’ అని ప్రశ్నించి కరోనా కూడా తనను చూసి పారిపోతుందని పరోక్షంగా చెప్పారు. గతంలో తాను రెయిన్‌గన్‌ చేతబూని, కరువు రక్కసిని తరిమి తరిమి కొట్టానని ప్రకటించుకున్నారు.

వేరేవాళ్లెవరైనా ఇటువంటి మాటలు మాట్లాడితే వినేవాళ్లు ఏమనుకుంటారు? పూర్వకాలంలో పండుగలకూ పబ్బాలకూ గ్రామాల్లో అడుక్కోవడానికి పలురకాల వేషాలతో పలువురు యాచకులు వచ్చేవారు. వారిలో పిట్టల దొర పాత్ర ఒకటి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పాత్రను ‘లత్కోర్‌ సాబ్‌’ అని కూడా పిలుస్తారు. ‘మన్నించండి మారాజా ఆలస్యమైంది. ఏం జేస్తాం మారాజా... పొద్దున లేవంగనే పీఎమ్‌ ఫోన్, సీఎం ఫోన్, ప్రెసిడెంట్‌ ఫోన్, గవర్నర్‌ ఫోన్‌... వాళ్లందరికీ సర్దిచెప్పి, సలహా చెప్పి, ధైర్యం చెప్పేసరికి పొద్దుపోయింది. బయటకొచ్చి చూస్తే విమానం తోలే డ్రైవర్‌ రాలే, హెలికాప్టర్‌ టైర్ల గాలి లేదు. అందుకని నడుచుకుంట వచ్చేసరికి లేటైంది మారాజా...’ ఇట్లా ప్రారంభమౌతాయి పిట్టల దొర డైలాగులు. విదూషకుని మాటలు కనుక జనం కూడా నవ్వుకునేవారు. విదూషకుని మాటల్లానే విజనరీ నేతల మాటలు కూడా ఉంటే ఏం చేయాలి? నవ్వాలా... ఏడవాలా? జనానికి ఇదో సందిగ్ధావస్థ.

యెల్లో మీడియాకు, దాని అనుంగు కూటమికి ఇప్పుడు చాలా పెద్ద కష్టమొచ్చిపడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబును గెలిపించాలి. గెలిపిం చకపోతే దెబ్బకు ఠా దొంగల ముఠా! ఇక యెల్లో ముఠా ఆగడాలకు ముకుతాడు పడినట్లే! అందు కని చావోరేవో తేల్చుకునే పోరుకు తెగించారు. గెలవాలంటే ఏకకాలంలో రెండు పనులు జరగాలి. జావగారిపోతున్న చంద్రబాబు పర్సనాలిటీకి బిగదీసి ప్యాడింగ్‌ చేయాలి. సకలజన సాధికారత పథకాలతో పెరిగిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇమేజిని డ్యామేజీ చేయాలి. యెల్లోమీడియా, దాని మిత్ర బృందాలు ఈ కర్తవ్య సాధన కోసం కంకణాలు కట్టుకున్నాయి. మూడు షిప్టులూ పనిచేస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం అసత్యాలను పోగేసి కాకమ్మ కథలను అచ్చేస్తున్నాయి.

యెల్లో మీడియా గ్రూప్‌ లీడరైన ‘ఈనాడు’ రాస్తున్న బేతాళ కథనాలను సాక్ష్యాధారాలతో చీల్చిచెండాడుతూ ‘సాక్షి’ పత్రిక నిజానిజాలను నిగ్గుతేల్చుతున్నది. అయినా సరే, ‘నవ్విపోదురు గాక నాకేటి వెరపు’ అన్నట్లున్నది ‘ఈనాడు’ ధోరణి. సందర్భం ఏదైనా సరే, స్పందనలు ఎలా ఉన్నా సరే.. చంద్రబాబు రైట్‌. ముఖ్యమంత్రి రాంగ్‌. ఇదీ యెల్లో మీడియా రూల్‌ బుక్‌లో మొదటి పాఠం. మొన్నటి గోదావరి వరదల సందర్భాన్నే తీసుకుందాము. ప్రకృతి విపత్తులను ఎదు ర్కోవడం, సహాయ – పునరావాస చర్యల కోసం ‘డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ (డీఆర్‌ఆర్‌) పేరుతో ఐక్యరాజ్య సమితి నిర్దిష్టమైన విధివిధానాలను రూపొందించింది.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ అవసరాలకు తగ్గట్టుగా ఈ విధానాలను పాటిస్తాయి. అంతర్జాతీయ స్థాయి నిపుణులు రూపొందించిన విధానాలు ఇవి. వరదలు రాగానే ముఖ్యమంత్రి కలెక్టర్ల నేతృత్వంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. సహాయ – పునరావాసాలకు అవసరమైన అన్ని వనరులనూ వారికి అందుబాటులో ఉంచారు. ఇతర జిల్లాల నుంచి కూడా అవసరమైనంత మేరకు సిబ్బందిని తరలించారు. ముఖ్యమంత్రి రాజధాని కేంద్రంలో నిరంతరం అందుబాటులో ఉండి కార్యక్రమాలను పర్యవేక్షించారు.

మొదటిరోజో, రెండోరోజో ముఖ్యనేత ఆ ప్రాంతాలను సందర్శిస్తే ముఖ్యనేత పర్యటన ఏర్పాట్లలో యంత్రాంగం మునిగిపోతుందని, ఇది వాంఛనీయం కాదని నిపుణులు చెబుతారు. పలు దేశాలు ఈ పద్ధతిని పాటిస్తాయి. వైఎస్‌ జగన్‌ ఈ పద్ధతిని అనుసరిస్తూనే దీన్ని మరింత సృజనాత్మకం చేశారు. వారం రోజుల తర్వాత తాను వరద ప్రాంతాలను సందర్శి స్తానని, తమకు ప్రభుత్వ సాయం అందలేదనే గొంతు అప్పుడు వినపడకూడదనే షరతును ముఖ్యమంత్రి అధికారులకు విధించారు. దీంతో అధికార యంత్రాంగం అహోరాత్రులు శ్రమించి చరిత్రలో ఎన్నడూ లేనంత సమర్థంగా సహాయ చర్యల్ని చేపట్టింది.

వైపరీత్యాల తర్వాత వారం రోజులకు ప్రభుత్వాధినేతలు పర్యటనకు వెళ్లడం మన దేశంలో ఒక సాహసం. సహాయక చర్యలు అందని ప్రజలు తీవ్ర ఆగ్రహా వేశాలతో ఉంటారు. వారిని సముదాయించడం శక్తికి మించిన పనవుతుంది. మొదటి రెండు మూడు రోజుల్లో వెళ్లొస్తే ఈ పరిస్థితులు ఎదురుకావు. కానీ విచిత్రంగా వారం రోజుల తర్వాత పర్యటనకు వెళ్లినా జగన్‌ను బాధితులు ఆత్మబంధువు లాగానే స్వాగతించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా తమకు సాయం అందలేదని చెప్పలేదు. ఇందుకు కారణం ముఖ్య మంత్రి అనుసరించిన శాస్త్రీయ కార్యాచరణ.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే రాతలు రాయడం, చంద్రబాబు ఇమేజిని పెంచే ప్రచారం చేయడం అనే యెల్లోమీడియా ఎత్తుగడ ఆత్మహత్యాసదృశం కాబోతున్నది. గతించిన కాలం మాదిరిగా యెల్లో మీడియా ఆడింది ఆట పాడింది పాట అనే పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్రత్యామ్నాయ మీడియా ఉన్నది. సోషల్‌ మీడియా ఉన్నది. రకరకాల మార్గాల్లో ప్రజలకు నిజానిజాలు తెలుస్తున్నవి. వైఎస్‌ జగన్, చంద్ర బాబుల వ్యక్తిత్వాల పట్ల ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉన్నది. వ్యక్తిత్వంలోగానీ, విజన్‌లో గానీ, పాలనా సామ ర్థ్యంలోగానీ, పారదర్శకతలో గానీ, సామాజిక దృక్పథంలోగానీ జగన్‌ ముందు చంద్రబాబు సరితూగలేడు.
ప్రజలకిచ్చిన ఒకే ఒక్క మాట కోసం ఆనాడు సర్వ శక్తిమంతురాలైన భారత సామ్రాజ్ఞి హుకుంనామాను ధిక్క రించిన ధీశాలి జగన్‌. ఆ మార్గంలో వెళితే కష్టాల పాలవుతాననీ, కడగండ్లెదురవుతాయనీ తెలిసినా వెనుకడుగేయని మనో నిబ్బరం జగన్‌ సొంతం.

నమ్మి చేరదీసిన మామను గొంతుకోసి గద్దెనెక్కిన కుటిల స్వభావం చంద్రబాబుది. నిరంతరం కుట్రలూ, కూహకాలలో మునిగితేలుతూ అధికారాన్ని కాపాడుకునే దుర్నీతి బాబుది. అధికారం కోసం అలవిమాలిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానిఫెస్టోను మాయం చేసి హామీలను అటకెక్కించే మోసపూరిత నడవడి చంద్రబాబుది. ఆనాడు ‘రైతు రుణమాఫీ హామీ’ ఇవ్వకపోతే ఓడిపోతావని పలువురు హెచ్చరించినా ఓటమికైనా సిద్ధపడ తాను కానీ, నిలబెట్టుకోలేని మాటను ఇవ్వలేనని కుండబద్దలు కొట్టిన స్థిరచిత్తం జగన్‌ది.

అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే చేపట్టిన పరిపాలనా సంస్కరణలకు ఈరోజున దేశమంతా జైకొడు తున్నది. కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న తీరు జగన్‌ పరిపాలనా సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపం చంలో ఎన్నిచోట్ల నుండి ఎన్ని ప్రశంసలు వచ్చినా వాటిని ప్రచారంలో పెట్టుకోకపోవడం జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వపు మరో ప్రత్యేకత. మూడేళ్లలో లక్షా అరవై ఐదు వేల కోట్ల రూపా యలను ప్రజలకు డీబీటీ పద్ధతిలో బదిలీ చేయడం, పైసా దుర్వినియోగం కాకపోవడం దేశంలో ఒక రికార్డు.

దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, మహిళల సాధికారత కోసం అమలుచేస్తున్న ఆర్థిక, రాజకీయ ఉద్దీపన కార్యక్రమాలు ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎన్నడూ కనీవినీ ఉండలేదు. బీసీలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లుండాలని పార్లమెంట్‌లో బిల్లు పెట్టిన రాజకీయ పార్టీ ఈ దేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే. కాగా, బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖలు రాసిన చరిత్ర చంద్రబాబుది. ఎస్‌సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఈసడించుకునే దురహంకారం చంద్రబాబు సొంతం.

దళితుల్ని ఉపముఖ్యమంత్రులు, కీలక శాఖల సారథులుగా ఎంపిక చేసుకున్న సౌభ్రాతృత్వం జగన్‌ నైజం. స్థానిక సంస్థల్లోనూ, నామినేటెడ్‌ పనుల్లోనూ, పదవుల్లోనూ సగభాగం మహిళలకు కేటాయించి మంత్రివర్గంలో హోమ్‌ శాఖతో సహా కీలక శాఖలను కట్టబెట్టిన ఘనత జగన్‌ ప్రభు త్వానిది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అని మాట్లాడే పురుషాహంభావం చంద్రబాబుది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటి గురించి మాట మాత్రపు ప్రస్తావనైనా లేకుండా అక్కడక్కడ దొర్లే చిన్నచిన్న పొరపాట్లపై భూతద్దాలు వేసే వికృత పాత్రికేయానికి యెల్లో మీడియా పాల్పడుతున్నది. ఎగసిపడుతున్న విప్లవ కెరటాలు దాచేస్తే దాగేవి కావు. ఎల్లో మీడియా కళ్లు మూసుకుంటే లోకం చీకటి కాబోదు!

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top