ఇంత దారుణమా?! | Sexual Offenses on University Campuses | Sakshi
Sakshi News home page

ఇంత దారుణమా?!

Mar 2 2024 12:43 AM | Updated on Mar 2 2024 12:43 AM

Sexual Offenses on University Campuses - Sakshi

ఉన్నత విద్యాసంస్థల్లో చేరే విద్యార్థినులు గతంతో పోలిస్తే 44 శాతం పెరిగారని మొన్న జనవరిలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఘనంగా ప్రకటించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల పిల్లలు ఎక్కువుండటం శుభసూచకమని చెప్పింది. కానీ ఆడపిల్లల భద్రత విషయంలో ఉన్నత విద్యాసంస్థలు శ్రద్ధ పెడుతున్నాయా? వాటిని పర్యవేక్షించాల్సిన వ్యవస్థలు ఆ సంస్థలను అప్రమత్తం చేస్తు న్నాయా? గుజరాత్‌లోని గాంధీన గర్‌లో కొలువుదీరిన గుజరాత్‌ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (జీఎన్‌ఎల్‌యూ) వాలకం చూస్తే ఏదీ సక్రమంగా లేదన్న సందేహం కలుగుతుంది.

నిరుడు సెప్టెంబర్‌లో మీడియాలో వచ్చిన కథనాలను గుజరాత్‌ హైకోర్టు పరిగణనలోకి తీసుకుని నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సునీతా అగర్వాల్, జస్టిస్‌ అనిరుద్ధ పి. మయీల నేతృత్వంలోని ధర్మాసనాన్ని దిగ్భ్రాంతి పరిచింది. ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సాగుతున్నలైంగిక నేరాలను కప్పిపుచ్చటానికి బాధ్యతాయుత స్థానాల్లో వున్న వారు ప్రయత్నించటం భీతి గొలుపుతున్నదని న్యాయమూర్తులు అన్నారంటే అక్కడి పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థమ వుతుంది.

ఈ తరహా అకృత్యాలు, వికృతాలు రాజకీయ నాయకుల అండదండలు లేకుండా సాగవు.  ఒక ‘పలుకుబడిగల రాజకీయ నాయకుడు’ ఇలాంటి నేరగాళ్లకు వత్తాసుగా ఉన్నాడని ఒక విద్యార్థిని చెప్పటం గమనార్హం. డైరెక్టర్, రిజిస్ట్రార్, మరికొందరు అధ్యాపకులపై సైతం ఆరోపణలు రావటం గమనిస్తే విశ్వవిద్యాలయం తోడేళ్ల పాలయిందా అన్న సందేహం తలెత్తుతుంది.

ప్రపంచీకరణకు తలుపులు బార్లా తెరిచాక దేశంలో ఉన్నత విద్యాసంస్థలు కళ్లు తేలేయటం మొదలైంది. సామాజిక శాస్త్రాల అధ్యయనం మహాపాపమని పాలకులే ప్రచారం చేయటం, విద్యార్జన అంతిమ ధ్యేయం కొలువులు సాధించటం మాత్రమేనన్న అభిప్రాయం కలిగించటం ఉన్నత విద్యాసంస్థలను క్రమేపీ దిగజార్చాయి. తాము ఈ సమాజం నుంచి వచ్చామని, తమ మేధస్సును దీని ఉన్నతికి వినియోగించాలన్న స్పృహ విద్యార్థుల్లో కరువైంది. చాలా ఉన్నత విద్యా సంస్థలు ఇప్పుడు కుల, మత, ప్రాంతీయ జాడ్యాల్లో కూరుకుపోయాయి.

ఆడపిల్లల హాస్టళ్లలో సైతం ర్యాగింగ్‌లు సాగుతుండటం, కొందరు సస్పెండవుతున్నట్టు వార్తలు రావటం యాదృచ్ఛికం కాదు. వర్తమానంలో సినిమా హీరోలూ, క్రికెటర్లూ, ప్రపంచ సంగీత దిగ్గజాలూ ఆరాధ్య దైవాలవు తున్నారు. మాదకద్రవ్యాల సంగతి సరేసరి. ఇన్ని కశ్మలాల మధ్య కూనారిల్లుతున్న విద్యాసంస్థలు రాణిస్తాయని, విద్యార్థులకు వివేకాన్నీ, విజ్ఞానాన్నీ అందిస్తాయని నమ్మటం అమాయత్వమే అవుతుంది. జీఎన్‌ఎల్‌యూలోని దారుణాలపై కనీసం అయిదేళ్లుగా ఆరోపణలు వినబడుతున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో మారుపేర్లతో కొందరు విద్యార్థినులు తమకెదురైన చేదు అనుభవాలను ఏకరువు పెట్టిన ఉదంతాలున్నాయి.

అటువంటి ఉదంతం ఆధారంగా మీడియాలో వచ్చిన కథనమే గుజరాత్‌ హైకోర్టును రంగంలోకి దించింది. కానీ విశ్వ విద్యాలయం ఏం చేసింది? చర్యల మాట అటుంచి... సాక్షాత్తూ హైకోర్టు ధర్మాసనమే అడిగిందన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా రిజిస్ట్రార్‌ బుకాయింపులకు దిగాడు. ఈ మహానుభావుడే అంతక్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టిన ఇద్దరు విద్యార్థినులను మందలించాడు. ఆఖరికి బాలికల హాస్టల్‌ వార్డెన్‌గా ఉన్న మహిళా ప్రొఫెసర్‌ సైతం వారిని భయపెట్టి ఆ పోస్టులను తొలగింపజేశారు. సంస్థ కీర్తిప్రతిష్ఠలు దెబ్బతింటాయన్న సాకుతోనే ఇదంతా సాగించారు.

పేరుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) వుంది. ఒక మహిళా ప్రొఫెసర్‌ నేతృత్వంలోనే సాగుతోంది. కానీ ఆ కమిటీకి ఫిర్యాదు చేయటం దండగ అనుకున్నారో, దానిగురించి తెలియనే తెలియదో ఏ బాలికా వారికి ఫిర్యాదు చేయలేదు. కనీసం ఆ కమిటీ తనంత తానే విచారణ జరపాలి కదా... ఆ పని కూడా జరగ లేదు. తొలుత దారుణాలు తన దృష్టికొచ్చాక హైకోర్టు నియమించిన కమిటీలో ఐసీసీ చైర్‌పర్సన్‌కు కూడా చోటిచ్చారు. కానీ ఆమె గారి నిర్వాకం తెలిశాక ఆ కమిటీని రద్దుచేసి విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో మరో కమిటీని ఏర్పాటు చేశారు. కనుకనే ఈ అకృత్యాలు వెలుగు లోకొచ్చాయి. 

విద్యార్థుల్లో జిజ్ఞాస రేకెత్తించటం, తార్కిక శక్తిని పెంచటం, స్ఫూర్తి రగల్చటం, వారిని సామా జిక మార్పులకు చోదకశక్తులుగా మార్చటం ఉన్నత విద్య లక్ష్యం. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వంటిచోట తమ పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు ఎందుకు ఆసక్తి చూపుతారు? అక్కడైతే అత్యున్నత ప్రమాణాలున్న న్యాయవిద్య అందుతుందని, ఆ విశ్వవిద్యాలయంలో నిర్వహించే సెమి నార్లు, ఇతర సదస్సులు తమ పిల్లలను ఉన్నతశ్రేణికి చేరుస్తాయని వారు ఆశిస్తారు. కానీ జరిగిందేమిటి? రేపన్నరోజున న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి సమాజంలోని దురంతాలను అంతం చేయాల్సినవారే బాధితులుగా మారారు. ఎవరికి చెప్పుకోవాలో, ఎట్లా ఎదుర్కొనాలో తెలియని నిస్సహాయ స్థితిలో పడ్డారు.

2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం తర్వాత జస్టిస్‌ జేఎస్‌ వర్మ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్భయ చట్టం వచ్చింది. విద్యాసంస్థల్లోనూ, పనిస్థలాల్లోనూ బాలికలకు, మహిళకు భద్రత కల్పించటం వ్యక్తుల, సంస్థల బాధ్యతగా ఆ చట్టం గుర్తించింది. విఫల మైన పక్షంలో కఠినంగా దండించే నిబంధనలున్నాయి. కానీ జరిగిందేమిటి? ఈ దురంతాలపై లోతుగా విచారణ జరగాలి. నేరగాళ్లకూ, వారికి తోడ్పడిన పెద్దలకూ కఠినశిక్షలు పడేలా చర్యలుండాలి. దేశంలోని ఉన్నత విద్యాసంస్థలన్నిటికీ ఆ చర్యలు ఒక హెచ్చరిక కావాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement