జనాభా రాజకీయం

Sakshi Editorial On Yogi Adityanath Unveils Population Policy

ఇద్దరు పిల్లలు ముద్దు... ఆపై ఇక వద్దు! తలకిందుల ఎర్ర త్రికోణం, చిన్న కుటుంబం బొమ్మతో... ఒక తరానికి సుపరిచితమైన కుటుంబ నియంత్రణ (కు.ని.) ప్రచార నినాదం ఇది. నలభై ఏళ్ళ పైచిలుకు క్రితం ఇందిరా గాంధీ హయాంలోని కేంద్ర సర్కార్‌ చేపట్టిన ఉద్యమ విధానం అది. అప్పట్లో ఆ విధానమెంత విజయవంతమైందీ, సంజయ్‌ గాంధీ సారథ్యంలో బలవంతపు కు.ని. శస్త్రచికిత్సలు ఎలా వివాదాస్పదమైందీ వేరే కథ. కానీ, ఇప్పుడు ఇద్దరు పిల్లలు దాటకుండా ఉంటేనే ప్రభుత్వ సాయమంటున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌. ఇద్దరి కన్నా ఎక్కువ సంతానం ఉంటే ప్రభుత్వ పథకాలకూ, పదోన్నతులకూ, ఉద్యోగాలకూ, స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి కూడా అనర్హులనే జనాభా నియంత్రణ బిల్లును ఆ రాష్ట్ర లా కమిషన్‌ ప్రకటించడం చర్చ రేపుతోంది. 

ఒక సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రతిపాదన చేస్తున్నారని కొందరి వాదన. విద్య, సామాజిక చైతన్యం అంతగా లేని గ్రామీణ, సామాజిక బలహీన వర్గాల ప్రయోజనాలను ఈ బిల్లు దెబ్బతీస్తుందని విశ్లేషకుల మాట. కాంగ్రెస్, సమాజ్‌వాదీ లాంటి ప్రతిపక్షాలు ఈ బిల్లును విమర్శిస్తుంటే, మిత్రపక్షమైన జేడీయూ, సాక్షాత్తూ వీహెచ్‌పీ సైతం విభేదించడం గమనార్హం. కానీ, జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవ వేళ రానున్న పదేళ్ళ కాలానికి ‘జనాభా విధానం ముసాయిదా’ను ఆవిష్కరించిన యోగి... ఇద్దరు సంతానమే ఉండాలనే విధానంపై తనదైన వివరణ ఇచ్చారు. అధిక జనాభా వల్ల దారిద్య్రం పెరుగుతుందనీ, కాబట్టి దేశంలోనే అత్యధిక జనాభా గల రాష్ట్రమైన యూపీ ప్రజల్లో చైతన్యం తేవాలనీ ఈ కాషాయాంబరధర ముఖ్యమంత్రి చెప్పిన మాటల్లో కొట్టిపారేయడానికేమీ లేదు. కానీ సంతానాన్ని బట్టే సంక్షేమ పథకాలన్న మాటే తేనెతుట్టెను కదిలించింది. 

నిజానికి, ‘పరిమిత కుటుంబం... అది పరిమళ కుసుమ కదంబం’ అంటూ ఒకప్పుడు రేడియోలో మారుమోగిన కవి వాక్కు మన దేశమంతటికీ వర్తిస్తుంది. సందేహం లేదు. మన పక్కనే ప్రపంచంలోకెల్లా అధిక జనాభాతో చైనా ఇప్పటికీ సతమతమవుతూనే ఉంది. అందుకే, నియంత్రణ కోసం ఇద్దరే సంతానమనే షరతు పెట్టింది. చైనాతో పాటు వియత్నాం లాంటి దేశాలు జనాభా చట్టాన్ని అమలు చేశాయి. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 2001–11 మధ్య కాలంలో భారతదేశ సగటు జనాభా పెరుగుదల 17.7 శాతం. మిగిలిన రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ కొంత మెరుగ్గా ఉన్నా, యూపీ, బిహార్‌ చాలా వెనుకబడ్డాయి. ఇక దేశ జనాభాలో 16.5 శాతం యూపీదే! 

పరిస్థితి ఇలాగే కొనసాగితే, చైనాను మించిపోయి ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌ అవతరిస్తుందనీ, 2050 నాటి కల్లా మన జనాభా 169 కోట్లు దాటేస్తుందనీ అంచనా. తరుగుతున్న ప్రకృతి వనరులు, పెరుగుతున్న జనాభా నేపథ్యంలో ఇన్ని కోట్లమందికి అన్నవస్త్రాలు, ఆశ్రయం అందించడం, ప్రాథమిక వసతులు కల్పించడం పోనుపోనూ అసాధ్యమే. సాక్షాత్తూ ప్రధాని మోదీ 2019లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పరిమిత కుటుంబాన్ని పాటించడం కూడా ఒక రకమైన దేశభక్తే అని ప్రవచించింది అందుకే. ఈ నేపథ్యంలోనే యూపీ, అస్సాం లాంటి రాష్ట్రాలు జనాభానియంత్రణ చట్టాల బాట పడుతున్నాయనుకోవచ్చు. ఎన్నికలైపోయిన అస్సాంలో క్రమంగా ఇద్దరు సంతానం చట్టాన్ని అమలులోకి తేవాలనుకుంటే, మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలున్న యూపీలో యోగి తొందరపడుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ గణనీయ సంఖ్యలో ముస్లింలు ఉన్నారనేది గణాంకాల లెక్క. మరి, ఇప్పటికిప్పుడు ఓ చట్టం చేసి, అధిక సంతానం ఉందనే ఒకే కారణంతో బలహీన, సామాన్య కుటుంబాల సంరక్షణ, సంక్షేమం, సమున్నతి లాంటి బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవచ్చా అన్నది ధర్మసందేహం.  

యూపీ తక్షణ బిల్లు ప్రతిపాదనలో పరమార్థం ఏమైనా, ఎన్నికల ముందు చేస్తున్న ఈ ‘జనాభా రాజకీయం’ ఫక్తు ‘మార్కెటింగ్‌ ఎత్తుగడ’గా కొందరు అభివర్ణిస్తున్నారు. ఇద్దరు సంతానమే అయితే విద్యుత్, మంచినీటి చార్జీలు తగ్గిస్తామనీ, ఒకరే సంతానమైతే నగదు ప్రోత్సాహకాలిస్తామనీ యోగి సర్కార్‌ ఉవాచ. నిపుణులేమో ఇలాంటి ఏకైక సంతాన ప్రతిపాదన చివరకు లింగ నిష్పత్తి మొదలు అనేక అంశాలలో అసమతౌల్యానికి దారి తీసే ముప్పు ఉందంటున్నారు. ఇప్పటికైతే ఈ ప్రతిపాదిత చట్టం మీద ఈ నెల 19 వరకు ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పే అవకాశమైతే ఇచ్చారు. కానీ, ఇంట్లో ఎంతమంది ఉన్నా రేషన్‌ కార్డు మీద నలుగురికే సరుకులిస్తామనీ, ఇద్దరు మించి సంతానమైతే స్థానిక ఎన్నికలలో పాల్గొనే వీలు లేదనే మాటలు సహజంగానే అందరికీ రుచించకపోవచ్చు. కొన్ని వర్గాలను సామాజికంగా, రాజకీయంగా దూరం పెడుతున్నారని అనుమానించవచ్చు. అయితే, స్థానిక సంస్థల పోటీపై షరతు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అమలులో ఉందని గుర్తించాలి.  

ఆధునిక కాలంలో ‘చిన్న కుటుంబం... చింతలు లేని కుటుంబం’ అనే మాటతో విభేదించేవాళ్ళు ఎవరూ ఉండరు. కానీ గత నవంబర్‌లో ‘లవ్‌ జిహాద్‌ చట్టం’, ఇప్పుడీ కొత్త జనాభా బిల్లు – ఇలా యూపీ సర్కార్‌ పడుతున్న హడావుడే అసలు సమస్య. అన్ని వర్గాలకూ వర్తింపజేస్తామనీ, అందరినీ కలుపుకొనిపోతామనీ పాలకులు చెబుతున్నా ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. వెరసి, 2019 లోక్‌సభ ఎన్నికలలో ‘ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు’ లానే రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలలో ఈ బిల్లు ఓ ప్రధానాంశం కావచ్చు. అదే జరిగితే... ఓటర్ల తీర్పు కోరనున్న ఆదిత్యనాథ్‌కు ఈ ఇద్దరు పిల్లల కొత్త బిల్లు ఒకటికి రెండు ఓట్లు రాలుస్తుందా, లేక కష్టాల పాలు చేస్తుందా అన్నది వేచి చూడాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top