పాటకు పట్టం | Sakshi
Sakshi News home page

పాటకు పట్టం

Published Mon, Feb 12 2024 4:39 AM

Sakshi Editorial On Song

‘పాట’ అనే మాటలో ఎన్ని ఉద్వేగాల ఊటలో! ఎన్ని ఉద్రేకాల తంత్రులో! ఎగిసిపడి ఎదను రసప్లావితం చేసే ఎన్నెన్ని పారవశ్యాల జలయంత్రాలో! ప్రతి రాత్రీ వసంతరాత్రిగా, ప్రతి గాలీ పైరగాలిగా, బతుకంతా పాటలా సాగాలంటాడు ఒక కవి. ఏదో ఒక పాట వింటూనే జీవితం గడుపుతాం. చెవులను, మనసును తాకి హాయి గొలిపే పాటల తుంపరలలో తడుస్తూనే జీవన రహదారిలో సాగుతాం.

మరి, బతుకే పాటైన మేటి పాటగాళ్ళ సంగతేమిటి! కాలికి గజ్జె కట్టి బుజాన కంబళి వేసుకుని జీవితమే ఆటగా, పాటగా గడిపిన గద్దర్లు; పాటల వియద్గంగలో జీవితాంతం మునకలేసిన వంగపండులు, పలుకే పాటై జీవనదిలా ప్రవహించే అందెశ్రీలు, పాటను పుక్కిటపట్టి రాగమే జీవనరాగంగా బతుకును పండించుకుంటున్న గోరటి వెంకన్నలు... చెప్పుకుంటూ వెడితే ఒకరా ఇద్దరా! ఆపైన, సినీగీతాన్ని వినీలాకాశానికెత్తిన కృష్ణశాస్త్రులు, శ్రీశ్రీలు, ఆత్రేయలు, సినారేలు, ఆరుద్రలు, వేటూరులు..!   

పేరుకు పాటైనా తీరులు ఎన్నో! కొన్ని పాటలు జాతి మొత్తంలో ఉత్తేజపు విద్యుత్తును నింపి ఉద్వేగాల అంచుల వైపు నడిపిస్తాయి. జనగణమన లాంటి అలాంటివి జనరంజకమై జాతి గళమెత్తి పాడుకునే గీతాలు అవుతాయి. తెలంగాణ ఉద్యమంతోపాటు ఉవ్వెత్తున ఎగసిన ఉద్రేకపు పొంగు పాటగా మారి అందెశ్రీ ఆలపించిన ‘జయజయహే తెలంగాణ’ గీతానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రగీతం ప్రతిపత్తిని ఇచ్చి తనను తాను గౌరవించుకుంది. పాటలో పలికించలేని రసమే లేదు. ప్రజోద్యమాల అగ్నిశిఖలలోంచి నిప్పురవ్వల్లా పుట్టుకొచ్చిన పాటే ప్రేయసీప్రియుల యుగళగీతంగా మారి మోహరాగాలతో విరితావులనీనగలదు.

‘నీవే నేనుగా ఒకటైన చోట’ ‘వలపుల పూదోట’ పూయించగలదు. మనిషైతే మనసుంటే కనులు కరగాలని, కరుణ కురియా లని, జగతి నిండాలని ప్రబోధిస్తూ; ప్రకృతి సమస్తంలో ఇమిడి ఉన్న కారుణ్యాన్ని జాలిజాలిగా కరిగే నీలిమేఘం మీదుగా రూపుగట్టి మనల్ని నిలువునా కదిలించి కరిగించగలదు. తూరుపు సిందూరపు మందారపు వన్నెలలోని ఉదయరాగానికి చూపుల్ని, హృదయగానానికి చెవుల్ని అప్ప జెబుతూనే కాలగర్భం లోలోతులకు వెళ్లి  వేనవేల వత్సరాల కేళిలో మానవుడుదయించిన శుభ వేళను

– మలయ మారుతాలతో, పుడమి పలుకు స్వాగతాలతో, తారకలే మాలికలై మలచిన కాంతితోరణాలతో ఉత్సవీకరించి మన కళ్ళముందు నిలపగలదు. ‘చిరునవ్వు వెన్నెల్లు చిలికేటి వాడా, అరుదైన చిరుముద్దు అరువియ్య రారా’ అంటూ; ‘అల్లారు ముద్దుకదే, అపరంజి ముద్ద కదే... ఒంటరి బతుకైనా ఓపగలుగు తీపికదే’ అంటూ పాట లాలిగా జోలగా మారి వాత్సల్య రసంలో ఓలలాడించగలదు.  

పాటను కైకట్టిన ఆదికవి ‘అమ్మ’ అంటారు అందెశ్రీ. నేల పొరలను చీల్చుకుని విత్తనం రెండు ముక్కలుగా పగిలి మొలకెత్తినట్లుగా ప్రకృతిమాత పొత్తిళ్ళల్లో కవలశిశువులుగా ప్రాణి పుట్టుక, పాట పుట్టుక అంటూ పాటను సృష్ట్యాదిన  ప్రతిష్ఠిస్తారు. గగనాంతరసీమ గానసమూహమై పాటందుకుంటే, నేల రంగస్థలమై ఆటందుకుందంటారు. ప్రకృతి పురుషులు కేళీవిలాసాల్లో తేలుతున్న వేళ జంతుధ్వనుల నుంచి పుట్టిన సప్తస్వరాల అన్వయింపే ఏ పాట అయినా అంటూ పాటల భిన్నత్వంలోనే ఏకత్వాన్ని రూపిస్తారు.

పురామానవ పరిణామ కోణం నుంచి గ్రీకు సాహిత్యాన్ని, ఇతర యూరోపియన్‌ భాషల సాహిత్యంతో బేరీజు వేస్తూ చర్చించిన జార్జి థామ్సన్‌ అనే పండి తుడు కూడా విచిత్రంగా ఇలాగే పాటను సాహిత్యపు ఆదిమదశలో నిలుపుతాడు. ఆధునిక ఇంగ్లీష్‌ కవిత్వానికి భిన్నంగా గ్రీకు కవిత్వం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. గ్రీకు మహాకవి హోమర్‌ కవిత్వం మన వాల్మీకి రామాయణంలానే తంత్రీలయ సమన్వితంగా ఉంటుంది. వ్యాసభారతం కూడా వాగ్రూపంలో విస్తరించి చివరికి లిఖితరూపం పొందినదే. అలా చూసినప్పుడు నేటి మన పాటకవులందరూ వ్యాసవాల్మీకి పరంపరలోకే వస్తారు. లిఖితరూపంలోకి వచ్చాక కవిత్వం కాళి దాసాదులతో భిన్నమైన మలుపు తిరిగింది. 

తెలుగులో ఆధునిక కవిత్వం ఆదిలో పాటకు ప్రతిరూపంగా ఎలా వెలువడిందో వివరిస్తూ, అనంతరకాలంలో తెలుగునాట పాటకు ప్రచురణార్హత, కవితకు శ్రవ్యార్హత లేకుండా చేశారని అంబటి సురేంద్రరాజు ఆవేదన వ్యక్తం చేస్తారు. కంటితో చదవడం కన్నా, చెవితో వినడమే కవితకు స్వాభావికమంటాడు. నిన్నమొన్నటి వరకు ఐరిష్‌ కవిత్వం ప్రధానంగా ఆశుసంప్రదాయాన్నే అనుసరించిందని జార్జి థామ్సన్‌ కూడా చెబుతూ; మొదట అచ్చులో చదివిన కొన్ని ఐరిష్‌ కవితలను ఆ తర్వాత ఒక రైతుగాయకుని నోట వినడం తనకు అపూర్వమైన అనుభవంగా వర్ణిస్తాడు.

నిరక్షరాస్యులైన ఐరిష్‌ గ్రామీణుల పెదాలపై కవిత్వం నర్తిస్తూ ఉంటుందని, వారు మాట్లాడే మామూలు మాటలు కూడా కవితాత్మకంగా మారిపోతాయని అంటాడు. సామూహిక శ్రమలో భాగంగా పుట్టిన వాక్కు కవితాత్మకంగా మారి శ్రమకు చోదకంగా మారిందనీ, ఆదిమ కాలంలో పనిలో భాగంగా పాట పుట్టింది తప్ప కేవలం తీరిక సమయాల్లో పాడుకునేందుకు కాదంటాడు. 

పూర్తిగా లిఖిత సంప్రదాయంలో పెరిగిన కవిత్వం ఆలోచనామృతం కావచ్చు కానీ, సద్యస్పందన కలిగించే పాట ఆలోచనామృతమే కాక ఆపాతమధురం కూడా. ప్రజాక్షేత్రంలో, ప్రజలే ప్రభువులుగా ఉన్న ప్రజాస్వామ్యంలో సామాన్యజనం సహా అందరినీ ఉర్రూతలూగించే పాటకు పట్టం కట్టడం ఎంతైనా సముచితమూ, స్వాగతార్హమూ. పాట కవులందరికీ కోటిదండాలు. 

Advertisement
Advertisement