
ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. కానీ ఆర్నెల్ల నిరీక్షణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో కొద్దో గొప్పో సయోధ్య కుదిరేసరికి నాటో కూటమి ఆయన లక్షణాలు పుణికి పుచ్చుకున్నట్టు కనబడుతోంది. రష్యాతో వాణిజ్యం సాగిస్తే వంద శాతం సుంకాలు విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ భారత్, చైనా, బ్రెజిల్ దేశాలకు చేసిన హెచ్చరిక దీన్నే చాటు తోంది. ట్రంప్‌తో నాలుగు రోజులక్రితం భేటీ అయ్యేవరకూ తన భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో నాటో దిగాలుగా, అయోమయంగా వుంది. ఎందుకంటే నాటో ఖర్చులో సింహభాగం అమెరికాదే. అది తప్పుకున్న మరుక్షణం సంస్థ కుప్పకూలుతుంది.
ట్రంప్ ప్రసన్న వదనంతో పలక రించేసరికి పులకరించి తన స్థాయి ఏమిటన్నది నాటో మరిచిందని రూట్ మాటలు చెబుతున్నాయి. ఈ మూడు దేశాలూ యుద్ధం వద్దని రష్యాకు నచ్చజెప్పాలట. లేనట్టయితే ఆ పర్యవసానాలు ఈ దేశాలూ ఎదుర్కొనాల్సి వస్తుందట. ఇంకా వలస పాలన మాటున దోపిడీ సాగించిన నాటి రోజులే వున్నాయని రూట్ భ్రమపడుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ఎవరూ సమర్థించరు. అలాగే గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం, ఇటీవల ఆ దేశమే ఇరాన్‌పై చేసిన దాడి, దానికి వత్తాసుగా అమెరికా సాగించిన దాడులు అంగీకరించరు.
నాటో దన్నుతో ఉక్రె యిన్ కావాలని రష్యాతో గిల్లికజ్జాలకు దిగిన వైనం అందరికీ తెలుసు. తమ చేతికి మట్టి అంటకుండా రష్యాను దెబ్బతీసి, దాన్ని సర్వనాశనం చేయగలమన్న భ్రమలో యూరప్ దేశాలు ఉక్రె యిన్‌ను ఉసిగొల్పాయి. కానీ మూడేళ్లయినా ఆ యుద్ధం ఆగకపోవటంతో యూరప్ దేశాలకు దిక్కు తోచటం లేదు. ఆ నిరాశా నిస్పృహల పర్యవసానంగానే నాటో కూటమి అతిగా మాట్లాడుతోంది.
అటువంటి బెదిరింపులకు దిగేందుకు తనకున్న అర్హతేమిటో నాటో గమనించుకోలేదు. 1949లో ఆవిర్భావం మొదలుకొని దాని చరిత్రంతా దురాక్రమణలు, యుద్ధాలే. నిక్షేపంగా వున్న లిబియాపై చమురు, సహజవాయు నిక్షేపాల్ని కొల్లగొట్టడానికి దండెత్తి, రసాయన ఆయుధాలున్నా యంటూ ఆరోపించి, పాలకుడు గడాఫీని దారికి తెచ్చుకుని, ఆయన నిరాయుధుడు కాగానే సాయుధ ముఠాలను ఎగతోసింది నాటోయే. ఆ ముఠాలతో ఆయన్ను అత్యంత అమానుషంగా హత్య చేయించింది కూడా నాటోయే. 2011 మొదలుకొని ఇప్పటివరకూ ఆ దేశం అంతర్యుద్ధంతో సతమతమవుతోంది.
బోస్నియా, హెర్జ్‌గోవినా, కొసావో, అఫ్గాన్, ఇరాక్, సోమాలియా తదితర చోట్ల అమెరికాతో కలిసి, విడిగా నాటో సృష్టించిన కల్లోలం సామాన్యమైంది కాదు. ఈ యుద్ధాల్లో లక్షలాది మంది పౌరులు మరణించారు. రష్యా–ఉక్రెయిన్ లడాయిలోఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక సాయాన్నందిస్తూ ఈ యుద్ధం ఆరకుండా కాపాడుతున్నది కూడా నాటోయే. అలాంటి సంస్థ ఏ అర్హతతో మననూ, వేరే దేశాలనూ బెదిరిస్తుంది?
నాటో అనేది పుట్టుకనుంచీ అమెరికా కోసం, దాని ప్రయోజనాల పరిరక్షణ కోసం పనిచేస్తున్న పెద్ద పోలీస్. ఒక సైనిక కూటమిగా వుంటూ ప్రపంచ దేశాలపై ఆంక్షలు విధించటం సాధ్యమనే నాటో అనుకుంటున్నదా? ఆ పని యూరప్ దేశాలది. కానీ వాటికి హెచ్చరించటం సంగతలా వుంచి అడిగే ధైర్యం కూడా లేదు. ఒకనాడు సంపన్న రాజ్యాలుగా చలామణి అయిన యూరప్ దేశాలు ఇప్పుడు ఉత్పాదకతను పెంచటం ఎలాగో... అరకొర ఆర్థిక వ్యవస్థలతో ప్రజానీకంలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చటం ఎలాగో అర్థంకాక తలలు పట్టుకుంటున్నాయి.
ఈ దేశాలతో కూడిన నాటో మాత్రం పెద్ద మాటలు మాట్లాడుతోంది. ఇన్నేళ్ల అమెరికా సాహచర్యంతో ఇష్టాను సారం బడుగు దేశాలపై బలప్రయోగం చేయటం అలవాటైన నాటోకు ఈ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి, భద్రతామండలి వంటి అంతర్జాతీయ వేదికలున్నాయని కూడా గుర్తున్నట్టు లేదు. ఆంక్ష లైనా, విధినిషేధాలైనా వాటిద్వారా అమలు కావాలి. అదనంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వంటివి వున్నాయి. రష్యాతో వ్యాపారం చేయాలో లేదో అమెరికా, యూరప్‌సొంతంగా నిర్ణయించుకోవచ్చు. అందులో ఎవరూ జోక్యం చేసుకోలేరు. కానీ మేమే కాదు... ఎవరూ వ్యాపారం చేయకూడదంటే చెల్లదు.
తన ఇంధన అవసరాలేమిటో, దాన్ని నెరవేర్చుకోవటానికి అనుసరించాల్సిన వ్యూహమేమిటో భారత్ ఆలోచించుకుంటుంది. రష్యాపై అమెరికా ఆంక్షలు విధించినా మన దేశం బేఖాతరుచేసింది. రష్యా చవగ్గా అమ్మజూపిన ముడి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసింది.క్రితంతో పోలిస్తే 2023లో రష్యా నుంచి చమురు, సహజవాయు దిగుమతులు 1,500 శాతం పెరగటానికి ఇదే కారణం. చైనా, బ్రెజిల్ కూడా ఈ దోవనే వెళ్లాయి. రష్యాను ఏకాకిని చేయాలన్న పాశ్చాత్య ప్రపంచం కలల్ని బద్దలుకొట్టాయి. మన విదేశాంగ శాఖ నాటో ద్వంద్వ ప్రమాణాలను సరిగానే ఎత్తిచూపింది.
ప్రజల ఇంధనావసరాలు మినహా తమకేదీ ప్రాముఖ్యంగల అంశం కాదని జవాబిచ్చింది. ఒకప్పుడు 27 దేశాల నుంచి ముడి చమురు కొనుగోలు చేసిన మన దేశం, ఇప్పుడు 40 దేశాలనుంచి కొంటున్నది. రష్యాపై తీసుకొచ్చిన అభిశంసనపై ఓటింగ్ జరిగినప్పుడల్లా ఐక్యరాజ్యసమితిలో మన దేశం గైర్హాజరైంది. అదే సమయంలో యుద్ధాన్ని విరమించాలని రష్యా అధినేత పుతిన్‌కు నచ్చజెప్పింది. అదే సలహా ఉక్రెయిన్‌కు కూడా ఇచ్చింది. ఇవి తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడటం, హెచ్చరికలు జారీ చేయటం తగదని నాటో గుర్తించాలి. తెలిసీ తెలియ కుండా తగుదునమ్మా అని జోక్యం చేసుకుంటే వున్న పరువు కాస్తా పోతుందని గుర్తెరగాలి.