ర్యాంకులు పోనాయండీ!

Human Development Index 2022 India Falls For 2nd Straight Year - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఇది ఆందోళనకర అంశం, తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన విషయం. ఐరాస లెక్క ప్రకారం వరుసగా రెండో ఏడాదీ పలు దేశాల ‘మానవాభివృద్ధి సూచిక’ (హెచ్డీఐ) స్కోరు కిందకు పడింది. మన దేశపు ర్యాంకు మునుపటితో పోలిస్తే రెండు స్థానాలు కిందకు పడింది. ఐరాస అభివృద్ధి సంస్థ (యూఎన్‌డీపీ) 2021–22 మానవాభివృద్ధి నివేదిక (హెచ్డీఆర్‌) ‘అనిశ్చిత పరిస్థితులు, అస్థిర జీవితాలు – మారుతున్న ప్రపంచంలో భవిష్యత్‌ రూప కల్పన’ ఈ చేదునిజాన్ని బయటపెట్టింది. తొంభై శాతానికి పైగా దేశాలు 2020లో కానీ, 2021లో కానీ హెచ్డీఐ స్కోరులో వెనకబడ్డాయి. నలభై శాతానికి పైగా దేశాలైతే ఆ రెండేళ్ళూ ర్యాంకుల్లో కిందికి వచ్చేశాయి. 

గత వారం విడుదలైన ఈ నివేదిక ప్రకారం మానవాభివృద్ధిలో మొత్తం 191 దేశాల్లో మన దేశం రెండు స్థానాలు కిందకొచ్చి, 132వ ర్యాంకుకు చేరింది. గడచిన 32 ఏళ్ళలో ఇలా వరుసగా రెండేళ్ళు సూచికలో దిగజారడం ఇదే తొలిసారి. మానవాభివృద్ధి పరామితుల ప్రకారం బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకల కన్నా మనం వెనకబడే ఉన్నాం. దేశం సుభిక్షంగా ఉంది, స్థూల జాతీయోత్పత్తిలో బ్రిటన్‌ను దాటేశాం లాంటి కబుర్లతో కాలక్షేపం చేస్తున్న వారికి ఇది కనువిప్పు. హెచ్డీఐలో వివిధ దేశాల ర్యాంకులు పడిపోవడానికి కనివిని ఎరుగని సంక్షోభాలు కారణం. గత పదేళ్ళలో ఆర్థికపతనాలు, వాతావరణ సంక్షోభాలు, కరోనా, యుద్ధం లాంటి గడ్డు సమస్యల్ని ప్రపంచం ఎదుర్కొంది. ప్రతి సంక్షోభం ప్రపంచాభివృద్ధిపై ప్రభావం చూపింది. అయితే, అందులో కరోనాది అతి పెద్ద పాత్ర అని ఐరాస నివేదిక సారాంశం. ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారితో మానవ పురోగతి కనీసం అయిదేళ్ళు వెనక్కి వెళ్ళింది. అంతటా అనిశ్చితి ప్రబలింది. 

హెచ్‌డీఐకి లెక్కలోకి తీసుకుంటున్న అంశాల్లో లోపాలున్నాయని కొన్ని విమర్శలు లేకపోలేదు. అయితే, మరే సూచికా లేని వేళ ప్రతి దేశపు సగటు విజయాన్నీ లెక్కించడానికి ఉన్నంతలో ఇదే మెరుగైనదని ఒప్పుకోక తప్పదు. ఆర్థిక అసమానత్వం, లైంగిక అసమానత్వం, బహుముఖ దారిద్య్రం లాంటి ఆరు వేర్వేరు మానవాభివృద్ధి సూచీల ద్వారా ఈ ర్యాంకులు లెక్కకట్టారు. స్విట్జర్లాండ్‌ 0.962 స్కోరుతో ప్రథమ ర్యాంకు దక్కించుకుంది. భారత్‌ కేవలం 0.633 స్కోరుతో అగ్రశ్రేణికి సుదూరంగా నిలిచిపోయింది. విషాదమేమిటంటే, మానవాభివృద్ధిలో మన స్కోరు ప్రపంచ సగటు 0.732 కన్నా తక్కువ. పొరుగున ఉన్న చైనా హెచ్డీఐ స్కోర్‌ 1990 నుంచి ఏటా పెరుగుతుంటే, మన పరిస్థితి తద్భిన్నంగా ఉంది. మన దేశంలో ఆర్థిక అసమానతలూ ఎక్కువే. జనాభాలో అతి సంపన్నులైన 1 శాతం మంది ఆదాయ వాటా, నిరుపేదలైన 40 శాతం మంది వాటా కన్నా ఎక్కువని తాజా లెక్క. ఇంతటి అసమానత చైనా, స్విట్జర్లాండ్‌లలో లేదు. 

లింగపరంగా చూస్తే, మన దేశ తలసరి ఆదాయంలో పురుషుల కన్నా స్త్రీలు చాలా వెనుకబడి ఉన్నారు. విద్య, వైద్యం, జీవన ప్రమాణాల ప్రాతిపదికన లెక్కకట్టే బహుముఖ దారిద్య్రం లోనూ భారత్‌ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. 2019 నాటి యూఎన్‌డీపీ అంచనాల ప్రకారం... ప్రపంచంలో అత్యధిక జనాభా గల చైనాలో 5.4 కోట్ల మంది బహుముఖ దారిద్య్రంలో ఉంటే, రెండో అత్యధిక జనాభా ఉన్న భారత్‌లో ఆ సంఖ్య 38.1 కోట్ల పైచిలుకే. అయితే, 2019 – 2020 మధ్య మన దేశంలో లింగ అసమానత దారుణంగా పెరగగా, తాజా నివేదికలో ఆ కోణంలో కొద్దిగా మెరుగుదల సాధించడం ఉపశమనం. మొత్తానికి, అన్నీ కలిపి చూస్తే మానవాభివృద్ధిలో మన స్కోరునూ, దరిమిలా ఇతర దేశాల మధ్య మన ర్యాంకునూ కిందకు గుంజాయి.      

అయితే, సంతోషించదగ్గ అంశం ఏమంటే – కరోనాలో ఏడాది లోపలే భారత్‌ టీకాను అభివృద్ధి చేయడం, ధనిక దేశాలకు సైతం కరోనా నిరోధానికి సహకరించడం! ఇది మన మానవ సామర్థ్యమే! అదే సమయంలో కనీస ఆదాయ హామీకై దేశంలో జరుగుతున్న ప్రయత్నాలూ యూఎన్‌డీపీ ప్రశంసలు అందుకున్నాయి. అలాగే కరోనా అనంతరం ఆర్థికంగా మన దేశపు పనితీరు పొరుగు దేశాల కన్నా మెరుగ్గా ఉండడం ఆశాకిరణం. అభివృద్ధి అజెండా అమలుకు నిధులు వెచ్చించే వీలుంటుంది. అయినా, ఇప్పటికీ అనేక అంశాల్లో ఇతర దేశాలు మెరుగ్గా ఉన్నాయనేది నిష్ఠురసత్యం. పౌష్టికలోప జనాభా, బాలల మరణాల రేటు తదితర అంశాలతో లెక్కించే ‘ప్రపంచ ఆకలి సూచి’ (2020) ప్రకారం కూడా 107 దేశాల్లో మనది 94వ స్థానం. 

వీటికి తోడు ఇప్పుడు ఉక్రెయిన్‌లో యుద్ధం, ప్రపంచాన్ని పూర్తిగా వదిలిపోని కరోనా, భూతాపోన్నతి ముప్పేటదాడి చేస్తున్నాయి. అన్నీ కలసి ప్రపంచ ఆహార సంక్షోభానికి దారి తీయవచ్చని ఐరాస హెచ్చరిస్తోంది. నిలకడైన అభివృద్ధి, సామాజిక భద్రత, సత్వర సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి పెడితేనే అనిశ్చితి నుంచి బయటపడగలమంటోంది. ఐరాస మాట చద్దిమూట. పాలకులు దీన్ని పరిగణనలోకి తీసుకొని, పకడ్బందీగా మానవాభివృద్ధి ప్రణాళికలు రచించాలి. పర్యావరణ సంక్షోభ నివారణ లక్ష్యాలను చేరుకొనేందుకూ కృషి చేయాలి. ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతూ, ఉపాధి హామీ తగ్గుతున్న సమయంలో ఎన్నికల వ్యూహాలు కాస్త ఆపి, నిలకడగా చేతల్లోకి దిగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతరాలు తగ్గించుకొని, సమన్వయంతో సాగాలి. కానీ, పైచేయి కోసం ప్రయత్నాలతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా సహకార స్ఫూర్తి కొరవడుతున్న వేళ ప్రగతి బాటలో కలసి సాగడానికి మన పాలకులు సిద్ధమేనా?

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top