
ఒంటరి ప్రయాణంకన్నా సమష్టిగా ముందడుగు వేయటం ఎప్పుడూ మంచిదే. ఒకప్పుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల ద్వారా ప్రపంచ దేశాలను శాసించిన సంపన్న రాజ్యాలు ఇప్పుడు నేరుగా ఆ పని చేయాలనుకుంటున్నాయి. తమకు ఇన్నాళ్లూ అన్యాయం జరిగిపోయిందని ఆక్రోశిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సాగిస్తున్న ‘అధిక సుంకాల’ బెదిరింపు ఆ కోవ లోనిదే. ఈ విషయంలో ట్రంప్ జయాపజయాలను చూశాక, ఇప్పుడు ఆయన్ను ప్రతిఘటిస్తున్న ఇతర సంపన్న రాజ్యాలు సైతం ఆ దోవకే పోతాయి. ఎవరికి వారు ద్వైపాక్షిక ఒప్పందాల్లో అధిక సుంకాల కోసం ఒత్తిళ్లు తెస్తారు. ఇలాంటి వర్తమాన పరిస్థితుల్లో బ్రిక్స్ వంటి ప్రాంతీయ కూటముల అవసరం, ప్రాముఖ్యత గతం కన్నా ఎంతో పెరిగాయి.
ముఖ్యంగా సహజ వనరులు పుష్కలంగా వున్నా పేదరికంలో మగ్గుతున్న దక్షిణ దేశాల స్వరం వినిపించటానికి బ్రిక్స్ తోడ్పడుతోంది. ఆదివారం ప్రారంభమైన రెండు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ముందు ఈ నెల 2నుంచి ప్రధాని నరేంద్ర మోదీ అయిదు దక్షిణార్ధ గోళ దేశాల పర్యటన ప్రారంభించారు. ఘనా, ట్రినిడాడ్, టుబాగో, అర్జెంటీనా దేశాల్ని ఇప్పటికే సందర్శించగా... ఈ శిఖ రాగ్ర సదస్సు నిర్వహించిన బ్రెజిల్‌లో మంగళవారం కూడా పర్యటించి ఆ మరునాడు నమీబియా వెళ్తారు. ఆ దేశాల సమస్యల్ని స్వయంగా అవగాహన చేసుకోవటానికి ఈ పర్యటన దోహదపడింది. అందుకే... బ్రిక్స్ సదస్సులో ఆయన దక్షిణార్ధ గోళ దేశాల తరఫున బలంగా స్వరం వినిపించారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో తోడ్పడుతూ కూడా ఆ దేశాలు వివక్షను ఎదుర్కొంటున్న వైనాన్నీ, వనరుల పంపిణీ, అభివృద్ధి, భద్రత వంటి అంశాల్లో వాటిని విస్మరిస్తున్న ధోరణినీ ప్రస్తావించారు. అంతర్జాతీయ వేదికల్లో వాటికి స్థానం లేకపోవటాన్ని ఎత్తి చూపారు. అంతక్రితం మాటెలా ఉన్నా కనీసం బ్రిక్స్ ఆవిర్భావం తర్వాతైనా దక్షిణార్ధ గోళ దేశాల్లో పర్యటించి వాటితో మెరుగైన సంబంధాలు ఏర్పర్చుకోవాలని గత ప్రధానులు అనుకోలేదు. మన ప్రధానొకరు ఘనా పర్యటించటం ఇదే తొలిసారైతే, అర్జెంటీనాకు వెళ్లటం 57 ఏళ్ల తర్వాత మొదటిసారి.
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో తొలుత ఏర్పడిన బ్రిక్స్‌లో దక్షిణాఫ్రికా చేరగా, తాజాగా చేరిన ఇండొనేసియాతో కలుపుకొని మొత్తం సభ్యదేశాలు 11 అయ్యాయి. భాగస్వామ్య దేశాలు తొమ్మిది, ఆహ్వానిత దేశాలు ఎనిమిది వుండగా, రియో డీ జెనీరో సదస్సుకు ఏడు అంతర్జాతీయ సంస్థల చీఫ్‌లు హాజరయ్యారు. సంస్థ పరిధి విస్తృతం అయ్యేకొద్దీ దాని బాధ్యతలు పెరుగుతాయి. ఆ మేరకు అంతర్జాతీయ వ్యవహారాల్లో దాని ప్రభావం కూడా ఎక్కువవుతుంది. అయితే అందరిదీ ఒక్క గొంతు అయినప్పుడే, ఉమ్మడి ప్రయోజనాల కోసం సభ్య దేశాలన్నీ అంకిత భావంతో పనిచేసినప్పుడే అది ప్రభావవంతమైన పాత్ర పోషించగలుగుతుంది.
ప్రపంచం శరవేగంగా మారుతోంది. కరోనా మహమ్మారి విరుచుకు పడ్డాక సంపన్న రాజ్యాలు సైతం కుదేలయ్యాయి. జననష్టంతో పాటు లాక్‌డౌన్ కారణంగా చాలా ఆర్థిక వ్యవస్థలు కుప్ప కూలాయి. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ రెండోసారి వచ్చాక పాత విధానాలకు పాతరేసి కొత్త కొత్త నిబంధనలతో ప్రపంచ దేశాలను ఊపిరాడకుండా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక,సాంకేతిక, విద్యారంగాల్లో పరస్పరం సహకారం పెంచుకోవటానికీ, ఎదగటానికీ బ్రిక్స్ వంటిసంస్థలు దోహదపడతాయి. ప్రపంచ సంపద పెరగాలన్నా, ఆ సంపద సక్రమంగా పంపిణీ కావా లన్నా ఇటువంటి సంస్థల అవసరం ఎంతో ఉంటుంది.
ఉగ్రవాదం తరచు కోరలు చాస్తున్న తీరుపై బ్రిక్స్ ఆందోళన వ్యక్తం చేయటంతోపాటు ఆ విష యంలో ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్న దేశాలను తూర్పారబట్టడం చైనా వంటి దేశాల కళ్లు తెరిపించాలి. ఉగ్రదాడులు జరిగిన ప్రాంతాన్ని బట్టి, ఆరోపణలొచ్చిన సంస్థలను బట్టి భిన్న వైఖరుల్ని తీసుకుంటున్న చైనా వంటి దేశాలకు బ్రిక్స్ డిక్లరేషన్ చెంపపెట్టు. పాకిస్తాన్‌లో ఆశ్రయం తీసుకుంటూ ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ వంటివారిపై చర్య తీసుకోవాలని భద్రతామండలిలో వచ్చిన తీర్మానాన్ని వీటో చేసిన ఘనత చైనాది.
ఇలాంటి ధోరణి వల్ల ఉగ్రవాదం బలపడుతుందే తప్ప తగ్గదు. తమ వరకూ రాలేదని, తమకు నష్టం జరగలేదని భావించి ఉగ్రవాదంపై ఉదాసీన వైఖరి అవలంబిస్తే అలాంటి దేశాలు సైతం నష్టపోక తప్పదు. పాకిస్తాన్‌లో వివిధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాలుపంచుకుంటున్న చైనా టెర్రరిస్టుల నుంచి సమస్యల్ని ఎదుర్కొనటం దీన్నే రుజువుచేస్తోంది.
సంపన్న రాజ్యాల కూటమి జీ–7 సదస్సుకు గత నెలలో పరిశీలక హోదాలో హాజరైన మన దేశం ఇప్పుడు బ్రిక్స్‌లో ప్రధాన పాత్ర పోషించింది. సదస్సుకు రష్యా, చైనా అధినేతలు వేర్వేరు కారణాల వల్ల రాలేదు. రష్యా అధినేత పుతిన్‌పై ఉక్రెయిన్ దురాక్రమణకు సంబంధించి అంత ర్జాతీయ న్యాయస్థానంలో నేరారోపణలు ఉండటంతో రాలేక, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొ నాల్సి వచ్చింది. ఇక షీ జిన్‌పింగ్ తరఫున ప్రతినిధి హాజరయ్యారు.
వచ్చే ఏడాది బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాల్సిన భారత్‌కు ఒకరకంగా ఇప్పటినుంచే బాధ్యతలు మొదలైనట్టు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక రకమైన అనిశ్చితి అలుముకుంది. ఇది మళ్లీ జవసత్వాలు పుంజుకోవాలంటే ఘర్షణ వాతావరణం సమసిపోవాలి. సామరస్య వాతావరణం ఏర్పడాలి. అందుకు బ్రిక్స్ ఆచరణ దోహదపడాలి.