పసివాళ్ల ఆహారంతో ఆటలా! | Sakshi
Sakshi News home page

పసివాళ్ల ఆహారంతో ఆటలా!

Published Sat, Apr 20 2024 3:44 AM

Centre asks FSSAI to initiate action against Nestle  - Sakshi

తొమ్మిదేళ్లనాటి మ్యాగీ నూడిల్స్‌ వివాదం నుంచి బయటపడి రెండు వారాలు గడిచాయో లేదో... నెస్లే కంపెనీ మెడకు కొత్తగా సెరిలాక్‌ తగువు చుట్టుకుంది. ఈసారి దీని మూలం మన దేశంలో కాదు, స్విట్జర్లాండ్‌లో వుంది. భిన్న రకాల ఉత్పత్తుల ద్వారా లాభాల రూపంలో ఏటా వేలాదికోట్ల రూపాయలు తరలించుకుపోతున్న బహుళజాతి సంస్థలకు ఇక్కడి ప్రజల ఆరోగ్యం విషయంలోగానీ... ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలపైగానీ పెద్దగా పట్టింపు వుండదని చాలామంది చేసే ఆరోపణ. అడపా దడపా వెల్లడవుతున్న అంశాలు వాటిని బలపరిచేవిగానే వుంటున్నాయి.

భారత్‌లో పసివాళ్ల ఆకలి తీర్చడానికి తల్లులు ఉపయోగించే సెరిలాక్‌లో అధిక శాతం చక్కెరవుంటున్నదని స్విట్జర్లాండ్‌లోని స్వచ్ఛంద సంస్థ ‘పబ్లిక్‌ ఐ’ మరో సంస్థ అంతర్జాతీయ బేబీ ఫుడ్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ (ఐబీ–ఫాన్‌)తో కలిసి గురువారం బయటపెట్టాక దేశం నివ్వెరపోయింది. నెస్లే సంస్థ ఒక్క భారత్‌లో మాత్రమే కాదు, యూరప్‌ దేశాలతోపాటు ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, దక్షిణాసియా దేశాల్లో కూడా సెరిలాక్‌ విక్రయిస్తోంది. కానీ యూరప్‌ దేశాల పిల్లల కోసం తయారుచేసే సెరిలాక్‌కూ, వేరే దేశాల్లో విక్రయించే సెరిలాక్‌కూ చాలా వ్యత్యాసం వుంది. యూరప్‌ దేశాల్లో విక్రయించే సెరిలాక్‌లో అసలు చక్కెర పదార్థాలే వాడని నెస్లే... ఇతరచోట్ల మాత్రం యధేచ్ఛగా వినియోగిస్తున్నట్టు ‘పబ్లిక్‌ ఐ’ తెలిపింది. 

మూడేళ్లలోపు పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కృత్రిమంగా తీపిని పెంచే సుక్రోజ్, ఫ్రక్టోజ్‌ వంటి పదార్థాలేవీ కలపరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. పసిపిల్లల ఆహారోత్పత్తుల్లో కృత్రిమ తీపి పదార్థాలు, అదనపు చక్కెర వుండరాదన్నది 2022 సంవత్సర ప్రధాన నినాదం కూడా. కానీ దురదృష్టమేమంటే మన దేశం వాటి వినియోగాన్ని అనుమతిస్తోంది. తమ చిన్నారులకు అవసరమైన ప్రొటీన్‌లు, విటమిన్లు, ఐరన్‌ తదితర పోషకాలు లభిస్తాయన్న ఆశతో తల్లులు సెరిలాక్‌ వంటి ఉత్పత్తులను ఆశ్రయిస్తారు. గత అయిదేళ్లుగా సెరిలాక్‌లో కృత్రిమ తీపి పదార్థాల వాడకాన్ని 30 శాతం తగ్గించామని నెస్లే కంపెనీ తాజా వివాదం తర్వాత సంజాయిషీ ఇస్తోంది. మంచిదే.

కానీ అసలు వాడరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నప్పుడు ఈ తగ్గించటమేమిటి? ఇన్ని దశాబ్దా లుగా వాటిని ఎందుకు కొనసాగించినట్టు? ఇది తప్పించుకునే ధోరణి కాదా? నెస్లే సంస్థ సంగతలావుంచి అసలు మన దేశంలో అమ్ముడవుతున్న బహుళజాతి సంస్థల ఉత్పత్తుల్లో తగిన ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో చూసి నియంత్రించాల్సిన ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ) ఏమైనట్టు? ఎక్కడో స్విట్జర్లాండ్‌లోని స్వచ్ఛంద సంస్థలు వివిధ దేశాల్లో విక్రయించే సెరిలాక్‌ ఉత్పత్తుల నమూనాలను సేకరించి నిగ్గుతేల్చే వరకూ ఆ సంస్థ గాఢ నిద్రపోయిందా అనే సందేహం రావటం సహజం. పసివాళ్లకు అందించే ఆహారంలో పరిమితికి మించి చక్కెర లేదా ఉప్పు ఎక్కువైతే వారి ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుందనీ, చిన్న వయసునుంచే తీపి పదార్థాలకు వారు అలవాటుపడతారనీ నిపుణులంటారు.

ఈ పదార్థాలు ఊబకాయాన్ని పెంచుతాయని, పిల్లలు శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్, మధు మేహంవగైరా వ్యాధులకు లోనవు తారని హెచ్చరిస్తారు. మన పిల్లల్లో ఇటీవలకాలంలో ఊబకాయం లక్షణం పెరుగుతున్నదని అనేక సర్వేలు గొంతు చించుకుంటున్నాయి కూడా. అయినా నియంత్రణ వ్యవస్థల చెవులకు సోకలేదు. ఒక అంచనా ప్రకారం కేవలం సెరిలాక్‌ అమ్మకాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నెస్లే సంస్థ ఏటా వంద కోట్ల డాలర్ల (రూ. 8,400 కోట్లు)కుపైగా ఆర్జిస్తోంది. ఇందులో భారత్, బ్రెజిల్‌ దేశాల వాటాయే 40 శాతం వుంటుందని అంటారు. ఇంతగా లాభాలొచ్చే ఉత్పత్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసు కోవాలనీ, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలనీ నెస్లేకు తెలియదా? పోనీ అన్నిచోట్లా ఇలానే చేస్తే అజ్ఞానమో, నిర్లక్ష్యమో అనుకోవచ్చు. కానీ ధనిక దేశాల్లో ఒకరకంగా, వర్ధమాన దేశాల్లో మరో విధంగా ద్వంద్వ ప్రమాణాలు పాటించటం ఏ వ్యాపార నీతి?

ఆహార ఉత్పత్తులు, శీతల పానీయాలు తదితరాల విషయంలో ఏమరుపాటు పనికిరాదు. వాటిని ఎప్పుడో ఒకసారి పరీక్షించి చూసి వదిలేయకూడదు. నిర్ణీత కాలపరిమితుల్లో నిరంతరం వాటి నమూనాలను పరీక్షిస్తూ వుండాలి. మనం తినే తిండి ఆరోగ్యదాయకమేనా, సురక్షితమేనా అని మాత్రమే కాదు... ఉత్పత్తిదారు చెప్పుకుంటున్నవిధంగా అందులో పోషకాలున్నాయో లేదో గమనించాలి. ప్రమాణాలకు అనుగుణంగా లేనివాటిని నిర్దాక్షిణ్యంగా మార్కెట్‌ నుంచి తొలగించాలి. ప్రపంచంలో చైనా తర్వాత మన దేశమే అతి పెద్ద మార్కెట్‌. అందుకే బహుళజాతి సంస్థలు సినీతారలనూ, క్రీడా దిగ్గజాలనూ తమ బ్రాండ్‌ అంబాసిడర్లుగా రంగంలోకి దించి ప్రకటనలతో ఊదరకొడుతూ అచిరకాలంలోనే లాభాల బాట పడుతుంటాయి.

ఆ ఉత్పత్తుల్ని వాడటం ఆధునికతకూ, ఉత్తమాభి రుచికీ నిదర్శనమని బ్రాండ్‌ అంబాసిడర్లు చెప్తే మోసపోవటానికి మన మధ్యతరగతి ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. 2015లో మ్యాగీ నూడిల్స్‌లో అత్యంత హానికరమైన సీసం, మోనోసోడియం గ్లూటామేట్‌ వంటి పదార్థాలున్నాయని వెల్లడైనప్పుడు గగ్గోలైంది. తీరా తొమ్మిదేళ్లు గడిచాక జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్‌ మ్యాగీ నూడిల్స్‌ విషయంలో కేంద్రం నిర్ణయం సరికాదని ఈనెల మొదటివారంలో తోసిపుచ్చింది. నెస్లేకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. భవిష్యత్తులో సెరిలాక్‌ విషయంలోనూ ఇదే జరుగుతుందా? ఇతరత్రా అంశాల మాటెలావున్నా హానికారక ఆహార పదార్థాలు మార్కెట్‌లోకి రాకుండా చూడాల్సిన కనీస బాధ్యత తమకున్నదని కేంద్ర ప్రభుత్వం గుర్తించటం అవసరం. 

Advertisement
 
Advertisement