సాక్షి, రాజమహేంద్రవరం: మున్సిపల్ ఎన్నికలకు కీలక ఘట్టం పూర్తయ్యింది. రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారైంది. ఆశావహుల అంచనా తార్‌మార్ అయ్యింది. ఇది కొందరికి మోదాన్ని, మరికొందరికి ఖేదాన్ని మిగిల్చింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, నిడదవోలు, కొవ్వూరు, మండపేట మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ల ఖరారుతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాజమహేంద్రవరం మేయర్ పీఠం కోసం తామంటే తామే పోటీ చేస్తామంటున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఎస్సీ జనరల్ రిజర్వేషన్ ఊహించని పరిణామంగా మారింది. నిడదవోలులో ఎస్సీ మహిళకు కేటాయింపుతో కూటమి పార్టీల మధ్య పీఠం కోసం జరుగుతున్న అంతర్గత పోటీ కొత్త మలుపు తిరిగింది. కొవ్వూరులో జనరల్ మహిళకు రిజర్వేషన్ ఖరారు కావడంతో కొత్త ఆశావహులు తెరపైకి వస్తున్నారు.
కూటమికి కొత్త చిక్కులు
నిడదవోలు మున్సిపాలిటీ ఎస్సీ మహిళకు రిజర్వేషన్ ఖరారు కావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇక్కడ జనసేనకు చెందిన కందుల దుర్గేష్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో మున్సిపల్ చైర్మన్ కోసం తామే పోటీ చేస్తామని జనసేన నాయకులు ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. మరోవైపు గతంలో ఎమ్మెల్యే స్థానం విషయంలో త్యాగం చేసినందున, మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి తమకు అవకాశం ఇవ్వాలన్న వాదనను టీడీపీ నాయకులు ముందుకు తీసుకొచ్చారు. కూటమిలోని రెండు ప్రధాన భాగస్వామ్య పార్టీల మధ్య స్థానికంగా ఉన్న ఈ పోటీకి రిజర్వేషన్లు చెక్ పెట్టాయనే చెప్పొచ్చు. ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులు మున్సిపల్ పీఠంపై ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఎస్సీ మహిళకు రిజర్వేషన్ ఖరారు కావడంతో తమ వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఎస్సీ మహిళా అభ్యర్థిని ఏ పార్టీ ముందుగా తెరపైకి తీసుకొస్తుందో చూడాలి.
ఊహించినట్లే కొవ్వూరు, మండపేట
కొవ్వూరు మున్సిపాలిటీలో రిజర్వేషన్ల ఖరారు మరో ఆసక్తికర పరిణామానికి దారితీసింది. గత ఎన్నికల్లో ఈ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించడంతో, రొటేషన్ పద్ధతిలో ఈసారి అన్ రిజర్వ్‌డ్ కేటగిరీకి వచ్చే అవకాశముందని పలువురు ఆశావహులు భావించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ పీఠం కోసం పోటీ చేయాలన్న లక్ష్యంతో కొందరు నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటుండగా.. తాజా రిజర్వేషన్ వారి అంచనాలను మార్చేసింది. ఈసారి జనరల్ మహిళకు స్థానం కేటాయించడంతో కొత్త సామాజిక సమీకరణాలు తెరపైకి వచ్చాయి. ఇప్పటి వరకు పోటీకి దూరంగా ఉన్న కొందరు మహిళా నాయకులు పోటీకి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా... ఇతర వర్గాలకు చెందిన ఆశావహులు తమ తదుపరి రాజకీయ అడుగులపై ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తమకు అనుకూలంగా రిజర్వేషన్ రావడంతో పోటీ చేయాలని భావిస్తున్న మహిళా నాయకులు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. కొవ్వూరులో రిజర్వేషన్ మార్పు అభ్యర్థుల ఎంపికను మాత్రమే కాకుండా, పార్టీల స్థానిక వ్యూహాలను కూడా ప్రభావితం చేసే అవకాశముంది. మరోవైపు ఊహించినట్టుగానే మండపేట మున్సిపాలిటీని అన్ రిజర్వుడ్ కేటగిరీలో ఉంచారు.
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ ఖరారు
కొవ్వూరులో మొత్తం వార్డులు 28 కాగా ఎస్టీ జనరల్ ఒకటి, ఎస్సీ జనరల్ మూడు, మహిళకు 3, బీసీ జనరల్ 4, మహిళలకు 3, జనరల్ మహిళ 8, అన్‌రిజర్వుడ్ 6గా ఖరారు చేశారు.
నిడదవోలులో మొత్తం వార్డులు 32 కాగా ఎస్టీ జనరల్ ఒకటి, ఎస్సీ జనరల్ మూడు, మహిళకు 3, బీసీ జనరల్ 5, మహిళలకు 4, జనరల్ మహిళ 9, అన్‌రిజర్వుడ్ 7గా నిర్ణయించారు.
మండపేటలో మొత్తం వార్డులు 36 కాగా ఎస్టీ జనరల్ ఒకటి, ఎస్సీ జనరల్ రెండు, మహిళకు 2, బీసీ జనరల్ 7, మహిళలకు 6, జనరల్ మహిళ 10, అన్ రిజర్వుడ్ 8గా ఖరారు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీఓ జారీ చేసింది.
అసలు పరీక్ష ఇప్పుడే!
రిజర్వేషన్ల ఖరారు తర్వాత రాజమహేంద్రవరం, నిడదవోలు, కొవ్వూరు, మండపేట మున్సిపల్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య స్థానికంగా ఉన్న పోటీ, అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది చర్చనీయాంశమైంది. అధికార భాగస్వామ్యాన్ని రాష్ట్ర స్థాయిలో కొనసాగిస్తున్న పార్టీలు స్థానిక ఎన్నికల్లోనూ సమన్వయంతో ముందుకు సాగుతాయా? లేక పీఠాలు, డివిజన్ల పంపకాల విషయంలో పరస్పరం పోటీ పడతాయా? అనేది చూడాలి. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఆశావహులకు రిజర్వేషన్లు కొందరికి తలుపులు తెరిస్తే.. మరికొందరికి తలుపులు మూసేసినట్లయ్యాయి.
ఏడేళ్ల విరామం తర్వాత
సుమారు ఏడేళ్ల విరామం తర్వాత రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు జరగనున్నాయన్న అంచనాలతో రాజకీయ పార్టీల్లో హడావుడి పెరిగింది. నగర మేయర్ పీఠానికి తామంటే తామే పోటీ చేస్తామని కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కొద్ది రోజుల నుంచే పావులు కదుపుతున్నారు. కూటమిలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ, నగర రాజకీయాల్లో తమ బలాన్ని నిరూపించుకోవాలని ప్రతి పార్టీ భావిస్తోంది. మేయర్ స్థానం ఎవరికి దక్కాలి? ఎన్ని డివిజన్లలో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించాలి? కీలక పదవుల్లో తమ వర్గానికి ప్రాధాన్యం ఎలా సాధించాలి? అనే అంశాలపై అంతర్గతంగా లెక్కలు వేసుకుంటున్నారు.
ఫ స్థానిక ప్రజాప్రతినిధి ఇప్పటికే కొందరికి మేయర్‌గా పోటీ చేసేందుకు అవకాశమిస్తానని మాటిచ్చేశారు. మరోవైపు కొందరు టీడీపీ నాయకులైతే వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టేసి మరీ తామే మేయర్ బరిలో ఉన్నామని ప్రకటించేశారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగకముందే టీడీపీ నాయకులు తామే మేయర్లు అయిపోయినంత బిల్డప్ ఇచ్చేశారు. రిజర్వేషన్ ఖరారయ్యాక ప్రస్తుతం వారంతా సైలంట్ అయిపోయారు.
ఫ మరోవైపు కూటమి పొత్తులో భాగంగా రాజమహేంద్రవరం నుంచి పోటీ చేసే అవకాశం తమకే వస్తుందని బీజేపీ నాయకులు గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి వారి పార్టీ తరఫున ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో మేయర్ సీటు కోసం ప్రయత్నాలు చేశారు. వంద జెండాల పండగ అంటూ కొంత హడావుడి కూడా చేశారు. ఇదిలాఉంటే శాసనసభ ఎన్నికల సమయంలో చేసుకున్న ఒప్పందం మేరకు ఎమ్మెల్యే సీటు టీడీపీకి వదులుకున్నందున మేయర్ సీటు తమకే ఇస్తామన్నారని జనసేన నాయకులు ప్రయత్నాలు చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ స్థానానికి టీడీపీనే పోటీ చేయాలని, వేరే పార్టీలకు పోటీ చేసే అవకాశమివ్వకూడదని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వ్యూహాలు పన్నారు. ఈ నేపథ్యంలో మేయర్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఇన్నాళ్లూ ఆశలు పెట్టుకున్న పలువురు నాయకుల అంచనాలు తలకిందులయ్యాయి. తమకు అనుకూలమైన రిజర్వేషన్ వస్తుందని భావించిన ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఆశావహులు ఇప్పుడు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, వారి అనుచరుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తమకు పోటీ చేసే అవకాశం దక్కిందని సంతోషపడుతున్నారు. మరోవైపు ఎస్సీ జనరల్ కేటగిరీకి అనుగుణంగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడంతో పాటు, డివిజన్ల వారీగా సామాజిక సమీకరణాలను సమన్వయం చేసుకునే పనిలో వైఎస్సార్ సీపీ, కూటమి పార్టీలు ఉన్నాయి.
రిజర్వేషన్ల ప్రకటనతో
మారిన సమీకరణాలు
రాజమహేంద్రవరం
ఎస్సీ జనరల్‌కు కేటాయింపు
నిడదవోలు ఎస్సీ మహిళ,
కొవ్వూరు జనరల్ మహిళకు రిజర్వ్
అన్ రిజర్వుడ్ కేటగిరీలో
మండపేట మున్సిపాలిటీ


