● పింఛన్ల కోసం మొర
● సమస్యలు పరిష్కరించాలని
కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వృద్ధాప్యంలో ఆసరా దూరమైంది.. మంచం పట్టి నిస్సాహాయ స్థితిలో ఉన్నా ప్రభుత్వ సాయం అందకుంది.. మా కష్టానికి కన్నీరు తోడవుతోంది. పింఛన్లు అందించి ఆదుకోండంటూ దివ్యాంగులు, వృద్ధులు, సమస్యలు పరిష్కరించాలని మరికొందరు కలెక్టరేట్‌కు వచ్చి ప్రాధేయపడ్డారు. సోమవారం బొమ్మూరులోని కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 187 అర్జీలను అధికారులు స్వీకరించారు. ఎక్కువ మంది కొత్త పింఛన్ల కోసం అర్జీలు అందించారు. వాటిలో కొన్ని ఇలా..
డయాలసిస్ పింఛన్ ఇప్పించండి
నేను 2025 నుంచి వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్ పింఛన్ కోసం కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాను. కానీ పింఛన్ ఇవ్వడం లేదు. నా భార్య అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేయడమే కారణమని చెబుతున్నారు. అంగన్‌వాడీలకు రూ.పది వేల జీతం వస్తుంది. నా భార్యకు జీతమైనా పెంచండి. నాకు పింఛన్ అయినా ఇవ్వడి.
– కవులూరి రాజు, డయాలసిస్ పెషేంట్
ఆసరాగా నిలవండి
గత ఎన్నికల వేళ చంద్రబాబు 90 శాతం అంగవైకల్యం ఉన్నవారికి రూ.6 వేల నుంచి రూ.15 వేల పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోచ్చని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు అధికారుల చుట్టూ తిరిగాను. కానీ నాకు పింఛను సొమ్ము పెరగలేదు. నడవలేని పరిస్థితిలో ఉన్న నేను ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నాను. దయచేసి ఆసరాగా నిలవండి.
– పసుపులేటి సింహాచలం,
దివ్యాంగుడు, రాజమహేంద్రవరం
పట్టించుకోవడం లేదు..
మూడు చక్రాల స్కూటర్ కావాలని ఎన్నో సార్లు కలెక్టరేట్‌లో వినతిపత్రం ఇచ్చాను. నా బాధ చూడలేక కలెక్టర్ నాకు ట్రై స్కూటర్‌ని ఇస్తానని చెప్పడమే కాకుండా అధికారులను పిలిచి చెప్పారు. దానికి కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకుని రండి సంతకం చేస్తానని చెప్పారు. ఆరు నెలల నుంచి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాను. కానీ ఇప్పటి వరకు నాకు ఇవ్వలేదు. కలెక్టర్ చెప్పినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
– రొక్కం నీలకంఠేశ్వరరావు, దివ్యాంగుడు, బొమ్మూరు.
రెండేళ్ల నుంచి తిరుగుతున్నా..
ఉండ్రాజవరం మండలం పసలపూడిలో ఊరచెరువు గట్టు ఆక్రమణకు గురైంది. దీనిపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశాను. అధికారులు వచ్చి 17 ఇళ్లు ఆక్రమణలో ఉన్నాయని నివేదిక ఇచ్చారు. పూర్తి స్థాయి విచారణ చేయకుండా నేను సంతకం చేయనని చెప్పడంతో వారే నా సంతకం చేసి ఫిర్యాదు పరిష్కారం అని రాసి పంపించేశారు. దీనిపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశాను. అయినా పరిష్కారం కాలేదు.
–షేక్ షాజహాన్, పసలపూడి


