గుప్పుమంటున్న గంజాయి | - | Sakshi
Sakshi News home page

గుప్పుమంటున్న గంజాయి

Oct 13 2026 12:23 AM | Updated on Oct 13 2026 12:23 AM

● ఉమ్మడి తూర్పులో పెరుగుతున్న కేసులు

● రాజమహేంద్రవరంలో 35 కిలోలు స్వాధీనం

● ఇద్దరి అరెస్ట్‌.. మరొకరు పరారీ

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): చెప్పేదొకటి.. జరుగుతుందొకటి అన్నట్లు ఉంది. గంజాయి కేసులు తగ్గాయని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకొకచోట గంజాయి కేసు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధి గామన్‌ బ్రిడ్జి సమీపంలోని గండి పోచమ్మతల్లి ఆలయం వద్ద 35 కిలోల 100 గ్రాముల గంజాయిని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని విశ్వసనీయ సమాచారంతో రాజమహేంద్రవరం త్రీటౌన్‌ సీఐ వి.అప్పారావు తన సిబ్బందితో కలసి గామన్‌ బ్రిడ్జి సమీపంలో తనిఖీలు చేపట్టారు. రాజానగరం నుంచి కొవ్వూరు వైపు మార్గంలో వెళ్తున్న ఇద్దరిని తనిఖీ చేయగా, వారి వద్ద రెండు బ్యాగుల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.17.55 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన ద్విచక్ర వాహనంతో పాటు మూడు సెల్‌ఫోన్లు, రూ.800ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్‌ ఆదేశాల మేరకు, సెంట్రల్‌ జోన్‌ ఏఎస్పీ తరుణ్‌ పాశ్వా పర్యవేక్షణలో ఈ దాడులు నిర్వహించారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో ప్రకాశం జిల్లా కొండపి మండలం కట్టవారిపాలెం గ్రామానికి చెందిన రావూరి రాజేంద్ర, రాజమహేంద్రవరం గణేష్‌నగర్‌ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఎదురుగా నివాసం ఉండే పాచెర్ల క్రాంతికుమార్‌ అలియాస్‌ క్రాంతి ఉన్నారు. క్రాంతికుమార్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, పబ్లిక్‌ పార్క్‌ సమీపంలోని బాలుర హాస్టల్‌లో ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు ఒడిశా రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గుర్తుతెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి తీసుకు వస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ గంజాయి సేకరణకు ప్రకాశం జిల్లా కొండపి మండలం కుమ్మరిపాలెం గ్రామానికి చెందిన మాదాల వెంకటేశ్వరరావును నిందితులు పంపినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. నిందితులిద్దరినీ పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. వీరికి న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement