కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ జరిగింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి 20 అర్జీలను ఎస్పీ డి.నరసింహకిశోర్‌కు అందించారు. వారి సమస్యలను ఎస్పీ విని, వెంటనే సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని ఉత్తర్వులు ఇచ్చారు. కుటుంబ తగాదాలు, సివిల్, చీటింగ్ తదిత కేసులకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఇతర పోలీసు అఽధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఎగ్జామినేషన్ బోర్డు
కార్యదర్శిగా కొండపల్లి
అనపర్తి: తూర్పుగోదావరి జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు (డీసీఈబీ) కార్యదర్శిగా బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామానికి చెందిన కొండపల్లి వెంకటరమణరావు (శ్రీను మాస్టారు) నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాజమహేంద్రవరంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు నుంచి ఆయన నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని పలువురు అభినందించారు.
బీసీ బ్యాక్‌లాగ్ పోస్టులు
భర్తీ చేయాలి
సీటీఆర్‌ఐ: బీసీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో వినతి పత్రాన్ని అందజేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ జీఓ 172 ప్రకారం బీసీ బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 172 నిబంధనల ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, వర్సిటీలు, కలెక్టరేట్‌లలో పెండింగ్‌లో ఉన్న బీసీ బ్యాక్‌లాగ్ క్వారీ ఫార్వర్డ్ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు దొమ్మేటి సోమశేఖర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్‌లలో విజ్ఞాపన పత్రాలను సమర్పించామని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.
పశు సంపద రక్షణకు చర్యలు చేపట్టాలి
పశుపోషకుల సమస్యల పరిష్కారం, పశువైద్య సేవలు, పశుగ్రాస భద్రత, బీమా–పరిహారం, గోకులం షెడ్లు, ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ జనతా వారధి బృందం ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్‌లో వినతి పత్రాన్ని అందజేశారు. జనతా వారిధి కోకన్వీనర్లు యానాపు ఏసు, బండి సత్యప్రసాద్, బొరుసు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
వంటా వార్పుతో
వీఆర్‌ఏల నిరసన
రాజానగరం: స్థానికంగా వంటా వార్పుతో వీఆర్‌ఏలు తమ నిరసన తెలిపారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పే స్కేల్ అమలు చేయాలని, నామినీ వీఆర్‌ఏలను ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ గత 27 రోజులుగా వీఆర్‌ఏలు ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడంతో దశల వారీగా ఆందోళనను ఉధృతం చేయాలని భావించామని వీఆర్‌ఏల సంఘ జిల్లా అధ్యక్షుడు మల్లిమొగ్గల వెంకటరమణ తెలిపారు. ఇందులో భాగంగా ఈ వినూత్న నిరసన చేపట్టామన్నారు. కాగా రాజానగరంలో వీఆర్‌ఏలు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని తహాసీల్దార్ దివ్యభారతి సందర్శించి, వారి డిమాండ్ల గురించి అడిగి తెలుసుకున్నారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు.


