దేవరపల్లి: పులి గాండ్రిస్తూ తిరుగుతోంది.. రోజుకో గమ్యంలో పయనిస్తూ అందరినీ వణికిస్తోంది. వారం రోజులుగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సంచరిస్తుంది. పొలాలకు వెళ్లడానికి రైతులు భయపడుతుండగా, ఏ గ్రామంలోకి చొరబడుతుందోని జనం ఆందోళన చెందుతున్నారు. ఆ పులిని సురక్షితంగా బంధించడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నెల 7న తూర్పుగోదావరి జిల్లా సీతానగరం నుంచి గోదావరి నది దాటి పోలవరం మండలం గూటాల వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి తాళ్లపూడి మండలం తుపాకులగూడెం, పోచవరం, గోపాలపురం మండలం గజ్జరం, భీమోలు, గోపవరం గ్రామాల మీదుగా దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్ద మేరీమాత ఆలయం వెనుక క్వారీల్లోకి చేరుకుంది. తర్వాత నిడదవోలు మండలం వేలివెన్ను, కాల్దారి, పసలపూడి చేరుకుని, తాడేపల్లిగూడెం రూరల్ మండలం కోనాల నందమూరు వెళ్లింది. మళ్లీ గమ్యాన్ని మార్చుకుని చాగల్లు మండలం చాగల్లు, చిక్కాల మీదుగా ఆదివారం రాత్రి దేవరపల్లి మండలం దేవరపల్లి మండలం లక్ష్మీపురం–దేవరపల్లి గ్రామాల మధ్య పోలవరం కుడి కాలువ గట్టుకు చేరుకుంది. ఆ కాలువ గట్టు నుంచి దేవరపల్లి మండలం కృష్ణంపాలెం చేరుకుని, గట్టుపై కట్టిన లేగదూడపై పెద్దపులి పంజా విసిరింది. లేగ దూడను చంపి, అక్కడి నుంచి సోమవారం ఉదయానికి గోపాలపురం మండలం కోమటికుంట పొలాల మీదుగా సమీపంలోని మాతగమ్మ మెట్టపైకి చేరుకుని అక్కడ తిష్ట వేసింది. జీపీఎస్ ట్రాకర్ ద్వారా పులి సంచరిస్తున్న సమాచారాన్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు, రెస్క్యూ బృందాలు దానిని పట్టుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. మాతగమ్మ మెట్టపై పెద్దపులి ఉన్నట్టు గుర్తించిన అధికారులు, ఎన్‌ఎస్‌టీఆర్ (శ్రీశైలం), త్రిబుల్ ఆర్ రాజమహేంద్రవరం, పూణే రెస్క్యూ బృందాలు సుమారు 35 మంది అధికారులు, 40 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు 200 కిలో మీటర్లు పెద్దపులి ప్రయాణించినట్టు అధికారులు తెలిపారు. జిల్లా అటవీ శాఖ అధికారి ప్రభాకరరావు, రేంజ్ అధికారి దావీదురాజు నాయుడు, డిప్యూటీ రేంజ్ అధికారి ఎ.సూరిబాబు, చీఫ్ కన్జర్వేటర్ టి.జ్యోతి, కొండలరావు తదితరులు మాతంగమ్మ మెట్ట ప్రాంతాన్ని పరిశీలించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గ్రామాలకు ఆనుకుని ఉన్న పొలాల్లో పెద్దపులి సంచరిస్తున్నందున అంతా అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మాతగమ్మమెట్ట ప్రాంతంలోని పొలాల్లో ఉన్న రైతులు, కూలీలను అధికారులు ఇళ్లకు పంపించారు. ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, ఉదయం 8 గంటలు దాటిన తర్వాత రైతులంతా గుంపులుగా వెళ్లాలని, సాయంత్రం 5 గంటలకు గ్రామాలకు చేరుకోవాలని గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.
కృష్ణంపాలెం వద్ద
లేగదూడను చంపిన పులి
మాతగమ్మ మెట్టపై తిష్ట
బంధించేందుకు
రెస్క్యూ బృందాల ప్రయత్నం


