సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. ఇన్నాళ్లూ బీసీ రిజర్వేషన్ల అంశంపై నెలకొన్న అనిశ్చితి తొలగడంతో ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రభుత్వం ఎప్పుడు రిజర్వేషన్లు ప్రకటిస్తుందా... పోటీ చేసేందుకు అనుకూలమైన స్థానంలో రిజర్వేషన్ ఎలా ఉంటుందా అని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు. మరోవైపు రేపోమాపో ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించగానే షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు, కొవ్వూరు, మండపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే వార్డుల విభజన పూర్తయ్యింది. అనంతరం కొత్తగా ఏర్పాటైన తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌కు, మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించన్నారు. చివరి దశలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అదే సమయంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
అంతటా ఉత్కంఠ
మున్సిపల్ ఎన్నికలపై చర్చ మొదలవడంతో పట్టణాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఆయా పార్టీల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. రిజర్వేషన్లు ప్రకటిస్తే తమకు అనుకూలమైన వార్డుల్లో పోటీ చేసే అవకాశాలపై దృష్టి సారించనున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని భావిస్తున్న నాయకులతో పాటు కౌన్సిలర్ స్థానాలపై కన్నేసిన వారు కూడా ఎన్నికల సమీకరణాలను పరిశీలిస్తున్నారు. ఏ వార్డు ఏ కేటగిరీకి కేటాయిస్తారన్నది అభ్యర్థుల పోటీ అవకాశాలను నిర్ణయించనుంది. రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై స్పష్టత రానుంది. నిడదవోలు, కొవ్వూరు, మండపేట మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులు, వార్డుల రిజర్వేషన్ల ఖరారు కీలకంగా మారింది. మరోవైపు జెడ్పీ పీఠంతో పాటు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యుల స్థానాల రిజర్వేషన్ కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ రిజర్వేషన్ తమకే అనుకూలిస్తుందంటే... తమకే అనుకూలిస్తుందని ఆశల పల్లకిలో నాయకులు ఊగుతున్నారు.
కొత్త జెడ్పీకి తొలిసారి ఎన్నికలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌కు 2021లో ఎన్నికలు జరిగాయి. అనంతరం జిల్లాల విభజన జరిగినప్పటికీ కాకినాడ కేంద్రంగానే జెడ్పీ కార్యకలాపాలు ఇన్నాళ్లూ సాగాయి. గత నెల 25 నుంచి ఉమ్మడి జెడ్పీని నాలుగు జెడ్పీలుగా విభజించారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేటలోని కార్యాలయంలో ప్రస్తుతం తూర్పుగోదావరి జెడ్పీ కార్యకలాపాలు తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. 21 మండలాలతో ఏర్పడిన కొత్త జెడ్పీకి తొలిసారి ఎన్నికలు జరగనుండడంతో పోరు రసవత్తరంగా మారనుంది. ఉమ్మడి తూర్పు గోదావరిలోని 12 మండలాలు (రాజమహేంద్రవరం రూరల్, కడియం, గోకవరం, రాజానగరం, కోరుకొండ, సీతానగరం, అనపర్తి, రంగంపేట, బిక్కవోలు, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం), ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని 9 మండలాలు (కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం, దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల)తో ఏర్పాటైన జెడ్పీకి తొలి చైర్మన్ అయ్యేందుకు ఆశావహులు ఎక్కువ మందే ఉన్నారని తెలుస్తోంది. అయితే రిజర్వేషన్లు ఖరారైతే పోటీలో నిలిచే అభ్యర్థులు ఎవరన్నది ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.
నిడదవోలు మున్సిపల్ కార్యాలయం
వైఎస్సార్ సీపీకి వంద శాతం
గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయ ఢంకా మోగించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ను వైఎస్సార్ సీపీ సొంతం చేసుకోవడంతో విప్పర్తి వేణుగోపాల్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. మరోవైపు మండపేట, కొవ్వూరు, నిడదవోలు మున్సిపాలిటీలను వైఎస్సార్ సీపీ అభ్యర్థులే సొంతం చేసుకున్నారు.
కొవ్వూరు మున్సిపాలిటీ 24 వార్డుల్లో 14 చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
నిడదవోలు మున్సిపాలిటీ 28 వార్డుల్లో మొత్తం 27 చోట్ల ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో చైర్మన్ పీఠం వైఎస్సార్ సీపీ సొంతమైంది.
మండపేట మున్సిపాలిటీలో 30 వార్డుల్లో 23 చోట్ల వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగురవేసింది.
ఉమ్మడి తూర్పు గోదావరిలోని 75 జెడ్పీటీసీ స్థానాల్లో 72 చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయం సాధించి తిరుగులేని ఆధిక్యంతో జెడ్పీ చైర్మన్ పీఠం సొంతం చేసుకున్నారు.
మరోవైపు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లుగా 90 శాతానికిపైగా స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, మద్దతుదారులే గెలుపొందారు. బూటకపు హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇప్పుడు కూడా తామే విజయపతాకం ఎగురవేస్తామని వైఎస్సార్ సీపీ నాయకులు నమ్మకంతో ఉన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రజలంతా కోరుకుంటున్నారని, ఈ సెమీ ఫైనల్స్ పోరులో అందుకు మార్గం సిద్ధం చేస్తామని అంటున్నారు. ఆ దిశగా పార్టీ నాయకులు శ్రేణులను సమాయత్తం చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
తొలిదశలో నిడదవోలు,
కొవ్వూరు, మండపేటలో ఎన్నికలు
మలిదశలో జెడ్పీ, మండల పరిషత్,
పంచాయతీల సంగ్రామం
చివరి దశలో రాజమహేంద్రవరం
కార్పొరేషన్ ఎన్నికలు
రిజర్వేషన్ల ప్రకటన కోసం
ఆశావహుల ఎదురుచూపులు
మరోసారీ సత్తా చాటేందుకు
వైఎస్సార్ సీపీ సమాయత్తం
తూర్పుగోదావరి జిల్లాలో ఇలా..
పంచాయతీలు 342
ఎంపీటీసీ స్థానాలు 390
జెడ్పీటీసీ స్థానాలు 21
మున్సిపాలిటీలు 03
నగరపాలక సంస్థ 01


