మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ
కాజులూరు: బీసీలపై కూటమి నేతలు కపట ప్రేమను చూపుతున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం రామచంద్రపురంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి నేతలు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల ప్రకటన అంతా బూటకమన్నారు. 2020 పంచాయతీరాజ్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ప్రతాప్‌రెడ్డితో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చెయ్యడానికి వీలులేదంటూ కోర్టులో ఫిల్ వేయించారన్నారు. కోర్టు తీర్పును అనుసరిస్తూనే అప్పటి ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ పరంగా 34 శాతానికి తగ్గకుండా బీసీలకు సీట్లు కల్పించారన్నారు. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే బీసీల రిజర్వేషన్‌కు చట్టసవరణ చేయించాలన్నారు. అంతేతప్ప రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ప్రకటించడం, వారే కోర్టులో పిల్ వేయించడం కూటమి నేతలకు సరికాదన్నారు.
పోలవరం జిల్లా పరిషత్
సీఈఓగా కిశోర్‌కుమార్
రాజమహేంద్రవరం రూరల్: పోలవరం జిల్లా పరిషత్ కార్యాలయం ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా జిల్లా డ్వామా కార్యాలయ పరిపాలనాధికారి కె.కిశోర్‌కుమార్‌ను నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన తూర్పుగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయం ఇన్‌చార్జి సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కొనసాగిన వీఆర్‌ఏల ఆందోళన
కోరుకొండ: తమ సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం ఆగదని వీఆర్‌ఏల సంఘ మండల అధ్యక్షుడు కన్నయ్య, సెక్రటరీ చిన్నబాబు అన్నారు. కోరుకొండలో వీఆర్‌ఏల ఆందోళన శనివారంతో 25వ రోజుకు చేరింది.


