సీటీఆర్‌ఐ: పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే గోదావరి నది ఒడ్డున ఉన్న రాజమహేంద్రవరం కోటిలింగాల రేవు నేడు తన అస్తిత్వాన్ని కోల్పోయి విలపిస్తోంది. ఒకప్పుడు కోటిలింగాల క్షేత్రంగా విరాజిల్లుతూ, వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు, పితృ దేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు అర్పించేందుకు వేదికగా నిలిచిన ఈ పుణ్యభూమి, నేడు అక్రమ ఇసుక తోడేళ్ల కోరల్లో చిక్కుకుంది. ఆధ్యాత్మిక సవ్వడితో నిండాల్సిన ఆ తీరం ఇసుకను నమిలేసే యంత్రాలు, లారీల హారన్లతో విసుగు పుట్టిస్తోంది. గోదావరి గర్భాన్ని నిలువునా తవ్వేస్తూ, రోజుకు దాదాపు 300 లారీల్లో ఎటువంటి ప్రభుత్వ బిల్లులు కానీ, సీనరేజ్ రుసుములు కానీ చెల్లించకుండా రూ.కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అధికార టీడీపీకి చెందిన స్థానిక ప్రధాన ప్రజాప్రతినిధి అనుచరులు, నాయకుల అండదండలతో ఈ దోపిడీ విచ్చలవిడిగా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆపేదెవరంటూ..
కోటిలింగాల రేవులోని ఇసుక ర్యాంపుల్లో మాఫియా రెచ్చిపోతుంది. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో కోటిలింగాల ర్యాంపులో ఉన్న మూడు ఏజెన్సీల ఆధ్వర్యంలో నడుస్తున్న 7 ఇసుక ర్యాంపుల్లో దోచుకున్న వాడికి దోచుకున్నంత అన్నచందంగా మారింది. దీనికి ఆ ప్రజాప్రతినిధికి చెందిన ఓ డాక్టర్ ఆధ్వర్యంలో ఈ ఇసుక అక్రమ తరలింపు జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీటీఈ, సీటీఓ అనుమతులు ముగిసినా పట్టించుకోవడం లేదు. ఇసుకను అడ్డగోలుగా దోచేస్తున్నారు.
దసరాల సెలవులే స్కెచ్..
ఆదివారం నుంచి దసరా సెలవులు కావడంతో అధికారులు, సిబ్బంది తనిఖీలకు రారని తెలుసుకుని, పెద్దఎత్తున ఇసుక అక్రమ రవాణాకు తెర తీశారు. గత రెండు రోజుల క్రితం మైనింగ్ అధికారులు ర్యాంపులను పరిశీలించి సీటీఈ, సీటీఓ చెల్లించలేదని, బిల్లులు కూడా సక్రమంగా లేవని నిర్ధారించడంతో ర్యాంపులను మూసివేశారు. కానీ శనివారం రాత్రి నుంచి దసరా అయిపోయే వరకూ దోచుకోవడానికి ప్రజాప్రతినిధి అండతో భారీగా స్కెచ్ వేశారు. వందల లారీలను కోటిలింగాల ర్యాంపునకు దగ్గరల్లో మోహరించారు. అదును చూసుకుని దోపిడీ చేయడానికి రంగం సిద్ధం చేశారు.
కోటిలింగాల రేవులో
అక్రమ రవాణాకు ఏర్పాట్లు
అధికార అండతో
రెచ్చిపోతున్న మాఫియా
శనివారం రాత్రి నుంచి
దోపిడీకి రంగం సిద్ధం
రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం
ఒక్కో ర్యాంపు నుంచి సుమారు వంద లారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అదే విధంగా కోటిలింగాల ర్యాంపుల్లోని మిగిలిన ర్యాంపుల్లో కలిపి వందల లారీలు రాత్రి వేళల్లో దర్జాగా తరలిపోతున్నాయి. బిల్లులు సైతం లేకుండా లారీల్లో ఇసుక తరలిపోతుందంటే రాజకీయ పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రోజుకు రూ.లక్షల్లో దోచుకుంటున్నారని, దానికి ప్రధాన సూత్రదారుడిగా టీడీపీకి చెందిన డాక్టర్ నాయకత్వం వహిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.


