● రోజుకో చోట ప్రత్యక్షం
● పట్టుకునేందుకు అధికారుల ప్రయత్నం
చాగల్లు: పులి హడలెత్తిస్తోంది.. రోజుకో చోట ప్రత్యక్షమవుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుండగా, అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. రెండు రోజులుగా దేవరపల్లి, చాగల్లు, నిడదవోలు, ఉండ్రాజవరం మండలాల పరిధిలోని పలు గ్రామాల మీదుగా సంచరించిన పెద్ద పులి శనివారం తిరిగి చాగల్లు శివారు ప్రాంతానికి చేరుకుంది. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గమ్యం మార్చుతూ..
రెండు రోజుల క్రితం దేవరపల్లి మండలం నుంచి చాగల్లు మండలంలోని చిక్కాల మీదుగా నిడదవోలు, ఉండ్రాజవరం మండలాల పరిధిలోని గ్రామాల వైపు పెద్ద పులి వెళ్లింది. తిరిగి శనివారం నిడదవోలు మండలం కాటకోటేశ్వరం, చాగల్లు మండలం కలవలపల్లి మీదుగా చాగల్లు శివారు పొలాల్లోకి ప్రవేశించినట్టు అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం చాగల్లు –లక్ష్మీపురం రహదారి సమీపంలోని మేడ ప్రసాద్‌కు చెందిన పొలం పక్కన ఉన్న పామాయిల్ తోటలోకి పులి ప్రవేశించింది. స్థానికులు దూరం నుంచి పులిని చూసినట్టు చెబుతున్నారు. అక్కడే సాయంత్రం వరకు సేదతీరిందని తెలిపారు. జనావాసాలకు, వ్యవసాయ భూములకు సమీపంలో పులి సంచరిస్తుండటంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెద్ద పులి ఎప్పుడు, ఏ దిశగా కదులుతుందోనని చాగల్లు, మీనానగరం పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.
రంగంలోకి ప్రత్యేక బృందాలు
పెద్ద పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. చాగల్లు –లక్ష్మీపురం రహదారిలో రాకపోకలు నిలిపివేశారు. సుమారు 50 మంది అటవీ శాఖ సిబ్బందితో పాటు 10 మంది పూణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందం పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. పులి సంచారాన్ని గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు, డ్రోన్లను ఏర్పాటు చేయడంతో పాటు పట్టుకునేందుకు బోనును కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. రాజమహేంద్రవరం సీసీఎఫ్ టి.జ్యోతి, డీఎఫ్‌ఓ ప్రభాకర్, ఎఫ్‌ఆర్‌ఓ డేవిడ్‌రాజ్ నాయుడు, చాగల్లు తహసీల్దార్ ఎం.మెరీకమ్మ తదితర అధికారులు శనివారం రాత్రి ఎనిమిది గంటల వరకు పులి సంచరించిన ప్రాంతంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. పెద్ద పులి సంచారం నేపథ్యంలో చాగల్లు, మీనానగరం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొవ్వూరు ఆర్డీఓ కె.ఆనందరావు సూచించారు.


