కబళించిన బస్సు | - | Sakshi
Sakshi News home page

కబళించిన బస్సు

Oct 11 2026 12:15 AM | Updated on Oct 11 2026 12:15 AM

● సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

● తండ్రికి తీవ్ర గాయాలు

ధవళేశ్వరం: కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. చదువు పూర్తవ్వగానే ఉద్యోగం లభించడంతో బాగా స్థిరపడి తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలని తపించింది. అయితే అనుకోని ప్రమాదం ఆమెను అనంతలోకాలకు తీసుకెళ్లింది. రోడ్డు ప్రమాదంలో యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతితో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. ఈ సంఘటనకు సంబంధించి ధవళేశ్వరం పోలీసుల కథనం ప్రకారం. రావులపాలేనికి చెందిన గుండారపు గోవిందరాజు కుమార్తె శాంభవి(22). ఆమె చదువు పూర్తి చేసుకొని విశాఖపట్నంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తుంది. అయితే ఇంటికి వచ్చిన ఆమె విశాఖపట్నం వెళ్లేందుకు పయనమైంది. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో ట్రైన్‌ ఎక్కేందుకు బైక్‌పై రావులపాలెం నుంచి తండ్రి గోవిందరాజుతో బయలుదేరింది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం పోలీస్‌ స్టేషన్‌ సమీపానికి వచ్చే సరికి ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో బైక్‌ వెనుక కూర్చున్న శాంభవి బస్సు టైరు కింద పడటంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. బైక్‌ నడుపుతున్న గోవిందరాజు ఎడమ మోచేతికి గాయమైంది. కళ్ల ముందే కూతురు మృతి చెందడంతో ఆ తండ్రి రోదన అక్కడి వారిని కంటతడి పెట్టించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, కేసును ధవళేశ్వరం సీఐ టి.గణేష్‌ ఆధ్వర్యంలో ఎస్సై బి.హరిబాబు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదాలకు నిలయంగా...: ధవళేశ్వరం ప్రధాన రహదారి ఇటీవల కాలంలో ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇసుక లారీలతో ప్రధాన రహదారి రద్దీగా ఉంటోంది. దీనికితోడు అధిక ఇసుక లోడుతో వెళుతున్న లారీల నుంచి రోడ్డుపై ఇసుక పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement