జగన్‌తో రాజకీయ భరోసా
రాయవరం మండలం వి.సావరం గ్రామ సర్పంచ్ పదవిని గత పంచాయతీ ఎన్నికల్లో జనరల్ మహిళకి రిజర్వు చేశారు. అయితే ఆ స్థానంలో బీసీ (శెట్టిబలిజ) మహిళనైన నేను పోటీ చేసేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు స్థానిక నాయకులు అవకాశమిచ్చారు. నా గెలుపు కోసం నాయకులంతా శ్రమించారు. ఐదేళ్లు సర్పంచ్‌గా గ్రామానికి సేవలందించాను. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బలహీనవర్గాలకు ఆత్మబంధువు. బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా భరోసా కల్పించారు.
– కాకి కృష్ణవేణి, తాజా మాజీ సర్పంచ్,
వి.సావరం, రాయవరం మండలం
బీసీల ఆత్మబంధువులా..
గత పంచాయతీ ఎన్నికల్లో నిడదవోలు మండలం మునిపల్లి పంచాయతీని జనరల్ అభ్యర్థులు పోటీ చేసేందుకు కేటాయించారు. అయితే వైఎస్సార్ సీపీ నాయకులు ఆ స్థానంలో బీసీనైన నేను పోటీ చేసేందుకు అవకాశమిచ్చి గెలిపించారు. అప్పటి నుంచి గ్రామాభివృద్ధికి కృషి చేశాను. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ యూత్ విభాగం మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్ జగన్ ఎంతగానో కృషి చేశారు. రాజకీయ ప్రాధాన్యం కల్పించి, ఆర్థిక ఆసరాగా నిలిచారు.
– వెలగన నరేష్, సర్పంచ్,
మునిపల్లి, నిడదవోలు మండలం
సాక్షి, రాజమహేంద్రవరం /కపిలేశ్వరపురం/నిడదవోలు రూరల్: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ హడావుడి చేయడం.. అందుకు రెండు జీఓలు తీసుకురావడం.. అవి హైకోర్టులో నిలవకపోవడంతో మళ్లీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం.. ఇదంతా బీసీలకు న్యాయం చేయడానికా? లేక స్థానిక సంస్థల ఎన్నికల ముందు మమ్మల్ని మరోసారి మభ్యపెట్టడానికా? అంటూ బలహీన వర్గాల ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఉందన్న విషయం చంద్రబాబుకు తెలియదా? తెలిసే జీఓలు ఇప్పించారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు బీసీ వర్గాల్లో తీవ్రంగా వినిపిస్తున్నాయి. బలహీనవర్గాలకు నిజంగా 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి రాజకీయ ప్రాధాన్యం కల్పించాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉంటే.. కోర్టుల చుట్టూ తిరిగి కాలయాపన చేసేకంటే కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి చట్టబద్ధమైన పరిష్కారం చూపాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి పార్లమెంట్‌లో చట్టం చేయించలేరా? అని ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 34 శాతం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం తప్ప మరొకటి లేదని బీసీలు ఆరోపిస్తున్నారు. ‘మాకు జీఓలు వద్దు.. న్యాయం కావాలి. ప్రకటనలు వద్దు.. హక్కులు కావాలి’ అని అంటున్నారు.
జనరల్ స్థానాల్లో పోటీ చేయించిన జగన్
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతానికి పైగా ప్రాతినిధ్యం కల్పించేలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారని బీసీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. న్యాయపరమైన సవాళ్లు ఎదురైనా బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లారని చెబుతున్నారు. ‘బీసీలకు నిజమైన ఆత్మబంధువు ఎవరో.. మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించింది అందరికీ తెలుసు’ అని బీసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. బీసీలను కేవలం ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకుగా చంద్రబాబు చూస్తున్నారని.. అందుకోసమే పార్టీ పరంగా 34 శాతం సీట్లు ఇస్తామని గొప్పగా చెబుతున్నారని మండిపడుతున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనే వైఎస్సార్ సీపీ తరఫున 50 శాతం స్థానాలను నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు కేటాయించారని గుర్తు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా జనరల్ కేటగిరీ స్థానాల్లోనూ పోటీ చేయించి వారికి రాజకీయ ప్రాధాన్యమిచ్చారని కొనియాడుతున్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ బలహీన వర్గాల నాయకులకు అగ్రతాంబూలం ఇచ్చిన మనసున్న నాయకుడు జగనేనని.. ఆయనే బీసీల ఆత్మబంధువని గొంతెత్తి చాటుతున్నారు. ఇప్పటికై నా చంద్రబాబు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో రాజకీయ డ్రామాలు కాకుండా.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో చట్టం చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయంగా ప్రోత్సహించారు
గత పంచాయతీ ఎన్నికల్లో కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామం జనరల్ మహిళకి రిజర్వు చేశారు. అప్పటి సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, బీసీలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యమిచ్చారు. జనరల్ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు అవకాశమిచ్చారు. వైఎస్ జగన్ నిర్ణయం మేరకు ఎస్సీ మహిళనైన నాకు తాతపూడిలో పోటీ చేసే అవకాశం దక్కింది. ఐదేళ్లు సర్పంచ్‌గా గ్రామానికి సేవలందించాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్నివిధాలా వైఎస్ జగన్ ఆదుకున్నారు.
– గూటం శ్రావణి, తాజా మాజీ సర్పంచ్, తాతపూడి,
కపిలేశ్వరపురం మండలం
కీలక పదవులిచ్చారు
ఐదేళ్ల పాలనలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బలహీన వర్గాలను రాజకీయంగా ఎంతగానో ప్రోత్సహించారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ వర్గాలందరికీ ప్రాధాన్యమిచ్చారు. ముఖ్యంగా మార్కెట్ కమిటీల్లోనూ రిజర్వేషన్లు కల్పించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. తరాల తరబడి బీసీలకు దక్కని పదవులను కూడా కేటాయించారు. నిడదవోలు ఏరియా మార్కెట్ కమిటీని ఏర్పాటు చేసిన వెంటనే తొలి చైర్మన్‌గా బీసీనైన నన్ను నియమించారు. ప్రజలకు సేవచేసేందుకు ఎంతో అవకాశమిచ్చారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ బీసీ సెల్ నిడదవోలు నియోజకవర్గ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు.
– వి.పోలయ్య, నిడదవోలు ఏఎంసీ మాజీ చైర్మన్
34 శాతం రిజర్వేషన్ల పేరుతో నాటకాలు
హైకోర్టు కొట్టివేసినా సుప్రీంను
ఆశ్రయించి కాలయాపన
పార్టీ పరంగా అదే శాతం
సీట్లిస్తామని చంద్రబాబు కొత్తరాగం
గత స్థానిక ఎన్నికల్లోనే బీసీలకు
50 శాతం సీట్లిచ్చిన వైఎస్ జగన్
జనరల్ స్థానాల్లోనూ
పోటీకి నిలిపిన వైనం
ఓటు బ్యాంకుగా చూస్తూ
వెన్నుపోటు పొడుస్తున్న బాబు


