వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

Oct 6 2026 12:12 AM | Updated on Oct 6 2026 12:12 AM

రంగంపేట: ఎన్నికల ముందు యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్‌ వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్‌ఏలు చేపట్టిన శాంతియుత ఆందోళనల్లో భాగంగా సోమవారం రంగంపేట తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ధర్నా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వీఆర్‌ఏలు నిరంతరం సేవలందిస్తున్నారని అన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ కార్యక్రమాల అమలు, రెవెన్యూ శాఖకు సంబంధించిన వివిధ పనుల్లో వీఆర్‌ఏల సేవలు కీలకమన్నారు. అలాంటి ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ వీఆర్‌ఏల జీతభత్యాలు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీ మేరకు వీఆర్‌ఏల జీతభత్యాలను పెంచి వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని కోరారు. వీఆర్‌ఏలు గత 20 రోజులుగా శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం వారి సమస్యలపై సానుకూలంగా స్పందించకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లాటి ఇస్రాయిల్‌, పార్టీ రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి పాలాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ధర్నాకు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి మద్దతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement