ఎటపాక: పోలవరం జిల్లా గొల్లగుప్ప వలస ఆదివాసీ గ్రామంలో క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఓ బాలిక మృతి చెంది 53 మంది అస్వస్థతకు గురైన ఘటనపై సోమవారం హైకోర్టులో విచారణ జరిపారు. గత నెల ఒకటో తేదీన గొల్లగుప్పలో మలేరియా కేసులు వెలుగు చూడటంతో వైద్యశాఖ ఆధ్వర్యంలో గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేశారు. వాటిని వేసుకున్నవారు వాంతులు, వికారంతో తీవ్ర అస్వస్థతకు గురికాగా, రెండో తరగతి చదువుతున్న మడివి జమున అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అస్వస్థతకు గురైన వారిని లక్ష్మీపురం పీహెచ్‌సీకి తరలించి అక్కడ చికిత్స అనంతరం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించారు. చిన్నారి మృతికి క్లోరోక్విన్ మాత్రలే కారణమా.. మరేదైనా వైద్యపరమైన కారణం ఉందా అనే అంశంపై విచారణ చేపట్టారు. ఈ ఘటన సుప్రీంకోర్టు ముందుకు వెళ్లడంతో దర్యాప్తు ప్రక్రియను పర్యవేక్షించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. మందులకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టు ఆధారంగా తదుపరి విచారణ కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించినట్టు సమాచారం.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 20 అర్జీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు 20 మంది అర్జీదారులు హాజరై తమ సమస్యలను ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్‌కు వివరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఏఎస్పీ అర్జీలు స్వీకరించారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పీజీఆర్‌ఎస్‌కు సివిల్, చీటింగ్ కేసులు, కుటుంబ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి.
ఉద్యోగాలు ఇప్పిస్తానని
రూ.21 లక్షలకు టోకరా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పాస్టర్ వద్ద రూ.21 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటనపై స్థానిక ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. బర్మాకాలనీకి చెందిన పాస్టర్ జాషువా పేదలకు సహాయం చేస్తుంటారు. అతనికి సౌమిత్రి అనే వ్యక్తి వేరే స్నేహితుని ద్వారా పరిచయం అయ్యాడు. తనను సింహాచలం అని పరిచయం చేసుకున్నాడు. తాను టీటీడీలో ఉద్యోగాలు వేయిస్తానని పాస్టర్ జాషువాతో చెప్పాడు. దీంతో పేద పిల్లలకు ఉద్యోగాలు కల్పించేందుకు పాస్టర్ జాషువా నుంచి రూ.21 లక్షలు తీసుకున్నాడు. ఎంతకాలమైనా సౌమిత్రి నుంచి సరైన సమాధానం రాకపోవడం, ఫోన్ ఎత్తకపోవడంతో జాషువాకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘తెల్లకాగితం’ సినీ బృందం సందడి
అల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘తెల్లకాగితం’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. సోమవారం స్థానిక అనుశ్రీ సినిమాస్ (సామికృష్ణ) థియేటర్‌లో చిత్ర హీరో హర్షరోషన్, హీరోయిన్ నక్షత్ర, దర్శకుడు రమేష్ గండ్రెడ్డి, నిర్మాత కృష్ణ కొమ్మాలపాటి సందడి చేశారు. ఈ సందర్భంగా హీరో హర్షరోషన్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం తనకు ఎంతో ఇష్టమైన ప్రాంతమని తెలిపారు. గతంలో లఘచిత్రాల చిత్రీకరణ కోసం కూడా ఇక్కడికి వచ్చేవాడినని గుర్తుచేశారు. తాను నటించిన సినిమా రాజమహేంద్రవరంలో హౌస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతుండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ గోదావరి ప్రాంతంలోని ప్రకృతి అందాలను సినిమాలో అందంగా చూపించామని తెలిపారు. కుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరించాలని కోరారు. దర్శకుడు రమేష్ గండ్రెడ్డి మాట్లాడుతూ గోదావరి ప్రాంతంలోని అందమైన లొకేషన్లను కథకు అనుగుణంగా ఎంపిక చేసి చిత్రీకరించామని తెలిపారు. ఫస్ట్‌హాఫ్ వినో దాత్మకంగా, సెకండ్‌హాఫ్ భావోద్వేగాలతో సాగుతుందని చెప్పారు. నిర్మాత కృష్ణ కొమ్మాలపాటి మాట్లాడుతూ ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌తో పా టు తెలంగాణ ప్రేక్షకుల మంచి స్పందన వస్తుందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రిలీజ్ చందన సినిమాస్ డిస్ట్రిబ్యూటర్ సత్తి రెడ్డి, చిత్ర బృందం సభ్యులు అభిమానులు పాల్గొన్నారు.


