గోకవరం: ఓ యువతిపై రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్థానికుల కథనం ప్రకారం.. జగ్గంపేటకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి గోకవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన టీడీపీ నేతతో కలిసి లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్ వివరాలు తెలిపేందుకు స్థానికంగా ఓ యువతిని నియమించారు. రెండు రోజుల క్రితం సదరు యువతిపై జగ్గంపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుచితంగా ప్రవర్తించడంతో ఆ యువతి భయంతో కేకలు వేసికుంటూ బయటకు వచ్చి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పింది. దీంతో వ్యాపారికి దేహశుద్ధి చేసినట్టు స మాచారం. దీనిపై నియోజకవర్గంలోని ఓ ముఖ్య నాయకుడు స్థానిక గ్రామ నాయకుడితో కలిసి రాజీ కుదిర్చేందుకు పావులు కదపడంతో విష యం పెద్దది కాకుండా సద్దుమనిగినట్టు సమాచారం. ఈ విషయమై పోలీసులను వివరణ అడగ్గా తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.
ఆరో రోజూ దొరకని
మహిళ మృతదేహం
తాళ్లపూడి: పోలవరం మండలం పట్టిసీమకు చెందిన వింటి ఆదిలక్ష్మిని ఆటో డ్రైవర్ హత్య చేసి గోదావరిలో పడేసిన ఘటనలో ఆరో రోజూ గాలింపు కొనసాగించారు. తాడిపూడిలో హత్యకు గురైన మహిళ మృతదేహం కోసం గోదావరిలో గాలింపు చర్యలు వేగవంతం చేయాలని కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ఎన్‌డీఆర్‌ఫ్ రిస్క్యు టీం సిబ్బందికి తెలిపారు. ప్రక్కిలంకలో గోదావరి నది వద్ద పడవలు, బోట్లపై రిస్క్యూ టీం గాలింపు నిర్వహించారు. ఎస్సై టి.రామకృష్ణ, ఎంపీడీఓ అమ్మిరాజు పరిశీలించారు.
సాఫ్ట్‌బాల్ పోటీలకు కేదార్‌నాథ్
ముమ్మిడివరం: ఇటీవల ఐ.పోలవరం మండలం జి.వేమవరం హైస్కూల్‌లో నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీల్లో ముమ్మిడివరం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి జె.కేదార్‌నాథ్ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరిగినట్లు పీడీ కోన సందీప్ తెలిపారు. ఆ విద్యార్థిని హెచ్‌ఎం బి.హనుమంతరావు తదితరులు అభినందించారు.


