దేవరపల్లి: ముందర కాళ్లకు బంధం పడింది.. పొగాకుకు గిట్టుబాటు ధర కోసం ఢిల్లీ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మార్కెట్లో తగిన ధర లభించని పరిస్థితి ఎదురైంది. పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీరే మార్గం లేక ఆందోళన నెలకొంది. రూ.లక్షల పెట్టుబడి పెట్టి పండించిన పొగాకు ఇళ్లల్లోనే మగ్గిపోతోంది. గత రెండేళ్లు మార్కెట్లో పొగాకుకు మంచి డిమాండ్ ఏర్పడడంతో 2025–26 పంట కాలంలో అధిక విస్తీర్ణంలో పొగాకు సాగు చేశారు. బోర్డు అనుమతించిన పరిమాణం కంటే అదనంగా దాదాపు 35 మిలియన్ల కిలోల ఉత్పత్తి జరిగినట్టు బోర్డు అధికారుల అంచనా. బ్యారన్‌కు 40 క్వింటాళ్లు పండించాల్సి ఉండగా, 10 నుంచి 15 క్వింటాళ్లు అదనంగా పండించారు. ఎకరా పొగాకు సాగుకు రూ.3 లక్షల ఖర్చు అవుతుంది. కౌలు రైతులకు ఈ ఖర్చు మరింత పెరుగుతుంది. గత ఏడాది పొగాకుకు మంచి ధర పలకడంతో ఈ ఏడాది అధిక ధరలకు భూముల కౌలు, బ్యారన్ల అద్దెకు తీసుకుని కౌలుదారులు పొగాకు పండించారు. బ్యారన్‌కు సుమారు రూ. 12 లక్షలు ఖర్చు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో ధర రూ.160 నుంచి రూ.275 పలకడంతో రైతులు అయోమయంలో పడ్డారు. ఈ ధరకు పొగాకు అమ్మకాలు జరిపితే, ఎకరాకు సుమారు రూ. 1.60 లక్షల నష్టం వస్తోందని అంటున్నారు.
ఆదుకోని ప్రభుత్వాలు
పొగాకు ధరలు ప్రపంచ వ్యాప్తంగా తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది విదేశాల్లో కిలో 8 నుంచి 9 డాలర్లు పలకగా, మన పొగాకుకు 4.5 డాలర్లు వచ్చింది. ఈ ఏడాది కిలో 3 డాలర్లు పలుకుతుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. పొగాకు పంట ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా సుమారు రూ.50 వేల నుంచి రూ.60 వేల కోట్లు పన్నుల రూపంలో వస్తోంది. ఇంత ఆదాయం సమకూరుతున్నా పొగాకును ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రపంచ దేశాల్లో ఎగుమతికి అవసరమయ్యే నాణ్యమైన పొగాకును అక్కడ రైతులు సాగు చేస్తున్నారు. ఇక్కడ పండిన పొగాకులో నికోటిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల సిగరెట్ల తయారీకి ఎక్కువ వినియోగిస్తారు. మనం పండించిన పొగాకులో 70 శాతం ఎగుమతులు కాగా, 30 శాతం దేశీయంగా వినియోగిస్తున్నారు.
కంటితుడుపు స్పందన
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పొగాకు రైతులకు భరోసా ఇచ్చేందుకు దేవరపల్లి వేలం కేంద్రాన్ని సందర్శిస్తారని తెలియడంతో అధికారులు, ట్రేడర్లలో కదలిక వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించాయి. కిలోకు రూ. 10 ధర పెంచడంతో పాటు, రైతులకు వడ్డీ లేని రుణం రూ. 50 వేలు ఇవ్వడానికి ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. ఈ రుణం రెండేళ్లలో రైతులు తీర్చాల్సి ఉంటుంది. ఇది కంటితుడుపు చర్యేనని రైతులు అంటున్నారు.
జగనన్న కోసం ఎదురుచూపులు
పొగాకు రైతుల సమస్యలను తెలుసుకుని, వారికి భరోసా కల్పించేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 5న దేవరపల్లి వేలం కేంద్రాన్ని సందర్శించనున్నారు. జగనన్న వస్తే పొగాకు ధరలు పెరుగుతాయని రైతులు గట్టి నమ్మకంతో ఉన్నారు. 2022 పంట కాలంలో పొగాకుకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి రూ. 500 కోట్లు కేటాయించి, మార్క్‌ఫెడ్ ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయించి రైతులను ఆదుకున్నారు. 2014–15 పంట సీజన్‌లో మార్కెట్ సంక్షోభంలో ఉండగా, ప్రతిపక్ష నేతగా దేవరపల్లి వేలం కేంద్రాన్ని సందర్శించి, ఉద్యమానికి పిలుపునివ్వడంతో స్పందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రోజులో కిలోకు రూ. 17 ధర పెంచాయి. ఇప్పుడు మళ్లీ జగనన్న రావడం వల్ల పొగాకు ధర పెరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు.
ఫ గిట్టుబాటు కాని పొగాకు ధర
ఫ మెరుగుపడని కొనుగోళ్లు
ఫ అయోమయంలో చిన్న రైతులు
దోపిడీకి గురవుతున్న రైతులు
పొగాకు రైతులు దళారుల దోపిడీకి గురవుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. రైతులను గాలికి వదిలేసి, మూడు నెలల తర్వాత రూ. 10 పెంచి రైతులను దగా చేస్తున్నారు. కొనుగోలు సంస్థలు సిండికేట్‌గా మారి రైతులను దోపిడీ చేస్తున్నాయి. సగటు ధర కిలో రూ. 350 ఉంటే గిట్టుబాటు అవుతుంది.
–జ్యేష్ఠ తారకరామారావు, పొగాకు రైతు, వెదుళ్లకుంట, గోపాలపురం మండలం
ప్రభుత్వాలు పట్టించుకోక..
పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆందోళనలో ఉన్నాం. కిలోకు రూ. 350 పెట్టుబడి పెట్టి పొగాకు పండిస్తే మార్కెట్లో రూ.160 లభిస్తోంది. దాదాపు కిలోకు 190 నష్టం వస్తోంది. ఈ ఏడాది 130 ఎకరాల్లో పొగాకు వేశాను. 1,200 క్వింటాళ్ల ఉత్పత్తి వచ్చింది. కిలో రూ. 160 నుంచి 170 చొప్పున 400 క్వింటాళ్లు అమ్మాను. ఇంకా 800 క్వింటాళ్లు పొగాకు అమ్మాల్సి ఉంది. ఈ ఏడాది పొగాకు రైతు దోపిడీకి గురవుతున్నాడు.
– సయ్యద్ బాజీ, పొగాకు రైతు, అచ్చియ్యపాలెం, బుట్టాయిగూడెం మండలం


