సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టిన రివర్ ఫ్రంట్ పనుల్లో నాణ్యత లోపం బయటపడింది. రాజమహేంద్రవరం ఉమామార్కండేయ స్వామివారి ఆలయం ఎదురుగా రివర్ ఫ్రంట్ పనుల కారణంగా అక్కడ రక్షణ గోడ పూర్తిగా ధ్వంసం అయ్యింది. పనుల నాణ్యతపై మరోసారి చర్చ జరుగుతోంది. దీనిపై గత ఏప్రిల్‌లోనే ‘సాక్షి’ దినపత్రికలో రాజమహేంద్రవరం రక్షణ గోదారిలోకే అనే శీర్షిన కథనం వచ్చింది. అయినా అధికారులు పట్టించుకోక ఇప్పుడు ఈ పరిస్థితి ఇచ్చింది. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా స్థానిక పద్మావతి ఘాట్ వద్ద రూ. 24 కోట్లతో రివర్ ఫ్రంట్ ఆధునీకరణ పనులు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఘాట్‌లను తొలగించారు. పక్కనే ఉన్న పార్కును సైతం కలుపుతూ ఒకే రివర్ ఫ్రంట్‌గా నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా ఘాట్‌ను పూర్తిగా తవ్వేశారు. అవసరమైన మేరకు కాకుండా పక్కనే ఉన్న రోడ్డు వైపు సైతం లోతుగా తవ్వేయడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అనుభవం లేని కాంట్రాక్టర్‌కు ఈ పనులు అప్పగించడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా పద్మావతి ఘాట్ వద్ద రూ.8 కోట్లతో అప్పర్ రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్నాయి.
ప్రవాహ ఒత్తిడి తట్టుకోగలదా..?
స్థానిక పుష్కర ఘాట్ నుంచి ప్రస్తుత రివర్ ఫ్రంట్ పనులు చేపడుతున్న ఘాట్ వరకూ వరద ప్రవాహం పోటెత్తుతుంది. గోదావరి నీరు మలుపు తిరిగే ప్రాంతం కావడంతో ఇక్కడ నీటి వడి అధికంగా ఉంటుంది. ఇప్పటి వరకూ గట్టుకు రక్షణగా నిలిచిన రివెట్‌మెంట్‌ను ఆధునీకరణ పేరుతో తవ్వేశారు. లోతుగా తవ్వేయడంతో అక్కడ నీరు చేరితే మట్టి జారిపోతుంది. ఫలితంగా గట్టు బలహీనపడే ప్రమాదం ఉంది. ఇప్పుడు అదే జరిగింది. ఇక్కడ చేస్తున్న పనులు శాశ్వతంగా ఉంటాయని టీడీపీ నాయకులు చెబుతున్నప్పటికీ, శాశ్వతం మాట దేవుడెరుగు ఆదిలోనే కూలిపోతున్నాయి.
నత్తనడకన పనులు
గోదావరి రివర్ ఫ్రంట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తొలుత రూపుదిద్దుకున్న డిజైన్‌ను మార్చడంతో కాంట్రాక్టర్‌కు మున్సిపల్ అధికారులు బిల్లుల మంజూరును నిలిపివేశారు. దీంతో పనులకు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చారు. డిజైన్ మార్చి తిరిగి పనులు ప్రారంభించినా, నత్తనడకన సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో నాణ్యత కొరవడుతుంది.
వరదల్లో ఘాటే రక్షణ
గోదావరి రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనుల వల్ల గోదావరి ఘాట్లు ధ్వంసమవుతున్నాయని పురోహిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గోదావరికి వరదలు వచ్చినప్పుడు రాజమహేంద్రవరం నగరానికి రక్షణగా ఈ గట్లు కీలకంగా నిలుస్తాయి. గతంలో 1953, 1986 సంవత్సరాల్లో ఇదే ప్రాంతంలో గోదావరి గట్టుకు గండ్లు పడి నగరాన్ని వరద ముంచెత్తింది. ప్రజలు నానా అవస్ధలు పడ్డారు. అప్పట్లో గట్టు పటిష్టతకు పైభాగంలో రక్షణ గోడ నిర్మించారు. ఈ గోడని సైతం ప్రస్తుతం రివర్ ఫ్రంట్ పనుల్లో తొలగించారు.
ఫ పుష్కర పనుల్లో డొల్లతనం
ఫ రివర్ ఫ్రంట్ పనులతో గట్లకు తూట్లు
ఫ వరదలతో పొంచి ఉన్న ముప్పు
ఇసుక మూటలతో సరి
గోదావరికి వరద ఉధృత పెరగడంతో రెండు రోజుల క్రితం ఘాట్ లోపలి భాగం నుంచి మట్టి జారిపోవడంతో ఇసుక బస్తాలను రక్షణగా పెట్టారు. ప్రారంభ దశలోనే నాణ్యత లోపం బయటపడితే వచ్చే పుష్కరాలకు కోట్లలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఇటువంటి సంఘటన జరిగితే భక్తుల ప్రాణాలకు రక్షణ ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. రివర్ ఫ్రంట్ పనులతో రాజమహేంద్రవరాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులు తెచ్చారని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంీపీ మార్గాని భరత్‌రామ్ దుయ్యబట్టారు. పార్టీ నాయకులతో కలసి పద్మావతి ఘాట్ వద్ద జరుగుతున్న రివర్ ఫ్రంట్ పనులను ఆయన పరిశీలించి, అనంతరం విలేకర్లతో మాట్లాడారు.


