దేవరపల్లి: కష్టాల్లో ఉన్న పొగాకు రైతులకు బాసటగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం దేవరపల్లి వస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. స్థానికంగా వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లను సోమవారం ఆయనతో పాటు ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ హోం మంత్రి తానేటి వనిత, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, విశాఖ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు (జీవీ), ఎంపీపీ కేవీకే దుర్గారావు పరిశీలించారు. హెలీప్యాడ్ పనులు, పొగాకు వేలం కేంద్రాన్ని నేతలు పరిశీలించారు. పర్యటన ఏర్పాట్లపై నియోజకవర్గ నాయకులతో చర్చించారు. వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ జగన్ పర్యటన నేపథ్యంలో పొగాకు రైతులకు భరోసా వచ్చిందన్నారు. ప్రత్యేకించి టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియాలో కిలోకు రూ.10 అదనంగా, రైతులకు రూ.50 వేల వడ్డీలేని రుణం ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు వచ్చిందన్నారు. ప్రభుత్వం బాధ్యతతో పనిచేయాలని, ప్రజలకు జవాబుదారీగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు కష్టాల ఊబిలో చిక్కుకుపోతున్నారన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో రైతులకు సువర్ణాధ్యాయం నడిచిందన్నారు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు, గిట్టుబాటు ధర కల్పించాలని జగన్ వస్తున్నారని అన్నారు. బుధవారం దేవరపల్లి వేలం కేంద్రాన్ని ఆయన సందర్శిస్తారని తెలిపారు. జగన్ పర్యటనను విజయవంతం చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గోపాలపురం, కొవ్వూరు, పోలవరం నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, పొగాకు రైతులు పాల్గొన్నారు.
ఫ రేపటి దేవరపల్లి పర్యటనను
విజయవంతం చేద్దాం
ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
వేణుగోపాలకృష్ణ


