చాగల్లు: యువత భవిష్యత్తుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. సోమవారం చాగల్లు శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో దగా డీఎస్సీపై నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి తలారి వెంకట్రావు, నియోజకవర్గ పరిశీలకుడు జి.శ్రీనివాసరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ చేపట్టాలని, మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ. 9,500 కోట్లతో పాటు విద్యాదీవెన, వసతిదీవెన నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాచరణలో భాగంగా ఈ నెల 6, 7, 8 తేదీల్లో కొవ్వూరులో డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామని తెలిపారు. 10న కొవ్వూరులో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. దీనికి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కంఠమని రమేష్‌బాబు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలు, బాధిత అభ్యర్థులు వెల్లడించిన అంశాలపై సీబీఐతో సమగ్ర విచారణ చేయించాలన్నారు. స్పోర్ట్స్ కోటా పేరుతో ప్రతిభ లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. నియోజకవర్గ పరిశీలకుడు డి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులను ప్రభుత్వం దగా చేసిందన్నారు. సమావేశంలో రాజానగరం నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫ మెగా డీఎస్సీపై విచారణ చేయాలి
ఫ మాజీ ఎమ్మెల్యే
తలారి వెంకట్రావు డిమాండ్


