కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్‌కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పిలుపునిచ్చింది. సోమవారం స్థానిక ఆర్జేడీ కార్యాలయం వద్ద ఆ విభాగ్ కన్వీనర్ సత్యసాయి ఆధ్వర్యంలో బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా విద్యా రంగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. సుమారు రూ.6,800 కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, జీఓ నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలన్నారు. జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ ఉన్నత విద్యా కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చామన్నారు.
సమస్యల
పరిష్కారానికి ప్రాధాన్యం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ కీర్తి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ జరిగింది. మొత్తం 219 అర్జీలను ఆమె స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ బస్సులను
ఆర్టీసీ సిబ్బందితో నడపాలి
రాజమహేంద్రవరం సిటీ: విద్యుత్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జిల్లా జేఏసీ నాయకులు జిల్లా కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతి పత్రాలను ముఖ్యమంత్రికి సమర్పించాలనే లక్ష్యంతో కలెక్టర్‌కు అందజేసినట్లు జిల్లా జేఏసీ కన్వీనర్లు సీతానగరం రాజు, ఆకుల శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కో కన్వీనర్ కేఎస్‌పీ రావు, జోనల్ కన్వీనర్ గిడ్ల చిరంజీవి మాట్లాడూతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా నడపాలనే విధానాన్ని పూర్తిగా విరమించుకోవాలన్నారు. ఆర్టీసీ ద్వారానే విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి, ఆర్టీసీ ఉద్యోగులతోనే నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీ్త్ర శక్తి పథకంతో పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా వెంటనే సుమారు 4 వేల పైబడి కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ నెల 30న విజయవాడలో జరిగే ఆర్టీసి ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రభుత్వ స్పందనను సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు.
పోలవరాన్ని చంద్రబాబు
ఏటీఎంలా వాడుకుంటున్నారు
మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శ
రాజమహేంద్రవరం సిటీ: పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో సోమవారం విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్నది ఆంధ్రప్రదేశ్ డిమాండ్ అన్నారు. దీని ప్రకారం ఈ ప్రాజెక్టును కేంద్రం నిర్మించాల్సి ఉండగా.. తామే నిర్మిస్తామంటూ చంద్రబాబు తీసుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని, దీంతో, ఆయన పోలవరం పూర్తి చేయాలనుకుంటున్నారా, ఏటీఎంలా వాడుకుంటున్నారా అనే అనుమానం వస్తోందని అన్నారు. పుష్కరాల్లోగా పోలవరం ప్రారంభమవుతుందని చంద్రబాబు చెబుతున్నారని, కానీ, ఈ ప్రాజెక్టు డ్యామ్‌లో నీళ్లు నిలబడాలంటే పూర్తి స్థాయి భూసేకరణ ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. ఒడిశాలో 8, ఛత్తీస్‌గఢ్‌లో 4 కలిపి మొత్తం 12 గ్రామాల్లో భూములు సేకరిస్తేనే డ్యామ్‌లో నీళ్లు నిలుస్తాయని ఆయన చెప్పారు. ఇది జరగాలంటే ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో చంద్రబాబు చర్చలు జరపాలన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే భూసేకరణ చేయాలన్నారు. పోలవరం డ్యామ్ నిర్మాణంలో నాణ్యత లేనందువల్లనే కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన చాలామంది నిర్వాసితులకు, రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. రైతులకు భూమికి భూమి ఇస్తామన్నారని, అది ఇప్పటి వరకూ జరగలేదని చెప్పారు. ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంటేనే విశాఖపట్నం వరకూ నీళ్లు వెళ్లడంతో పాటు, 25 లక్షల ఎకరాల భూమి సాగవుతుందని తెలిపారు. ఏమీ చేయకుండా డ్యామ్ కడితే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని హర్షకుమార్ స్పష్టం చేశారు.


