● మూడు నెలలుగా అందని జీతాలు
● తామెలా బతకాలంటూ ఉద్యోగుల ఆవేదన
● ఇప్పటికే మూడు పీఆర్సీలు పెండింగ్
● నమ్మించి నట్టేట ముంచిన మంత్రి అచ్చెన్న
రామచంద్రపురం రూరల్: రాష్ట్రంలో సహకార సంఘాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నవారు తమకు ప్రభుత్వ సహకారం అందట్లేదని గగ్గోలు పెడుతున్నారు. రెండు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 2052 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రమారమి 6,800 మంది రెగ్యులర్ సిబ్బంది, 3,800 మంది కాంట్రాక్ట్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఇప్పటికీ మూడు పీఆర్‌సీలు పెండింగ్‌లో ఉన్నాయి. 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో అనేక ధర్నాలు, సమ్మెలు, ప్రజాప్రతినిధులకు, రాష్ట్ర స్థాయి అధికారులకు మొర పెట్టుకోగా హెచ్‌ఆర్ పాలసీల అమలు కోసం ప్రభుత్వం జీఓ నెం.36 విడుదల చేసిందని, అయితే ఆ జీఓ ఇప్పటికీ అమలు కాక ఉద్యోగుల ప్రయోజనాలు నెరవేరని పరిస్థితులు నెలకొన్నాయని యూనియన్ నాయకులు మండిపడుతున్నారు. జీఓ విడుదలతో తమ జీవితాలు మారిపోతాయని ఆశతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాత్రనక, పగలనక కష్టపడి పనిచేస్తూ ఉంటే ఇప్పటికీ జీఓ అమలు చేయకుండా తెలుగుదేశం ప్రభుత్వం తమను మోసగిస్తూనే ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కంప్యూటర్ పరిజ్ఞానం లేకున్నా, కనీసం ఏ విధమైన ట్రైనింగ్ కూడా ఇవ్వకుండా తమపై ఒత్తిడి చేసి సంఘాల కంప్యూటరీకరణ పనులు చేయిస్తే మానసిక ఒత్తిడి అనుభవిస్తూ అనారోగ్యం పాలైనా కూడా పూర్తి స్థాయిలో పనిచేసి కంప్యూటరీకరణ పనులు పూర్తి చేయడం జరిగిందని యూనియన్ నాయకులు అంటున్నారు. ఇన్నాళ్లూ ఉపయోగించుకుని మహాజన సభకు ఉన్న విశేష అధికారాలతో నియమించుకున్న సిబ్బందితోనే తాత్కాలిక ఉద్యోగులుగా కొత్తగా తీర్మానాలు ఇవ్వమని అడగటం దుర్మార్గమైన చర్యగా చెబుతున్నారు. ముందుగా రెండు నెలల జీతాలు వెంటనే ఇవ్వకపోతే మూకుమ్మడిగా ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిస్తున్నారు.
మొండి చేయి చూపించారు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులను టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు ఆశలు చూపించి పనులు చేయించుకోవడం ఆ తర్వాత మొండి చేయి చూపడం పరిపాటిగా మారింది. కంప్యూటరీకరణ, ఆడిట్ పూర్తయితే మంచి రోజులు వస్తాయని ఆశ చూపి పని పూర్తయిన తరువాత మొంటి చేయి చూపించారు.
– తోట వెంకటరామయ్య, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
జీతాలైనా సమయానికి ఇవ్వరా!
ఇప్పటికే మూడు పీఆర్‌సీలు బకాయి ఉన్నాయి. హెచ్‌ఆర్ పాలసీ అమలు కోసం జీఓ నెం.36 విడుదల చేశారు. అమలుకు నోచుకోలేదు. 2019 తరువాత ఉద్యోగాల్లో చేరిన వారిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుస్తూ తీర్మానాలు చేయాలని ఆదేశాలిస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారు.
– పెంకే సత్యనారాయణ,
యూనియన్ రాష్ట్ర కోశాధికారి
మంత్రి హామీ కూడా నీటి బుడగేనా?
సహకార సంఘ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల కోసం చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో ఉండగా రాష్ట్ర సహకార శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మార్చి 23న స్వయంగా జేఏసీ ఆధ్వర్యంలో మీ న్యాయమైన డిమాండ్లను రెండు రోజుల్లో జీఓ ఇచ్చి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏరు దాటాక తెప్ప తగలేశారు.
– యర్రంశెట్టి రామచంద్రరావు,
యూనియన్ జిల్లా అధ్యక్షుడు


