కాకినాడ క్రైం: హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులలో అప్రమత్తంగా వ్యవహరించి మాతృ మరణాల నివారణకు కృషి చేయాలని రాష్ట్ర డీఎంఈ డాక్టర్ అత్తలూరి విష్ణువర్థన్ ప్రసూతి వైద్య నిపుణులకు సూచించారు. కాకినాడ గైనకాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ డాక్టర్ ఏఎల్ సత్యవతి అధ్యక్షతన స్థానిక రామారావు పేటలోని ఫంక్షన్ హాల్లో ఆదివారం సీఎంఈ వర్క్‌షాప్ నిర్వహించారు. డాక్టర్ విష్ణువర్థన్‌తో పాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్యకుమారి, డీఎంహెచ్‌వో అనిత అతిథులుగా హాజరు కాగా, విష్ణువర్ధన్, సత్యవతి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లావణ్యకుమారి, అనిత మాట్లాడుతూ, హై రిస్క్ కేసుల్లో ప్రసూతి సమయం అత్యంత కీలకమైనదని, ఇలాంటి స్థితిలోనే మాతా శిశు మరణాలు సంభవిస్తాయని అన్నారు. డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ, ప్రఖ్యాత ఫెర్నాండెజ్ ఆసుపత్రి యాజమాన్యంలో నిష్ణాతులైన ప్రసూతి వైద్య నిపుణులు తారకేశ్వరి, కామేశ్వరి, మాలినీ సీఎంఈకి గెస్ట్ ఫ్యాకల్టీగా వ్యవహరించడం హర్షణీయం అన్నారు. అనంతరం ఫ్రెండ్‌షిప్‌డే వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో గైనకాలజీ సొసైటీ కార్యదర్శి డాక్టర్ మాధవి సహా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి గైనకాలజిస్టులు హాజరయ్యారు.
రామకృష్ణారెడ్డి సేవలు అభినందనీయం
అమలాపురం టౌన్: అమలాపురం పంచాయతీరాజ్ ఈఈగా పులి రామకృష్ణారెడ్డి అందించిన సేవలు అభినందనీయమని జిల్లా పీఆర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు కొనియాడారు. అమలాపురం ఈఈగా పనిచేస్తూ పదోన్నతిపై కాకినాడ జిల్లా ఎస్‌ఈగా వెళ్తున్న రామకృష్ణారెడ్డికి స్థానిక పీఆర్ అతిథిగృహంలో ఆదివారం వీడ్కోలు చెప్పారు. అమలాపురం పీఆర్ ఈఈ సీతంనాయుడు అధ్యక్షతన జరిగిన సభకు డీఆర్వో సుబ్బారావు, డీఎంహెచ్‌వో డాక్టర్ దుర్గారావు దొర, ఆర్డీవో సరళావతి, డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం జిల్లా పీఆర్ కార్యాలయ ప్రాంగణంలోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం రామకృష్ణారెడ్డి దంపతులను అమలాపురం పీఆర్ ఈఈ సీతంనాయుడు, డీఈఈలు అన్యం రాంబాబు, పి.రాజ్‌కుమార్‌లతో పాటు జిల్లాలోని ఏఈలు, ఉద్యోగులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో కాకినాడ పీఆర్ ఈఈ రఘురామరెడ్డి పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ప్రత్తిపాడు: స్థానిక జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానిక పోలీసుల కథనం మేరకు కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామానికి చెందిన మళ్ల కృష్ణబాబు (36) శనివారం రాత్రి వ్యవసాయ పనులు చేయించేందుకు కూలీల కోసం బైక్‌పై ఏలేశ్వరం మండలం సిరిపురం వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి స్వగ్రామానికి వస్తుండగా పోలవరం వంతెన వద్దకు వచ్చేసరికి బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని జరిగిన ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృత దేహానికి ఆదివారం స్థానిక సీహెచ్‌సీలో శవ పరీక్ష చేసి బంధువులకు అప్పగించారు. కృష్ణబాబు తండ్రి మళ్ల శివబాబు ఫిర్యాదు మేరకు ఎస్‌హెచ్‌ఓ ఎం.గోవిందుబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వాహనం ఢీకొని..
పిఠాపురం రూరల్: స్థానిక బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కరివేపాకుపేటకు చెందిన ఇండుగపల్లి నూకరాజు (72) శనివారం ఉదయం సుమారు 5.30 నుంచి 6 గంటల మధ్య కాలినడకన కాకినాడ వైపు జగ్గయ్య చెరువు ప్రాంతంలోని తన కుమారుడి ఇంటికి వెళ్తున్నాడు. నాగార్జున రెసిడెన్సీ సమీపంలో గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నూకరాజు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


