● భక్తులతో కిక్కిరిసిన తలుపులమ్మ ఆలయం
● అమ్మను దర్శించిన 65 వేల మంది భక్తులు
● కై లాస గణపతికి ఘనంగా లక్ష గరిక పూజ
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ తల్లి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారిని పండితులు శాకంబరిగా అలంకరించారు. అలాగే అర్చకులు కై లాస గణపతికి లక్ష గరిక పూజ చేశారు. క్యూలైన్ల ద్వారా 65 వేల మంది అమ్మవారిని దర్శించినట్టు డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు జగన్నాథగిరి జంక్షన్ మీదగా, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, ఇతర జిల్లాల భక్తులు చేపూరు మీదగా ఆలయానికి చేరుకోవడంతో రహదారులు రద్దీగా మారాయి. ఇక్కడి వసతి గదులు నిండుకోవడంతో భక్తులు వంటలు, భోజనాలకు చెట్ల కింద, ఉచిత షెడ్లు, కొండ దిగువన ప్రైవేట్ కాటేజీలు, మామిడి తోటలను ఆశ్రయించారు.
రూ.17.4 లక్షల ఆదాయం
అమ్మవారి లడ్డూ, పులిహోర ప్రసాదాల కొనుగోళ్లతో రూ.4,79,760, పూజా టికెట్లకు రూ.9,77,900, కేశఖండనశాలకు రూ.35,120, వాహన పూజలు, ఇతర సేవా టికెట్లకు రూ.24,260, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.1,10,730, విరాళాలు రూ.84,382, వేదాశీర్వచనం రూ.28,458, వెరసి మొత్తం రూ.17,40,610 ఆదాయం సమకూరినట్టు ఈఓ తెలిపారు. ఆలయ చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు.


