అడ్మిషన్లపై ఇంకా అయోమయమే! | - | Sakshi
Sakshi News home page

అడ్మిషన్లపై ఇంకా అయోమయమే!

Aug 3 2026 12:19 AM | Updated on Aug 3 2026 12:19 AM

డిగ్రీలో ప్రవేశాలకు విద్యార్థుల ఎదురుచూపు

నోటిఫికేషన్‌ విడుదల కాక అవస్థలు

ప్రత్యామ్నాయాల వైపు పయనం

డిగ్రీ కళాశాలల్లో మిగిలిపోతున్న సీట్లు

రాయవరం: ఇంటర్మీడియెట్‌ ఫలితాలు విడుదలై మూడున్నర నెలలు అవుతున్నాయి. నేటికీ డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. జూలై లోనే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. ఈ ఆలస్యం వల్ల వేలాది విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. కోనసీమ జిల్లా పరిధిలోని 171 డిగ్రీ కళాశాలలు రాజానగరంలోని ఆదికవి నన్నయ వర్సిటీ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటుగా ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ విద్యా సంస్థలు డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో 32 వేల మంది అడ్మిషన్లు పొందారు. జిల్లాలో ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుండగా, సుమారు వంద వరకూ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలలు బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీబీఏ వంటి కోర్సులను వివిధ కాంబినేషన్లతో అందిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్నత విద్యను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా చేపట్టడంతో చాలా కళాశాలల్లో కొన్ని సీట్లు మిగిలిపోతున్నట్లు సమాచారం. డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక విద్యార్థులు కళాశాలల చుట్టూ తిరుగుతున్నారు. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరికకు ఇప్పటికే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ కూడా ప్రకటించారు. అయినా డిగ్రీ ప్రవేశాలకు మాత్రం నోటిఫికేషన్‌ విడుదల చేయక పోవడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డిగ్రీ కళాశాలల వివరాలు ఇవీ..

జిల్లా ప్రభుత్వ ప్రైవేటు అటానమస్‌

కోనసీమ 07 45 01

తూర్పు 06 40 01

కాకినాడ 05 46 03

తక్షణమే నోటిఫికేషన్‌ విడుదల చేయాలి

ఇంటర్‌ ఫలితాలు విడుదలై మూడున్నర నెలలు గడుస్తున్నా నేటికీ ప్రవేశాలు చేపట్టకపోవటం దారుణం. జూలై మొదటి వారంలో అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ప్రారంభించాలి. ఈ ప్రక్రియలో జాప్యం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం తక్షణం నోటిఫికేషన్‌ జారీ చేయాలి.

– ఎస్‌.కిరణ్‌కుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్‌యూ, రాజమహేంద్రవరం

నేడో, రేపో విడుదలయ్యే అవకాశం

డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నాం. నేడో, రేపో విడుదలయ్యే అవకాశం ఉంది. అడ్మిషన్ల కోసం విద్యార్థులు కళాశాలలకు వస్తున్నారు. డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్‌ రాగానే ప్రక్రియ ప్రారంభిస్తాం.

– డాక్టర్‌ కె.పెద్దిరాజు, ప్రిన్సిపాల్‌, వీకేవీ ప్రభుత్వ డిగ్రీ ఐడీ కళాశాల, కొత్తపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement