● ఎమ్మెల్సీ గోపి మూర్తి
● యూటీఎఫ్ జిల్లా కార్యాలయం ప్రారంభం
రాజమహేంద్రవరం రూరల్: ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన విధానాలతో ప్రభుత్వ విద్యా రంగాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని ఎమ్మెల్సీ గోపిమూర్తి అన్నారు. యూటీఎఫ్ జిల్లా నూతన కార్యాలయం అప్పారి వెంకటస్వామి యూటీఎఫ్ భవన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈవీవీఎస్‌ఆర్ ప్రసాద్, ఎంఏ షరీఫ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన యూటీఎఫ్ సభ్యులందరికీ ఉద్యమాభినందనలు తెలిపారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఎదుర్కొనేందుకు ఉపాధ్యాయులు ఉద్యమ సైనికులుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ సమాజాన్ని మేలు కొలపడంతో ఉపాధ్యాయులది కీలక బాధ్యతన్నారు.
ఐఆర్, పీఆర్సీలపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తప్పదని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. విద్యార్థుల పెరుగుదలకు కృషి చేసిన ఉపాధ్యాయులను సెప్టెంబర్ ఐదున విజయవాడలో సత్కరించనున్నట్టు తెలిపారు. సీపీఎస్ రద్దుపై సాధించిన విజయానికి ఈ నెల 16న విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. మాజీ ఎంపీ మిడియం బాబురావు మాట్లాడుతూ 1983 నుంచి తనకు యూటీఎఫ్‌తో అనుబంధం ఉందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలు మందగించిన సమయంలో విద్యార్థి ఉద్యమాలే కొత్త ఊపు తీసుకువచ్చాయని అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా కార్యాలయం ప్రభుత్వ విద్య, ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వ విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలను యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. యూటీఎఫ్ వ్యవస్థాపక నాయకుడు స్వర్గీయ అప్పారి వెంకటస్వామి కుమారుడు హైకోర్టు ప్రముఖ న్యాయవాది అప్పారి సత్య ప్రకాష్, ఎస్‌టీఎఫ్‌ఐ జాతీయ మాజీ కార్యదర్శి అరుణ కుమారి రాష్ట్ర, జిల్లా నాయకులు, మాజీ ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఈఓ వాసుదేవరావు, యూటీఎఫ్ జిల్లా కమిటీ ప్రతినిధి పి.జయకర్, రూపస్ రావు తదితరులు పాల్గొన్నారు.


