మరిడమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

మరిడమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

Aug 3 2026 12:19 AM | Updated on Aug 3 2026 12:19 AM

సామర్లకోట: పెద్దాపురంలోని మరిడమ్మ దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. గత నెల 14 నుంచి ప్రారంభమైన జాతర ఉత్సవాలకు వస్తున్న ఉమ్మడి రాష్ట్రాల భక్తులు, వారి వాహనాలతో స్థానిక రహదారులు కిటకిటలాడాయి. సుమారు 80 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు. సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జగ్గంపేట, రాజమహేంద్రవరం నుంచి సామర్లకోట వచ్చే వాహనాలను పాండవుల మెట్ట వద్ద నుంచి ఏడీబీ రోడ్డు మీదుగా మళ్లించారు. ఆదివారం తెల్లవారు జాము నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయం వద్దకు చేరుకోవడంతో దేవదాయశాఖ ఈఓ కె.విజయలక్ష్మి, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చింతపల్లి శ్రీహర్ష, ట్రస్టు బోర్డు సభ్యులు, పోలీసులు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. తెల్లవారు జామున ఆలయ నిర్మాణకర్తలైన చింతపల్లి వారి గోత్రనామాలతో ఆలయంలో పూజలు నిర్వహించి, అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతించారు. భక్తుల క్యూ రహదారి మీదకు రావడంతో ఆలయ అధికారులు టెంట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు వివిధ సేవా సంస్థల సభ్యులు తాగు నీరు, పిల్లలకు పాలు, మజ్జిగ, ద్రాక్ష జ్యూస్‌, పండ్లు పంపిణీ చేశారు. వీఐపీల తాకిడితో సిబ్బంది అవస్థ పడ్డారు. డీఎస్పీ ఏబీజీ తిలక్‌ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద సామర్లకోట లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు, విష్ణు భక్తమండలి సభ్యులు ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు.

పెద్దాపురంలో కొనసాగుతున్న జాతర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement