బాదుడుపై పోరుబాట
● పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై
వైఎస్సార్ సీపీ శ్రేణుల నిరసన
● అన్ని నియోజకవర్గాల్లో
కదం తొక్కిన పార్టీ శ్రేణులు
● ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ
వినూత్న నిరసనలు
● ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా
పెద్ద ఎత్తున నినాదాలు
● ర్యాలీగా వెళ్లి అధికారులకు
వినతిపత్రాల అందజేత
● పాల్గొన్న మాజీ మంత్రులు,
మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు
సాక్షి, రాజమహేంద్రవరం: పెట్రోల్, డీజిల్ ధరల బాదుడుపై వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. ఇంధన ధరల పెంపుపై శాంతియుత నిరసన చేపట్టింది. పెంచిన ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున నినదించింది. ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిపై ధ్వజమెత్తింది. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు సోమవారం జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టారు. ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ వినూత్న నిరసనలు చేపట్టారు. కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల వద్దకు ర్యాలీగా వెళ్లి డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను అధికారులకు అందజేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం రూరల్
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కీర్తి చేకూరికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు.
రాజమహేంద్రవరం సిటీ
వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు, ప్రజలు రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ప్రదర్శన చేపట్టారు. నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ఆటోను తాళ్లతో తాగి నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో అధికారికి వినతి పత్రం సమర్పించారు. రుడా, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.
కొవ్వూరు
మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కోఆర్డినేటర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో కొవ్వూరులో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. ఆటోలను కొవ్వూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు లాగారు. అక్కడ బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గోపాలపురం
మాజీ మంత్రి, గోపాలపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ తానేటి వనిత ఆధ్వర్వాన గోపాలపురంలో వైఎస్సార్ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వైఎస్సార్ జంక్షన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ సాయిప్రసాద్‌కు అందజేశారు.
నిడదవోలు
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు ఆధ్వర్యంలో నిడదవోలులో నిరసన చేపట్టారు. విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ నాగరాజు నాయక్‌కు వినతి పత్రం సమర్పించారు.
అనపర్తి
ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ అనపర్తిలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి నిరసన చేపట్టారు. వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆటోలకు తాళ్లు కట్టి లాగి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ అనిల్‌కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు.
మండపేట
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మండపేట పట్టణంలో సోమవారం ధరల పెంపును నిరసిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. మండపేట అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ సీపీ పరిశీలకులు వంటెద్దు వెంకన్ననాయుడు సమక్షంలో విజయలక్ష్మినగర్‌లోని పార్టీ కార్యాలయం నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజారత్న సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
రాజానగరం
పార్టీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో సోమవారం నిర్వహించిన ధర్నా శాంతియుతంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌లో రహదారిపై మానవహారంగా ఏర్పడిన ఆందోళనకారులు ఇంధన ధరల పెంపు మూలంగా ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను వివరిస్తూ, ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు వి.పెదవెంకన్న, నాయకులు మేడా గురుదత్త ప్రసాద్, దూలం పెద్ద, గండి నానిబాబు, అడబాల చినబాబు, జి.సోమేశ్వరరావు పాల్గొన్నారు.
ఏపీలోనే ఎక్కువ
మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులునాయుడు
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పేద, మధ్య, తరగతి వర్గాల ప్రజలపై భారం పడింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ధరలు అమలు చేస్తున్నారు.
వ్యాట్ పెంచడం వల్లే
ధరలకు రెక్కలు
మాజీ మంత్రి తానేటి వనిత
ఇతర రాష్ట్రాల్లో లేని ధర ఇక్కడ ఉండటం విడ్డూరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచడంతో ఇంధన ధరలు పెరిగాయి.
ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి
అధికారంలోకి వస్తే ధరలు పెంచబోమని ప్రజలను నమ్మించిన కూటమి నేతలు అధికారం చేపట్టాక సామాన్యుల నడ్డి విరిచేలా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు. ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి ఇది నిదర్శనం.


