ఆ 14 గంటలూ ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

ఆ 14 గంటలూ ఉత్కంఠ

May 19 2026 12:34 AM | Updated on May 19 2026 12:34 AM

మృతుని కుటుంబానికి అండగా

నిలిచిన జక్కంపూడి రాజా

అంతిమ యాత్రలో వైఎస్సార్‌ సీపీ

నాయకులు

కోరుకొండ/రాజానగరం: మట్టి అక్రమ రవాణాకు కేరాఫ్‌గా ఉన్న కోరుకొండ మండలంలో జరిగిన దుర్ఘటన ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 14 గంటల పాటు తీవ్ర ఉద్రికత్త దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా సాగించిన అలుపెరుగని పోరాటంతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. ఆదివారం అర్థరాత్రి సమయంలో నర్సాపురానికి చెందిన నొక్కి రాజీవ్‌వర్మ (27), సాలాపు విక్కీతో కలిసి బైకుపై కోరుకొండ వెళ్తుండగా జంబూపట్నం వద్ద మట్టి రవాణాకు సంబంధించిన టిప్పర్‌ ఢీ కొంది. రాజీవ్‌వర్మ అక్కడికక్కడే మృతిచెందగా వెనుక కూర్చున్న విక్కీకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని రాజమహేంద్రవరంలో ఆస్పత్రికి తరలించారు.

ఆందోళనకు దిగిన దళితులు

ఈ ప్రమాదంలో మృతిచెందిన రాజీవ్‌వర్మకు మూడు సంవత్సరాల క్రితమే వివాహమైంది. భార్యతోపాటు ఏడాది చిన్నారి ఉన్నారు. ఈ ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ అతని కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో కోరుకొండలో ప్రధాన రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఆందోళనను పోలీసులు లాఠీచార్జీలతో చెదరకొట్టే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో బలవంతంగా పోలీసు స్టేషనుకు తరలించారు. విషయం తెలుసుకున్న జక్కంపూడి రాజా అక్కడకు చేరుకుని ఆందోళనకారులకు అండగా నిలిచారు. సోమవారం మధ్యాహ్నం వరకు మృతదేహం వద్దనే ఆందోళనకారులతో కలిసి పోరాటం కొనసాగించారు. 516 జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

భారీగా మోహరించిన పోలీసులు

ఎస్సైలు, సీఐ, డీఎస్పీలతోపాటు, పోలీసులు, సీఆర్‌ఫీఎస్‌ బలగాలు భారీగా మోహరించాయి. లాఠీ చార్జీ చేయడంతో కొంతమందికి గాయాలయ్యాయి. ఆందోళనకారులను కొవ్వూరు, నల్లజర్ల పోలీసుస్టేషన్‌లకు తరలించారు. జక్కంపూడి రాజా ఆందోళనను విరమింపజేసే ప్రయత్నం పోలీసులు చేసినా ఫలితం లేకపోయింది. రాజీవ్‌వర్మ కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ ఆందోళనకారులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

అంతిమయాత్రలో వైఎస్సార్‌ సీపీ నేతలు

రాజీవ్‌వర్మ అంతిమ యాత్రలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతోపాటు, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ హోంమంత్రి తానేటి వనిత, పార్టీ కో–ఆర్డినేటర్లు సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, జి. శ్రీనివాసనాయుడు, పార్టీనేతలు గూడూరి శ్రీనివాసరావు, మేడా గురు దత్తప్రసాద్‌ పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టమ్‌ అనంతరం కోరుకొండ నుంచి నర్సాపురం వరకూ అంతిమ యాత్ర జరిగింది. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ కోరుకొండ మండలంలో 14 గ్రామాల్లోని చెరువుల నుంచి మట్టిమాఫియా తవ్వకాలను నిర్వహిస్తోందన్నారు. ఈ అవినీతిలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎంపీ దగ్గుపాటి పురందరేఽశ్వరికి వాటాలున్నాయన్నారు.

దిగొచ్చిన మట్టి రవాణాదారు

జక్కంపూడి రాజా, పోలీసులు సమక్షంలో జరిపిన చర్చలతో మృతుని కుటుంబానికి రూ.15 లక్షలు నష్టపరిహారంగా ఇచ్చేందుకు మట్టి రవాణాదారు అంగీకారం తెలిపారు. గాయపడిన వ్యక్తికి రూ.3 లక్షలు ఇస్తామన్నారు. దీంతో ఆందోళనను విరమించారు.

మానవత్వాన్ని చాటిన జక్కంపూడి

న్యాయం జరిగే వరకు మృతుని కుటుంబానికి అండగా నిలవడంతోపాటు తన వంతుగా రూ. 4 లక్షలు ఆర్థిక సహాయాన్ని జక్కంపూడి రాజా ప్రకటించి, మానవత్వాన్ని చాటుకున్నారు. ఇదే సమయంలో కోరుకొండ సీఐ ఎస్‌వీఎస్‌ మూర్తి కూడా మరో రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement