డాక్టర్ కర్రి రామారెడ్డి
ప్రకాశంనగర్ (రాజమహేంద్రవరం): ప్రముఖ మానసిక వైద్యుడు కర్రి రామారెడ్డి జీవితంలో మరో అధ్యాయం లిఖితమైంది. నిరంతర అభ్యాసకుడిగా ఆయన ఇప్పటికే డాక్టరేట్లు, పీజీలు, డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్ కోర్సులు కలిపి 73 పూర్తి చేశారు. తాజాగా పూర్తయిన జనవరి–జూన్ 2026 సెమిస్టర్‌తో మరో 16 కోర్సులు పూర్తి చేయడంతో మొత్తం 89కి చేరుకుంది. ఈ మేరకు రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జీఎస్‌ఎల్ వైద్య సంస్థల అధినేత డాక్టర్ గన్ని భాస్కరరావు, ఐఎంఏ నగర కార్యదర్శి డాక్టర్ దాట్ల సతీష్‌రాజు, ఓలేటి సత్యనారాయణ, పీవీఎస్ కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ చదువు తన జీవితంలో భాగంగా మారిపోయిందన్నారు. వచ్చే సెమిస్టర్‌లో మరో 16 కోర్సులు పూర్తి చేస్తానని, తద్వారా తన కోర్సుల సంఖ్య సెంచరీ దాటుతుందని వెల్లడించారు. ఈ కోర్సులు తన కష్టార్జితం, ఇష్టార్జితం అని ఆయన చెప్పారు. ఇప్పుడు 16 కోర్సులు పూర్తి చేయగా, 12 కోర్సుల్లో తాను టాపర్‌గా నిలిచానని ఆనందం వ్యక్తం చేశారు. మానసిక వైద్యుడిగా 1,47,250 మంది రోగులకు వైద్యం చేశానని చెప్పారు. డాక్టర్ గన్ని భాస్కరరావు మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఉంటూ విభిన్న కోర్సులు పూర్తి చేయడం డాక్టర్ రామారెడ్డికే చెల్లిందన్నారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మాట్లాడుతూ డాక్టర్ రామారెడ్డి ఈ నగరానికి మణిహారం లాంటివారని కొనియాడారు. డాక్టర్ సతీష్ రాజు మాట్లాడుతూ డాక్టర్ రామారెడ్డి వైద్యులందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు.


