ఫ ప్రతీకారంతోనే హత్య
ఫ నిందితుల్లో ఒకరు బాలుడు
చింతూరు: ఇటీవల లక్కవరంలో మూట రమేష్ (37) హత్య కేసు మిస్టరీ వీడింది. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో సోమవారం సీఐ గోపాలకృష్ణ వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. గతేడాది లక్కవరంలో మూట రామయ్య (60) మంత్రాలు చేస్తున్నాడని హత్య చేశారు. ఈ కేసులో నిందితుడైన మూట రమేష్‌తో పాటు మరో ముగ్గురు ఇటీవల బెయిల్‌పై గ్రామానికి వచ్చారు. కాగా 14న రాత్రి గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు రమేష్ వెళ్లాడు. ఆ రోజు రాత్రి అంగన్‌వాడీ భవనం వెనుక రమేష్ గొంతు కోసి దారుణంగా హతమార్చారు. దీనిపై సీఐ గోపాలకృష్ణ, మోతుగూడెం ఎస్‌ఐ నాసిర్ హుస్సేన్ ఆధ్వర్యంలో దర్యాప్తు వేగవంతం చేసి అనేక కోణాల్లో విచారణ చేపట్టారు. గతంలో హత్యకు గురైన రామయ్యకు సంబంధించిన వారే ప్రతీకారంతో 14న రాత్రి పెళ్లి వేడుకలో ఉన్న రమేష్‌ను తీసుకెళ్లి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కొవ్వాసి నారాయణ, మడివి నవీన్, జల్లి వీరయ్యతో పాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామని ఆయన పేర్కొన్నారు.


