నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరమే లక్ష్యం

Apr 19 2026 7:41 AM | Updated on Apr 19 2026 7:41 AM

వచ్చే మూడేళ్లలో 20 వేల

ఉద్యోగాల కల్పన

ప్రతి రెండు నెలలకోసారి జాబ్‌ మేళా

ఏడాదికోసారి మెగా జాబ్‌ మేళా

వెబ్‌సైట్‌ కూడా రూపొందిస్తున్నాం

మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌

రాజమహేంద్రవరం సిటీ: నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరమే లక్ష్యంగా జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్నామని వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ తెలిపారు. స్థానిక మార్గాని ఎస్టేట్‌లో శనివారం నిర్వహించిన జాబ్‌ మేళాకు హాజరైన నిరుద్యోగులనుద్దేశించిన ఆయన ప్రసంగించారు. వచ్చే మూడేళ్లలో 15 వేల నుంచి 20 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తానన్నారు. ప్రతి రెండు నెలలకోసారి జాబ్‌ మేళా, ఏడాదికోసారి మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తామని ప్రకటించారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువత కోసం సుమారు 75 కంపెనీలతో స్థానిక మంజీరా కన్వెన్షన్‌లో జనవరిలో నిర్వహించిన మెగా జాబ్‌ మేళా విజయవంతమైందని చెప్పారు. ఈ మేళాలు నిరంతర ప్రక్రియగా సాగుతూ మార్గాని భరత్‌రామ్‌ జాబ్‌ సెంటర్‌గా నడుస్తుందని అన్నారు. ‘మార్గాని భరత్‌’ పేరిట వెబ్‌సైట్‌ కూడా ప్రారంభిస్తున్నామని, తమ విద్యార్హతలను బట్టి దీనిలో నిరుద్యోగ యువత, విద్యార్థులు నమోదు కావచ్చని తెలిపారు. రెండు నెలలకోసారి జరిగే జాబ్‌ మేళాకు ఇది ఉపయోగపడుతుందన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), మాన్యుఫ్యాక్చరింగ్‌, బీపీఓ, బ్యాంకింగ్‌, ఫార్మా, ఈ–కామర్స్‌ వంటి కంపెనీల నుంచి శిక్షకులను రప్పించి నిరుద్యోగులకు ఓరియెంటేషన్‌ శిక్షణ కూడా అందిస్తామని చెప్పారు. జనవరి మెగా జాబ్‌ మేళాలో ఉద్యోగం పొందిన యువతి ఇప్పుడు ఆ కంపెనీ నుంచి ఇంటర్వ్యూల నిర్వహణకు ఇన్‌చార్జిగా రావడం ఆనందంగా ఉందని భరత్‌రామ్‌ అన్నారు.

హెచ్‌ఆర్‌ కో డాట్‌ కంపెనీ హెచ్‌ఆర్‌ సుస్మిత మాట్లాడుతూ, గతంలో భరత్‌రామ్‌ నిర్వహించిన మెగా జాబ్‌ మేళాలో తాను ఉద్యోగం పొందానని అన్నారు. ఇప్పుడు ఆయన నిర్వహిస్తున్న జాబ్‌ మేళాకు తాను పని చేస్తున్న కంపెనీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి రావడం ఆనందంగా ఉందని అన్నారు. వైఎస్సార్‌ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ప్రజాసేవకు పదవులు అవసరం లేదని, మంచి మనసుంటే చాలని నిరూపించిన వ్యక్తి మార్గాని భరత్‌రామ్‌ అని అభినందించారు. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంచి విద్యను అందిస్తే.. ఆ విద్యకు సార్థకత చేకూర్చేలా భరత్‌రామ్‌ ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ జాబ్‌ మేళాకు సుమారు 25 కంపెనీలు హాజరు కాగా, వివిధ ఉద్యోగాలకు ఎంపికై న 500 మందికి మార్గాని భరత్‌రామ్‌, మార్గాని నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement