అంబరాన ఉన్నా బంగారమే! | - | Sakshi
Sakshi News home page

అంబరాన ఉన్నా బంగారమే!

Apr 19 2026 7:41 AM | Updated on Apr 19 2026 7:41 AM

‘అక్షయ’ కొనుగోళ్లకు సెంటిమెంట్‌ తోడు

ఊగిసలాడుతున్న

పేద, మధ్య తరగతి వర్గాలు

నేడు, రేపు క్రయ విక్రయాలపై

వ్యాపారుల ఆశలు

కపిలేశ్వరపురం: అర గ్రాము బంగారం అపురూపమైన రోజులివి. ఇతర దేశాల్లో ట్రేడింగ్‌ కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తుండగా మన దేశంలో ఆభరణాల కోసం కొనుగోలు చేస్తుంటారు. నేడు బంగారం కొనుగోళ్లను ఆధ్యాత్మికకు జోడించి అక్షయ తృతీయ సెంటిమెంటును పెంచుతున్నారు. ఎంత చిన్న మొత్తమైనా బంగారం కొంటే ఆ సంపద అక్షయమవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 2,500కి పైగా బంగారు దుకాణాల్లో అక్షయ తృతీయ సందర్భంగా సోమవారం సుమారు రూ.125 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా.

లోహంలో బంగారం శాతం ఇలా..

బిస్కెట్‌ లేదా కాయిన్‌ రూపంలో ఉండే బంగారాన్ని 24 క్యారెట్ల స్టాండర్డ్‌ బంగారంగా పరిగణిస్తారు. దీని క్రయవిక్రయాలు సులభతరంగా ఉంటాయి. విక్రయించాలనుకున్న రోజు బంగారం ధర ఎంత ఉందో అంత లభిస్తుంది. 91.6 బంగారం, 8.4 శాతం రాగి, వెండి తదితర లోహాలున్న కలిసి ఉన్నదాన్ని 22 క్యారెట్ల బంగారంగానూ 75 శాతం బంగారం, 25 శాతం ఇతర లోహాలుతో ఉన్నదాన్ని 18 క్యారెట్ల బంగారంగానూ పరిగణిస్తారు.

గతంలో ఇలా..

● 2000 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ.4,400 ఉండేది. 2005లో రూ.7 వేలు, 2010లో రూ.18,500, 2015లో రూ.26,300, 2020లో రూ.46 వేలు, 2025లో రూ.98,500కు పెరుగుతూ.. ప్రస్తుతం రూ.1,55,000 వరకూ పలుకుతోంది. ఇలా ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో బంగారం కొనుగోళ్లకు దూరమవుతున్న వినియోగదారుల కోసం కార్పొరేట్‌ బంగారు దుకాణదారులు ఆఫర్లతో పాటు గిఫ్ట్‌ ఓచర్లు ప్రకటిస్తూ ఆకర్షిస్తున్నారు.

● బంగారు ధరల పెరుగుదల స్వర్ణకారుల జీవితాలపై పెను ప్రభావం చూపుతున్నాయి. వివాహాది శుభకార్యాల వంటి సందర్భాల్లో తప్ప బంగారం జోలికి ఎవరూ వెళ్లడం లేదు. దీంతో, ఆర్డర్లు తగ్గిపోతూ వస్తున్నాయి.

● చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోవడం కూడా బంగారం క్రయవిక్రయాలు తగ్గడానికి కారణమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement