● తాళ్లూరు శివారులో హైవేపై ప్రమాదం
● ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
● మృత్యువును జయించిన
మరో యువకుడు
గండేపల్లి: ఒక లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఉగాది వేళ ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. ఉగాది పండగను జరుపుకునేందుకు గ్రామస్తులంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఊహించని విషయం గ్రామస్తుల చెవిన పడటంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సినిమా బెనిఫిట్ షో చూసిన యువకులు వారి ఆనందాన్ని తమ స్నేహితులు, బంధువులు, గ్రామస్తులతో పంచుకునే లోపే ఘోరం జరిగిపోయింది. కన్న కొడుకును కోల్పోయిన బాధ ఒక కన్న పేగుదైతే, తీవ్ర గాయాలతో కొడుకు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న వేదన మరో పేగు బందానిధి. మండలంలోని రామయ్యపాలెంకు చెందిన కాపుశెట్టి షణ్ముఖ శ్రీ చంద్రశేఖర్ (చందు) (17), బద్ది నాగసాయి మణికంఠ, సాలాపు లక్ష్మి వీర వెంకట కిషోర్‌లు కలిసి మోటార్ సైకిల్‌పై గురువారం విడుదలైన ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా బెనిఫిట్‌షోకు జగ్గంపేట వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తాళ్లూరు శివారు డివైడర్ వద్దకు వచ్చే సరికి ఉప్పలపాడు వెళ్లేందుకు ఆగి ఉన్న ఆటోను తప్పించే ప్రయత్నంలో వీరు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ అదుపు తప్పింది. ఈ నేపథ్యంలో వెనకే వస్తున్న లారీ డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టగా రోడ్డుపై పడిపోయిన వీరిపై నుంచి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో చందు, మణికంఠకు తీవ్రగాయాలు కాగా కిషోర్ బయటపడ్డాడు. ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న రోడ్డు సేఫ్టీ వాహన సిబ్బంది, గండేపల్లి పోలీసులు, స్థానికుల సహాయంతో రోడ్డు సేఫ్టీ వాహనంలో జెడ్ రాగంపేట వద్ద గల సీహెచ్‌సీకి క్షతగాత్రులను తరలించారు. వైద్యులు సూచనలమేరకు అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చందు మృతి చెందగా, మణికంఠ చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన లారీ తప్పించుకుపోవడంతో హైవేపై సీసీ కెమెరాలను పరిశీలించి పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. మృతుని స్నేహితుడు కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై యూవీ శివ నాగబాబు తెలిపారు. ఇదిలా ఉండగా మృతుడు చందు తల్లితండ్రులు శ్రీను, దేవిలకు రెండవ కొడుకని గ్రామస్తులు తెలిపారు. తండ్రి నిర్వహిస్తున్న చిరు వ్యాపారంలో సాయం చేస్తుండేవాడని, అందరితోనూ కలివిడిగా ఉండే చందు మృతిచెందడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు చందు, మణికంఠ ఇళ్లకు చేరుకుని వారి కుటుంబాల ఓదార్చారు.
ఇద్దరు చిననాటి స్నేహితులు
మృతుడు చందు, చికిత్స పొందుతున్న మణికంఠ చిననాటి స్నేహితులని, వీరిద్దరూ కలిసి రాజానగరం వద్ద గల ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తిచేసి సెకండ్ ఇయర్‌కు వచ్చినట్టు గ్రామస్తులు తెలిపారు. స్నేహితుడు మృతిచెందిన విషయాన్ని మణికంఠకు తెలియకుండా గోప్యంగా ఉంచినట్టు తెలిపారు.


