అల్లవరం: ఓడలరేవు సముద్ర తీరం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రోయిన్లపై నడుస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. కొమరగిరిపట్నంలో ఓ ఫంక్షన్‌కు స్నేహితులతో పాటు అమలాపురం నారాయణపేట ప్రాంతానికి చెందిన దొమ్మేటి లోకేష్ (17) వచ్చాడు. అక్కడి నుంచి లోకేష్‌తో పాటు బొక్కా సతీష్, గుత్తుల మనోజ్, బొక్కా గణేష్‌లు శుక్రవారం మధ్యాహ్నం ఓడలరేవు బీచ్‌కు చేరుకున్నారు. ఓఎన్జీసీ పశ్చిమ గేటు వద్ద నిర్మాణంలో ఉన్న గ్రోయిన్లపై లోకేష్ నడుస్తుండగా, నాచు కారణంగా జారి పడిపోయాడు. ఇంతలో సముద్రంలో స్నానం చేస్తున్న మరో యువకుడు గుర్తించి కేకలు వేసి కాపాడే ప్రయత్నం చేశారని మైరెన్ సీఐ ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. భారీ కెరటాలకు లోకేష్ సముద్రం లోపలకు కొట్టుకుపోయాడని అన్నారు. అతను దివ్యాంగుడు కావడంతో తనను తాను కాపాడుకోలేకపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవలే లోకేష్ కాలికి శస్త్రచికిత్స చేయించామని, ఇంతలో ఇలా జరిగిందని కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మైరెన్ పోలీసులు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సైలు పుల్లయ్య, రమేష్, సిబ్బంది రాజేష్, డిప్యూటీ తహసీల్దార్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


