ఆక్వాంక్షలు ఫలించక.. | - | Sakshi
Sakshi News home page

ఆక్వాంక్షలు ఫలించక..

Mar 21 2026 5:20 AM | Updated on Mar 21 2026 5:20 AM

ఉప్పలగుప్తం: ఆక్వా రైతు ఆకాంక్షలు ఫలించడం లేదు.. ఈ సాగు లాభసాటిగా ఉండడం లేదు.. వైరస్‌ల ముప్పేట దాడితో ఎటూ పాలుపోవడం లేదు.. సాగు వదలలేక, ముందుకు సాగలేక అగమ్యగోచరంలా వారి పరిస్థితి మారింది. దేశానికి రైతే రాజు అని పెద్దలు అంటుంటారు. ఒకప్పుడు రొయ్యలు సాగుచేసే రైతు రాజులాగే జీవించేవాడు. కొంత కాలంగా ఈ సాగులో నష్టాలను చూస్తూ ఢీలా పడుతున్నాడు. ప్రస్తుతం ఈ సాగు కత్తి మీద సాములా మారిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో పలువురు రైతులు కొంతకాలం సాగుకు విరామం ప్రకటించి సంవత్సరానికి రెండు సాగులు చేపట్టే దిశగా ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితులకు అనుకూలంగా జనవరి నుంచి జూన్‌ వరకూ చేసే సాగు కలసి వస్తుందని రైతులు గంపెడు ఆశతో పంట చేపడుతున్నారు. అయినప్పటికీ వాతావరణంలో మార్పు కారణంగా వైరస్‌ విజృంభించి నష్టాలు చవిచూడడం తప్పడం లేదని ఆక్వా రైతులు బెంబేలెత్తుతున్నారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు, అమలాపురం రూరల్‌ మండలాల్లో అధికారంగా, అనధికారకంగా సుమారు 30 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. మిశ్రమ పద్ధతిలో రొయ్యలు, చేపల సాగు చేస్తున్నారు. రొయ్య సాగు కలిసి వస్తే దానిపై వచ్చే ఆదాయం పెట్టుబడిగా వచ్చి, చేపల సాగుపై వచ్చే ఆదాయం రైతుకు లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో హేచరీల నిర్వాహకులు నాసిరకమైన తల్లి రొయ్యలను వాడటంతో రొయ్య సీడ్‌ నుంచి ఈహెచ్పీ అనే వ్యాధి రైతుల పాలిట శాపంగా మారింది. దీంతో రొయ్య మేత ఎక్కువగా తీసుకుని ఎదుగుదల లోపించడంతో రైతులు నష్టపోతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఏరియేటర్లు ఎక్కువ సమయం తిప్పుతూ ఆక్సిజన్‌ అందించాల్సి వస్తుందని, ఇలా అధికంగా ఖర్చు అవుతుందని, రొయ్యలు సమయానికి మేతలు తీసుకోవడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. సమయానుకూలంగా సాగును పరిశీలించుకుని శానిటైజర్లు, మందులు వాడుతూ అధికంగా ఏరియేటర్లను తిప్పుతూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

చిన్న సైజులో ఉండగానే..

ప్రస్తుత వాతావరణంలో వస్తున్న మార్పులకు ఆక్వా రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం తెల్లటి దుప్పటిలా మంచు తెర కప్పి విపరీతమైన చల్లదనాన్ని ఇస్తుంటే, ఉదయం పది గంటల నుంచి భానుడు భగభగలాడుతూ ఎండలు కాస్తూ వాతావరణంలో వేడిని పుట్టిస్తున్నాడు. దీంతో చెరువుల్లోని రొయ్యలు డీవోలతో ఉక్కిరిబిక్కిరై వైరస్‌లతో చిన్న సైజులోనే మృత్యువాత పడుతున్నాయి. కొంత మంది రైతులు లాభాల దిశగా చేప, రొయ్య మిశ్రమ సాగు (పాలీకల్చర్‌) చేస్తున్నా.. రొయ్య సాగు రోజులు గడవక ముందే కొత్త కొత్త తెగుళ్లతో చిన్న కౌంట్‌లోనే చనిపోవడంతో రొయ్యను పట్టకుండానే వదిలివేసి నష్టాలను చూస్తున్నారు. వాతావరణంలో విభిన్న మార్పులతో ఒకపక్క ఎండ, మరోపక్క మంచు కురుస్తూ చెరువులో నీటి, మట్టి నాణ్యత లోపించడం, ఆక్సిజన్‌ స్థాయి తగ్గడం డెడ్‌ ఆల్గే, విష వాయువులు విజృంభిస్తున్నాయి. వెనామీ రొయ్యల సాగులో వైట్‌ గట్‌, సెల్‌ లూజ్‌, రెడ్‌ గిల్‌, బ్లాక్‌ గిల్‌, హిబ్రియో వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

గోపవరంలో రొయ్యల పట్టుబడి

ఫ రైతులకు లాభసాటి లేదు‘రొయ్య’

ఫ వైరస్‌ల బారిన పంట

ఫ వాతావరణ మార్పులే కారణం

ఫ రోజురోజుకూ విజృంభిస్తున్న వైనం

తీవ్రంగా నష్టపోతున్నాం

హేచరీల నిర్వాహకులు పూర్వం మంచి నాణ్యత కలిగిన తల్లి రొయ్యలను తెచ్చి దానితో నాణ్యమైన పిల్లలను అందించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాసిరకమైన తల్లి రొయ్యలను వాడి నాసి రకమైన రొయ్య పిల్లలు ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఎంతో ఆశలతో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి బ్యాచ్‌లో దిగే రొయ్యకు కచ్చితంగా వైట్‌ గట్‌ సోకి సమయానికి మేత తీసుకోక ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయి. అధికారులు దృష్టి సారించి హేచరీలపై చర్యలు తీసుకోకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. –నల్లా వెంకటేశ్వరరావు,

ఆక్వా రైతు, వానపల్లిపాలెం

లాభాలు లేక..

వాతావరణంలో మార్పులకు చెరువులో రొయ్య పిల్ల లు డీవోకు గురవుతున్నాయి. దీంతో ఏరియేటర్లు ఎక్కువ సమయం తిపాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో రొయ్యలు సకాలంలో మేత తినకపోగా ఏరియేటర్లు తిప్పడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇంత కష్టపడినా సాగు లాభదాయకంగా చేతికొస్తుందనే భరోసా లేదు. నేను మూడు ఎకరాల్లో రొయ్య సాగు చేస్తున్నాను. సీడ్‌ విషయంలో నెల రోజుల క్రితం సుదూర ప్రాంతం నుంచి తెచ్చుకుని సాగు చేస్తున్నాను. అందులో ఒక చెరువు ఇటీవల హిబ్రియో వైరస్‌ వ్యాపించి పట్టుబడికి అనుకూలంగా లేకుండా పోయింది. –సురేష్‌రాజు, ఆక్వా రైతు,

కొమ్మరిగిరిపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement