ఆగనిది ఈ పయనం.. | - | Sakshi
Sakshi News home page

ఆగనిది ఈ పయనం..

Mar 21 2026 5:20 AM | Updated on Mar 21 2026 5:20 AM

పరుగులు పెట్టిస్తున్న పులి

కానెంవారి మెట్టపై తిష్ట

బయటకు వెళ్లవద్దని అధికారుల ప్రచారం

అడ్డతీగల: పులి పయనం ఆగకుండా సాగుతోంది.. అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి వచ్చి చిక్కకుండా తిరుగుతోంది.. మూగజీవాలపై దాడులకు దిగుతోంది.. అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ పెద్ద పులి శుక్రవారం ఉదయానికి వీరభద్రపురం రక్షిత అటవీ ప్రాంతానికి సమీపాన వీరభద్రపురం గ్రామానికి వెనుక ఉన్న కానెంవారి మెట్టపై తిష్ట వేసింది. అటవీ అధికారులు రేడియో కాలర్‌ సిగ్నల్స్‌ ద్వారా దీనిని గుర్తించారు. సాయంత్రానికి సరంపేట సమీపాన స్వామి కొండపై నూతుల్లోద్ది, పాకుల్లొద్దు ప్రాంతానికి చేరుకుని మకాం మార్చింది. ఆ కొండ ప్రాంతాల్లో రాతిపై చిన్న చిన్న బావుల రూపంలో గుంతలు ఉండి అక్కడ నీటి నిల్వలు ఉంటాయని, అందుకే ఆ ప్రాంతాన్ని అనువైన చోటుగా పులి ఎంచుకుందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇళ్లను విడిచి ఎవరూ బయటకు వెళ్లవద్దని, కొండ ప్రాంతాల్లో సంచరించవద్దని, చేను మకాంలో ఉండరాదని అటవీ అధికారులు తమ సిబ్బందితో మైక్‌లలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరభద్రపురం రక్షిత అటవీ ప్రాంతానికి చేరువలో ఉన్న కొట్టంపాలెం, గౌరయ్యపేట, కోనలోవ, వీరభద్రపురం, గొండోలు, రాజంపాలెం, సరంపేట గ్రామాల సమీపాన చేను మకాంలలో ఉన్న గిరిజనులు గ్రామాల్లోకి పరుగులు తీశారు. పులి తన సహజ గుణంలో భాగంగా అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుందని, మనుషుల ప్రాణాలకు ఎటువంటి హాని కలగకూడదనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నాలుగు బృందాలతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు అడ్డతీగల సబ్‌ డీఎఫ్‌ఓ సుబ్బారెడ్డి చెప్పారు. పులి కదలికలను సాంకేతికతను ఉపయోగించి ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. పశువులను గ్రామంలోకి తీసుకువెళ్లి పులి సంచారం తగ్గే వరకూ జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement