పి.గన్నవరం: కుందాలపల్లిలో ఈ నెల 16న దళితుడు కాట్రు శ్రీనివాస్ మృతదేహాన్ని గ్రామంలోని ప్రధాన రహదారి మీదుగా తీసుకు వెళ్లకుండా అడ్డుకున్న పది మందిని సోమవారం లోగా అరెస్టు చేయకపోతే, వేలాది మంది దళితులతో అమలాపురంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ సంఘటనలో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత నాయకులు శుక్రవారం పి.గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. పెళ్లి పందిరి ఉందనే కారణంతో ప్రధాన రహదారిపై నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. దళితులపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఎస్సై బి.శివకృష్ణతో దళిత సంఘాల నాయకులు మాట్లాడారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు 10 మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. డీఎస్పీ దర్యాప్తు చేసిన అనంతరం తగు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.


