ఫ అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు
ఫ ఆత్రేయపురంలో ఘటన
ఆత్రేయపురం: స్థానిక బాలాత్రిపుర సుందరీ సమేత రాజరాజేశ్వరస్వామి (శివాలయం), రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయాల ఆవరణలో తరతరాల నుంచి ఉంటున్న తమ ఇళ్లను టీడీపీ నాయకులు అక్రమంగా కూల్చివేస్తున్నారని శివాలయ అర్చకుడు పుల్లేటికుర్తి భాస్కరశర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు కుటుంబాలకు చెందిన ఇళ్లను దౌర్జన్యంగా నేలమట్టం చేసి, నిలువ నీడ లేకుండా చేశారని అన్నారు. పురాతన ఆలయాలను పునర్నిర్మించడం మంచిదే అయినా? ఎటువంటి అడ్డులేకుండా ఉన్న నివాసాలను కూల్చడం సరికాదన్నారు. ఇంతకు ముందు రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు వాడపల్లి జనార్దనస్వామి ఎంతో కష్టపడి నిర్మించుకున్న భవనాన్ని కూల్చివేశారన్నారు. దీనిపై ఆయన తీవ్ర మనోవేదనకు గురై అనారోగ్యం బారిన పడినట్లు తెలిపారు. అలాగే ఆ పక్కనే ఉంటున్న పూర్వపు ఆలయ అర్చకుడు ఆచార్యులు కుటుంబ సభ్యుల ఇంటిని సైతం అనవసరంగా కూల్చివేశారన్నారు. గ్రామంలో తమకు బలం లేనందున దౌర్జన్యంగా నివాసాలను కూల్చివేస్తున్నారని అర్చకులు ఆరోపిస్తున్నారు. కాగా శుక్రవారం తాము ఇంట్లో ఉండగా, తమ తల్లి పుల్లేటికుర్తి పల్లాలమ్మ ఎంతగా అడ్డుకున్నా వినకుండా, ఆలయానికి ఏమాత్రం అడ్డంగా లేని తమ ఇంటి గోడను కూల్చివేశారని ఆలయ అర్చకుడు భాస్కరశర్మ తెలిపారు. మొత్తం భవనం కూల్చివేస్తామని వెంటనే బయటకు వెళ్లిపోవాలని అంటున్నారని ఆయనఅన్నారు. కాగా గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు చిలువూరి రామకృష్ణరాజు, ముదునూరి బండ కృష్ణంరాజు, గొట్టుముక్కల గోపిరాజు, ముదునూరి శ్రీహరిరాజు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతను అడ్డుకున్నారు. దీంతో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు ఆగ్రహంతో దౌర్జన్యానికి దిగినట్లు ఆలయ అర్చకుడు పుల్లేటికుర్తి భాస్కరశర్మ తెలిపారు. తమకు ఆస్తిపాస్తులు లేవని, కేవలం ఆలయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని అన్నారు. చివరికి వైఎస్సార్ సీపీ నాయకుల ఒత్తిడితో టీడీపీ నాయకులు ఆదివారం పెద్దలతో చర్చిస్తామని అన్నారు. అంతవరకూ కూల్చివేతను నిలుపుదల చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులు చెప్పారు. అర్చకుల కుటుంబాలకు అన్యాయం చేస్తే సహించేది లేదని, వారికి నచ్చజెప్పి నష్టపరిహారం అందించి భవిష్యత్ కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ నాయకుడు గొట్టుముక్కల గోపిరాజు తదితరులు కోరారు. దీనిపై రాష్ట్ర అర్చక సమాఖ్య నాయకుడు రాంబాబు త్వరలో ఆత్రేయపురం వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.


