● పంచారామ క్షేత్ర
కోనేరులో మునిగి యువకుడి మృతి
● నిశ్చితార్థం అయిన
నాలుగు రోజులకే మృత్యువాత
సామర్లకోట: నిశ్చితార్థం చేసుకున్న జంట బంధువులతో కలిసి పంచారామ క్షేత్రంలోని స్వామివారి దర్శనానికి వచ్చారు. అయితే ఆలయ కోనేరే యువకుని మృతికి కారణమైంది. పెద్దాపురం, కొత్తపేటకు చెందిన వెన్నెల ప్రశాంత్ (27)కు నాలుగు రోజుల క్రితమే నిశ్చితార్థం అయింది. ఆ జంట బంధువులతో కలిసి స్వామి వారి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో ఆలయ కోనేరులో స్నానానికి దిగిన ప్రశాంత్ కోనేరులో మునిగిపోయాడు. వెంటనే ప్రశాంత్ స్నేహితులు, స్థానికులు, కోనేరులోకి దిగి ప్రశాంత్‌ను బయటకు తీసి మోటారు సైకిల్‌పై స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు పరీక్షించి ప్రశాంత్ మృతి చెందినట్టు ధ్రువీకరించారు. దాంతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి ఆవరణలో విషాద ఛాయలు అలముకున్నాయి. కొతపేటలో నివాసం ఉంటున్న ప్రశాంత్ కుటుంబ సభ్యులకు వాలుతిమ్మాపురం రోడ్డులో టిడ్కో గృహం రావడంతో అక్కడ నివాసం ఉంటున్నారు. ప్రశాంత్ సామర్లకోట ఏఐఎఫ్‌ఎల్ డిపోలో హమాలీగా పని చేస్తున్నట్లు స్నేహితులు తెలిపారు. కోనేరులో ఈత కొట్టే సమయంలో ఆయాసం రావడం వల్ల మునిగిపోయినట్టు స్థానికులు తెలిపారు. ఆలయ కోనేరులో గ్రిల్స్ ఏర్పాటు చేసినా వాటిని దాటి కోనేరులోకి దిగడం వల్ల తరుచూ ఇటు వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎక్కువగా వచ్చి కోనేరులో స్నానాలు చేసే అవకాశం ఉన్న కారణంగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని స్థానికులు కొరుతున్నారు.


