అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి

Mar 19 2026 7:53 AM | Updated on Mar 19 2026 7:53 AM

కాజులూరు: మండంలోని పల్లిపాలెం చేపల చెరువుల వద్ద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కాజులూరి వెంకటనరసింహారెడ్డికి చెందిన చేపల చెరువులను కాజులూరు శివారు అగ్రికుల క్షత్రియుల పేటకు చెందిన రచ్చ గొల్లరాజు కౌలుకు సాగుచేస్తున్నాడు. బుధవారం రాత్రి సుమారు 60 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి చెరువుల వద్దకు వచ్చి గట్టుపై గల మంచంపై మృతి చెందాడు. మృతుడు చామనఛాయ కలిగి నీలం రంగు గళ్ల లుంగీ, క్రీమ్‌ కలర్‌ టీ షర్టు ధరించి ఉన్నాడు. ఎడమ చేయి దండపై ఒకటి, పొట్టపై బొడ్డు పక్కన ఒకటి, ఎడమ మోకాలిపై ఒకటి పుట్టుమచ్చలు ఉన్నాయి. వీఆర్వో జుత్తుక రాధాకృష్ణ పిర్యాదు మేరకు గొల్లపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు 94407 96559 నంబరుకు ఫోన్‌ చేసి సమచారమివ్వాలని ఎస్సై ఎం.మోహన్‌కుమార్‌ తెలిపారు.

22న పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు

అమలాపురం టౌన్‌: స్థానిక హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 22న స్థానిక ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ సమీపంలో గల జనహిత భవనంలో ఐదవ ఉభయ గోదావరి జిల్లాల క్లాసిక్‌ పవర్‌ లిఫ్టింగ్‌, బెంచ్‌ ప్రెస్‌ (మెన్‌ అండ్‌ వుమెన్‌) పోటీలు–2026 జరగనున్నాయని ఆ జిమ్‌ కోచ్‌, పోటీల ఆర్గనైజర్‌ డాక్టర్‌ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌, మాస్టర్స్‌ విభాగాల్లో జరగనున్న ఈ పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్‌ 3, 4, 5 తేదీల్లో విజయనగరం జిల్లా రాజాంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ క్రీడాకారుల నుంచి జిల్లా జట్టును ఎంపిక చేయనున్నట్టు వెంకటేశ్వరరావు తెలిపారు.

కారు ఢీకొని వ్యక్తి మృతి

అల్లవరం: బెండమూర్లంక ప్రధాన రహదారిపై అల్లవరం పొలం వద్ద రోడ్డు దాటుతున్న సైకిలిస్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోడి గ్రామానికి చెందిన కాశీ నాగరాజు (60) అక్కడికక్కడే మృతి చెందారు. నాగరాజు గోడి నుంచి రెల్లుగడ్డకు సైకిల్‌పై వెళ్తుండగా అల్లవరం పొలం వద్ద దాటుతుండగా ఏపీ 28 డీజీ 9128 నెంబరు గల కారు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో నాగరాజు ఘటనా స్థలంలోనే మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సంపత్‌కుమార్‌ తెలిపారు.

ఇష్టారీతిన తవ్వేస్తున్నారు

పిఠాపురం: రెండు శాఖల అధికారుల సమన్వయలోపం కారణంగా ఇటీవల నిర్మించిన రోడ్డు పూర్తి కాకుండానే తవ్వేస్తున్నారు. ఇటీవల చేపట్టిన పిఠాపురం – ఉప్పాడ రోడ్డు నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఏం చేసినా అడిగేవారు లేరన్నట్టు పిఠాపురం ఆర్‌అండ్‌బీ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు వ్యవహరిస్తున్నారు. రోడ్డు పనులు పూర్తి కాకుండానే ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నూతన పైపులైన్‌ నిర్మాణం పేరుతో ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. రూ.కోట్ల వ్యయంతో పిఠాపురం నుంచి ఉప్పాడ వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మించి రెండు రోజులు పూర్తికాకుండానే యంత్రాలతో తవ్వేస్తున్నారు. కొత్తపల్లి మండలం వాకతిప్ప సూరప్ప చెరువులో నిర్మించిన నాగులాపల్లి ఏరియా రక్షిత గ్రామీణ మంచినీటి పథకానికి పిఠాపురం మండలం నవఖండ్రవాడ వద్ద ఉన్న పీబీసీ నుంచి నీటిని తరలించేందుకు కొత్తగా పైప్‌లైన్‌ నిర్మిస్తున్నారు. దీని కోసం రోడ్డు తవ్వుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కొత్తగా వేసిన రోడ్డు తవ్వేడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. పైప్‌లైన్‌ పూర్తయ్యాక రోడ్డు నిర్మించాల్సిందని పలువురు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమి చోద్యం ప్రజాధనం అంటే అంత చులకగా ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement