మలికిపురం: ఆల్ ఇండియా మహిళా ప్రీమియర్ లీగ్ వాలీబాల్ పోటీలు బుధవారం మండలం తూర్పుపాలెంలో ప్రారంభమయ్యాయి. స్థానిక అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ జరగనున్న ఈ పోటీలను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. మార్క్ ఫెడ్ డైరెక్టర్ గుండుబోగుల పెదకాపు, ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.
70 కిలోల గంజాయి స్వాధీనం
బాలుడితో సహా ఐదుగురి అరెస్టు
రాజవొమ్మంగి: మండలంలోని జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలో అమీనాబాద్ వద్ద వాహనాల తనిఖీలో 70 కిలోల గంజాయి పట్టుబడినట్లు ఎస్సై చినబాబు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు అల్లూరి జిల్లా చింతపల్లి ప్రాంతంలో కొనుగోలు చేసిన గంజాయిని ఐదుగురు వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై మైదాన ప్రాంతానికి తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. వీరిలో దేవుడు అన్నవరానికి చెందిన పాకపర్తి శ్రీదేవి, రాజవొమ్మంగికి చెందిన పొట్నూరి వీరబాబు, అద్దేపల్లి వీరబాబు, పాడిశెట్టి శివాజీ, ఒక బాలుడు ఉన్నారన్నారు. వీరి నుంచి గంజాయి, ఆరు సెల్ ఫోన్లు, రూ.900 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గెజిటెడ్, రెవెన్యూ అధికారుల సమక్షంలో గంజాయి తూకం వేసి పంచనామా పూర్తి చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.


