బీఆర్‌ నాయుడు రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ నాయుడు రాజీనామా చేయాలి

Mar 18 2026 11:08 AM | Updated on Mar 18 2026 11:08 AM

టీటీడీ ప్రతిష్టను మంటగలిపిన చైర్మన్‌ నాయుడు

చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం

శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే దాడులు చేయడం అమానుషం

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ

రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన

రాజమహేంద్రవరం రూరల్‌: తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, స్వామివారిని కోట్లాది మంది భక్తులు ఆరాధ్య దైవంగా భావిస్తారని, అటువంటి ఆలయానికి బీఆర్‌నాయుడు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భక్తులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. బీఆర్‌నాయుడు టీటీడీ ప్రతిష్టను మంటగలిపారన్నారు. టీటీడీ చైర్మన్‌ పదవికి బీఆర్‌నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం స్థానిక మోరంపూడి జంక్షన్‌లో భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. తిరుపతి గ్రాండ్‌ రిడ్జ్‌ హోటల్‌ దగ్గర శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్‌ సీపీకి చెందిన మహిళలపై దాడి చేసి తిరిగి వారిపైనే తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండించారు. ముందుగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీమంత్రి తానేటి వనిత, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్‌, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకటరావు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ తిరుమల స్వామివారి లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు టీటీడీకి మచ్చ తీసుకొచ్చారన్నారు. బీఆర్‌నాయుడు రుణం తీర్చుకోవడానికి ఆయనకు టీటీడీ చైర్మన్‌ పదవిని చంద్రబాబు కట్టబెట్టారన్నారు. మహిళల పట్ల అతని ప్రవర్తన సమాజం తలదించుకునేలా ఉందన్నారు. బీఆర్‌నాయుడును చైర్మన్‌ పదవి నుంచి తప్పించాలని భక్తులు ఎంతోమంది డిమాండ్‌ చేస్తున్నారన్నారు. బీఆర్‌నాయుడు చంద్రబాబు సొంత మనిషి కావడం వ్లనే విలేకరులు ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదన్నారు. నా దైవం వెంకటేశ్వరస్వామి అని చెప్పే చంద్రబాబు టీటీడీలో సమస్యలు వస్తే బీఆర్‌ నాయుడును ఎందుకు తప్పించటం లేదన్నారు. టీటీడీనీ ప్రక్షాళన చేసి నాయుడుపై చర్యలు తీసుకోవాలని, శాంతియుతంగా మహిళలు ధర్నా చేస్తే వారిపై దాడి చేయించి, తిరిగి వారిపై కేసులు పెట్టి రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెల్లుబోయిన వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించామన్నారు. బీఆర్‌ నాయుడుని వెంటనే ఆపదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమ కేసులు

పరిపాటి

మాజీమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ మంత్రులు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం పరిపాటిగా మారిందన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ అంటూ చంద్రబాబు రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు. కానీ అక్కడ పప్పులు ఉడకకపోవడంతో డ్రైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారన్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వివాహేతర సంబంధం విషయంపై విచారణ జరపకుండా, చర్యలు తీసుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో న్యాయం లేదు, శాంతిభద్రతలు క్షీణించాయి, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

వేంకటేశ్వరస్వామితో చంద్రబాబు చెలగాటం

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ కలియుగ దైవం వేంకటేశ్వరస్వామితో చంద్రబాబు చెలగాటమాడుతున్నారన్నారు. ప్రత్యక్ష సాక్ష్యాలు, ఆధారాలతో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడు వివాహేతర సంబంధం బయటపడినప్పటికీ సీఎం చంద్రబాబు స్పందించకపోవడం బాధాకరమన్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడుపై చర్యలు తీసుకోవాలని తిరుపతిలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తే వారిపై దాడిచేసి, కొట్టి తిరిగి వాళ్లపైనే కేసులు పెట్టడం అమానుషమన్నారు. పవిత్రమైన టీటీడీ చైర్మన్‌గా ఉన్న బీఆర్‌నాయుడుపై ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడం ప్రపంచవ్తాప్తంగా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు.

బీఆర్‌నాయుడును బర్త్‌రఫ్‌ చేయాలి

మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌కేసులో పట్టబడ్డ పుట్టామహేష్‌కుమార్‌యాదవ్‌కు షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామిని రాజకీయంగా ఉపయోగించుకున్న తెలుగుదేశం పార్టీకి రానున్న రోజుల్లో గడ్డుకాలం తప్పదన్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడును పదవి నుంచి బర్త్‌రఫ్‌ చేయాలని భరత్‌రామ్‌ డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు మాట్లాడుతూ టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడుపై చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కల్తీల కూటమి ప్రభుత్వంలో అన్యాయాలు పెరిగిపోయాయన్నారు. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లితే మాత్రం భక్తులు సహించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ సత్తిసూర్యనారాయణరెడ్డి, జి.శ్రీనివాసులనాయుడు, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు నక్కారాజబాబు, గిరజాల బాబు, తోట రామకృష్ణ,, రాష్ట్ర, జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement