నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం

Mar 18 2026 11:08 AM | Updated on Mar 18 2026 11:08 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభించనున్నట్టు కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో దివ్యాంగ శక్తి పథకంపై టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో బస్సులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 60 నుంచి 80 మంది దివ్యాంగులను గుర్తించి రెండు విడతలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఒక బృందంలోని దివ్యాంగులతో స్థానిక శాసనసభ్యులు సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొననున్నారని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో కూడా దివ్యాంగులతో సహపంక్తి భోజనం నిర్వహించనున్నట్లు జేసీ వై మేఘా స్వరూప్‌ వెల్లడించారు.

సైకత శిల్పి శ్రీనివాస్‌కి

జీవన సాఫల్య పురస్కారం

రంగంపేట: స్థానిక సైకత శిల్పి దేవిన శ్రీనివాస్‌ను ఉగాది జీవ న సాఫల్య పురస్కారం వరించింది. హైదరాబాద్‌ కు చెందిన విపంచి ఫౌండేషన్‌ ఉగాదిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో నిష్ణాతులకు జీవన సాఫల్య పురస్కారాలను అందజేస్తోంది. సైకత శిల్ప కళ ద్వారా సమాజ చైతన్యానికి కృషి చేస్తున్నందుకు శ్రీనివాస్‌కు అందజేయనుంది. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ పురస్కారం శ్రీనివాస్‌ అందుకోనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం సంస్థ జ్యూరీ కమిటీ వెల్లడించింది.

నవోదయ ప్రవేశ పరీక్షలో 33వ ర్యాంక్‌

కరప: నవోదయ ప్రవేశ పరీక్షలో యండమూరు విద్యార్థిని గుబ్బల అవంతిక జిల్లా స్థాయిలో 33వ ర్యాంక్‌ సాధించింది. యండమూరులోని మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఆమె ఇటీవల నవోదయ ప్రవేశ పరీక్ష రాసింది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఆమె ఈ ర్యాంక్‌ సాధించిందని ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎ.కామేశ్వరరావు, ఎంఏ అలీమ్‌ తెలిపారు. అవంతికను సర్పంచ్‌ మారెళ్ల శివ, ఎంఈఓలు కె.బుల్లికృష్ణవేణి, పి.సత్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు.

మహాశివరాత్రికి రూ.34.34 లక్షల ఆదాయం

సామర్లకోట: పంచారామ క్షేత్రమైన బాలాత్రిపురసుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా రూ.34,34,739 ఆదాయం వచ్చిందని ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌ 9 నుంచి మంగళవారం వరకూ 160 రోజులకు గాను దేవదాయ శాఖ తనిఖీదారు ఫణికుమార్‌ పర్యవేక్షణలో హుండీల ఆదాయాన్ని లెక్కించారు. హుండీల ద్వారా రూ.18,23,194, మహాశివరాత్రి నాడు స్వామి వారి దర్శన టికెట్ల ద్వారా రూ.8,65,140, కానుకలు రూ.33,701, ప్రసాద విక్రయం ద్వారా రూ.3,43,825, ఆర్జిత సేవల ద్వారా రూ.36,116, స్వామి వారి ఫొటోల అమ్మకం ద్వారా రూ.105, అన్నదాన విరాళాలు రూ.3,32,658 వచ్చాయని ఈఓ వివరించారు. గత ఏడాది హుండీల ఆదాయంతో కలిపి రూ.29,66,406 ఆదాయం వచ్చిందని చెప్పారు.

ఆదాయం లెక్కింపులో ఉత్సవ కమిటీ చైర్మన్‌ కంటే జగదీష్‌ మోహన్‌రావు, ట్రస్టు బోర్డు సభ్యులు, ఆలయ సూపరింటెండెంట్‌ ఈశ్వరరావు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, భక్తసంఘ సభ్యులు, ఉండూరు, జగ్గంపేట సేవా సంఘం సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement